




శ్రీశైల దేవస్థానం:
మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని పంచాహ్నిక దీక్షతో ఏడు రోజులపాటు నిర్వహించే సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో ఈ రోజు శ్రీ స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిపారు.
ఉత్సవాలలో భాగంగానే యాగశాల లో శ్రీచండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపారు. అనంతరం లోక కల్యాణంకోసం జపాలు, పారాయణలు చేసారు.
తరువాత మండపారాధనలు, పంచావరణార్చనలు, రుద్రహోమం కార్యక్రమాలను ఆగమశాస్త్రం ప్రకారంగా జరిగాయి.
అదే విధంగా ఈ సాయంకాలం ప్రదోషకాలపూజలను, హోమాలను జరిపించిన తరువాత జపానుష్టానాలు జరిపారు.
:ఈ బ్రహ్మోత్సవాలలో వాహనసేవలలో భాగంగా ఈ రోజు సాయంకాలం శ్రీ స్వామిఅమ్మవార్లకు రావణ వాహనసేవ జరిగింది .
ఈ సేవలో శ్రీ స్వామిఅమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో రావణవాహనంపై వేంచేపు చేయించి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు.
తరువాత పురవీధులలో గ్రామోత్సవం జరిగింది. గ్రామోత్సవములో జానపద కళారూపాల ప్రదర్శన, కోలాటం తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
శనివారం కార్యక్రమాలు:
మకర సంక్రాంతి సందర్భంగా 17న ఉదయం శ్రీ స్వామిఅమ్మవార్లకు ప్రాత:కాల పూజల అనంతరం ఉదయం గం. 8.45 ల నుండి శ్రీస్వామివారి యాగశాలలో పూర్ణాహుతి అవబృదం, కలశోద్వాసన, వసంతోత్సవం, మహదాశీర్వచనం, తీర్థప్రసాద వితరణ, విశేషార్చనలు జరుగుతాయి.
సాయంత్రం గం.6.00ల నుండి సదస్యమ్, నాగవల్లి, రాత్రి గం.7.30లకు ధ్వజావరోహణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
కనుమ సందర్భంగా గోపూజా మహోత్సవం:
కనుమ పర్వదినాన్ని పురస్కరించుకుని దేవస్థానం ఈ రోజు (16.01.2026) గోపూజ మహోత్సవాన్ని నిర్వహించింది.ఆలయ ప్రాంగణములోని శ్రీ గోకులంలోనూ మరియు దేవస్థానం గో సంరక్షణశాలలోనూ ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ప్రతీనిత్యం ఆలయంలో ప్రాత:కాల సమయంలో నిత్యసేవగా గోపూజ నిర్వహించబడుతున్నప్పటికీ, కనుమ పండుగ సందర్భంగా ఈ రోజు నిత్య గోసేవతో పాటు విశేషంగా గోపూజ జరిపారు.
ఈ కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ దేవకి వెంకటేశ్వర్లు, ప్రత్యేక ఆహ్వానితులు కె. సుధాకరరెడ్డి ఎ. శ్రీనివాసులు, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు.
ఈ విశేష కార్యక్రమములో ముందుగా ఆలయములోని శ్రీగోకులం వద్ద లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు, వేదపండితులు పూజాసంకల్పాన్ని పఠించారు.
ఆ తరువాత పూజాదికాలు నిర్విఘ్నంగా జరిగేందుకుగాను ముందుగా మహాగణపతి పూజ జరిపారు.
అనంతరం శ్రీసూక్తంతోనూ,గోఅష్టోత్తరమంత్రంతోనూ, గోవులకు షోడశ ఉపచారాలతో పూజాదికాలు జరిపారు. గోవులకు మరియు గోవత్సాలకు (ఆవుదూడలకు) నూతన వస్త్రాలు సమర్పించారు. చివరగా గోవులకు నివేదన, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు.
ఆ తరువాత దేవస్థానం గో సంరక్షణశాలలోని శ్రీకృష్ణుని విగ్రహానికి పూజాదికాలను జరిపించారు. తరువాత వృషభాలకు, గోవులకు సంప్రదాయ బద్దంగా పూజాదికాలు జరిపి నూతన వస్త్రాలను సమర్పించారు.
అదేవిధంగా ఈ విశేష కార్యక్రమములో వృషభాలకు కూడా సంప్రదాయబద్దంగా పూజాదికాలతో గ్రాసం అందజేసారు.
కాగా మన వేదసంస్కృతిలో గోవుకు ఎంతో విశేషస్థానం ఉంది. మన వేదాలు ఉపనిషత్తులు, శాస్త్రాలు, పురాణాలు మొదలైనవన్నీ కూడా గోపూజ ఫలితాన్ని విశేషంగా పేర్కొన్నాయి. గోవు సకల దేవతలకు ఆవాస స్థానం కావడం చేత గోవును పూజించడం వలన దేవతలందరినీ పూజించిన ఫలితం లభిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా గోపూజను ఆచరించడం వలన లోకం సుభిక్షంగా ఉంటుందని, శాస్త్రాలు పేర్కొంటున్నాయి.
సాంస్కృతిక కార్యక్రమాలు:
దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా) ఈరోజు శ్రీ తాతా సందీప్ శర్మ, రాజమహేంద్రవరం వారిచే శివతత్త్వం పై ప్రవచన కార్యక్రమం జరిగింది.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం 6 గంటల నుండి ఈ ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
రెండవ కార్యక్రమములో భాగంగా ఎస్. సంధ్యారాణి బృందం, హైదరాబాద్ వారిచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.
