శాస్త్రోక్తంగా పూర్ణాహుతి
శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో పదో రోజు సోమవారం ఉదయం శ్రీ స్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి. శ్రీ స్వామివారి యాగశాల లో శ్రీ చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిగాయి. రుద్రహోమం, చండీహోమం జరిపారు.తరువాత యాగ పూర్ణాహుతి, వసంతోత్సవం, అవబృథం, త్రిశూలస్నానం, కార్యక్రమాలు నిర్వహించారు.
పూర్ణాహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా నారికేళాలు, పలు సుగంధ ద్రవ్యాలు, ముత్యం, పగడం, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించి యాగ కార్యక్రమాన్ని పూర్తి చేసారు.అనంతరం జరిగిన వసంతోత్సవంలో ఆలయ అర్చకులు, వేదపండితులు వసంతాన్ని పసుపు, సున్నం కలిపిన మంత్ర పూరిత జలం సమంత్రకంగా భక్తులపై ప్రోక్షించారు.తరువాత జరిగిన అవబృథస్నానంలో చండీశ్వరస్వామికి సరస్వి పుష్కరిణీ వద్ద ఆగమశాస్త్రోక్తంగా స్నపన కార్యక్రమం నిర్వహించారు. చివరగా త్రిశూలస్నాన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమం లో ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న, ధర్మకర్తల మండలి సభ్యులు, ఎం. విజయలక్ష్మి ఎ. లక్ష్మీ సావిత్రమ్మ, మేరాజోత్ హనుమంత్ నాయక్, మధుసూదన్రెడ్డి, శ్రీమతి సూరిశెట్టి మాధవీలత, డా. కనకదుర్గ, ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు, కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శాస్త్రీయంగా ధ్వజావరోహణ:
బ్రహ్మోత్సవాలలో భాగంగా సాయంకాలం ధ్వజావరోహణ కార్యక్రమం ప్రత్యేకం.
ఈ ధ్వజావరోహణ కార్యక్రమంలో ఉత్సవాల మొదటిరోజున బ్రహ్మోత్సవ ప్రారంభ సూచకంగా ఆలయ ప్రధాన ధ్వజస్తంభంపై ఆవిష్కరింపజేసిన ధ్వజపటం అవరోహణ విశేషం.
సదస్యం – నాగవల్లి:
నిత్య కల్యాణ మండపంలో సదస్యం, నాగవల్లి కార్యక్రమాలు జరిగాయి. సదస్యం కార్యక్రమంలో వేదపండితులచే వేదస్వస్తి నిర్వహించారు.వేదస్వస్తిలో వేదపండితులు చతుర్వేద పారాయణలతో, స్తోత్రాలతో శ్రీస్వామిఅమ్మవార్లను
స్తుతించారు.ఆ తరువాత జరిగే నాగవల్లి కార్యక్రమంలో మహాశివరాత్రి రోజున కళ్యాణమైన శ్రీ భ్రమరాంబాదేవి వారికి ఆగమశాస్త్రం సంప్రదాయం మేరకు మెట్టెలు, నల్లపూసలు సమర్పించారు.
మంగళవారం ముగియనున్న బ్రహ్మోత్సవాలు
ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపటితో (21న ) ముగియనున్నాయి. ఈ ఉత్సవాల ముగింపులో భాగంగా ఉదయం శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు వుంటాయి. తరువాత సాయంకాలం శ్రీ స్వామివార్లకు అశ్వవాహనసేవ, ఆలయ ఉత్సవం జరుగుతాయి. ఆలయ ఉత్సవం అనంతరం శ్రీస్వామిఅమ్మవార్లకు పుష్పోత్సవం, శయనోత్సవం
జరుగుతాయి.
Post Comment