శ్రీశైల దేవస్థానం: హైదరాబాదు దంపతుల సహకారంతో నిర్మితమవుతున్న అమ్మవారి ఆలయ నూతన యాగశాల బంగారు శిఖరం సిద్ధమై పూజలు అందుకుంది. శుక్రవారం ఈ బంగారు కలశానికి పూజాదికాలు చేసారు . కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న, దాత దంపతులు ఈ పూజాదికాలలో పాల్గొన్నారు.అమ్మవారి ఆలయం లో వున్న యాగశాల ప్రదేశం లోనే రాతి కట్టడం తో నూతన యాగశాల నిర్మితమవుతోంది. హైదరాబాద్ కు చెందిన బట్టా పర్వతయ్య, శ్రీమతి శారదాదేవి ఈ యాగశాలను నిర్మింపజేస్తున్నారు. ఈ నెల 12 వ తేదీన యాగశాల పై కప్పు పనులు ప్రారంభించారు.శుక్రవారం యాగ మండప విమానంపై నెలకొల్పేందుకు బంగారు శిఖరం (బంగారు పూత కలశం) సిద్ధం అయింది.
సంప్రదాయబద్ధంగా మేళతాళాలతో కలశాన్ని ఆలయ ప్రాంగణములోనికి తెచ్చారు. .ఆలయం లో కూడా ఈ కలశానికి పున:పూజలు జరిగాయి. యాగశాలపై నెలకొల్పే సింహ శిల్పాలకు కూడా ఈ రోజు పూజాదికాలు జరిగాయి. యాగశాలపై అష్టదిక్కుల్లో కూడా సింహ శిల్పాలు ఏర్పాటు చేస్తారు.
ఇప్పటి వరకు యాగశాల ఉపపీఠం, పీఠంపై స్తంభాలు నెలకొల్పడంలాంటి పనులు పూర్తి అయ్యాయి. ప్రస్తుతం పై కప్పు పనులు జరుగుతున్నాయి.ఈ స్తంభాలపై అష్టాదశ శక్తిపీఠాలు, నవదుర్గల మూర్తుల రూపాలు మలిచారు .ఈ కార్యక్రమం లో ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, అధికారులు తదితర సిబ్బంది పాల్గొన్నారు.