Srisaila Devasthanam: Vendi Rathotsava Seva, Sahasra Deepalankarana seva and other puja events performed in the temple on 19th Jan.2026. Archaka swaamulu performed the puuja.
*సాంస్కృతిక కార్యక్రమాలు:
దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం) సోమవారం శ్రీ ఆముదాల మురళి శతావధాని, తిరుపతి “శివానందలహరి” పై ప్రవచన కార్యక్రమం సమర్పించారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం 6 గంటల నుండి ఈ ప్రవచన కార్యక్రమం జరిగింది.
రెండవ కార్యక్రమంలో భాగంగా శ్రీ శ్రీనివాస భజన సమాజము, ప్రకాశంవారు భజన కార్యక్రమం సమర్పించారు.
ఈ కార్యక్రమం లో గణపతి ప్రార్థన, శివశివ శంకరా, శంభో హరహర మహాదేవ, లింగాష్టకం, శ్రీశైలవాస, పార్వతి నాథుడా, శ్రీగిరి మల్లయ్య కైలాసగిరివాసా మొదలైన పలు భక్తి గీతాలను, భజన కీర్తనలను వెంకటేశ్వరరావు, పెద్ద ఆంజనేయులు, సత్యవతి, నారాయణమ్మ తదితరులు ఆలపించారు.
నిత్య కళారాధనలో ఆయా రోజులలో హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి.
శ్రీస్వామి అమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని , ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్యకళారాధన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
లోకకల్యాణార్థం పంచమఠాలలో పూజాదికాలు:
లోక కల్యాణార్థం పంచమఠాలలో ఈ రోజు ఉదయం విశేషంగా అభిషేకం, పుష్పార్చనలు జరిగాయి. ముందుగా ఘంటామఠంలో ఆ తరువాత వరుసగా భీమశంకరమఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠం, సారంగధర మఠాలలో ఈ పూజాదికాలు జరిపారు.
కాగా ఈ రోజు జరిగిన విశేషపూజాదికాలలో ముందుగా అర్చకస్వాములు లోకకల్యాణ సంకల్పాన్నిపఠించారు.
ఈ సంకల్పంలో, దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలనీ, జనులందరికీ ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలనీ, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలంటూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు. తరువాత, కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని ఘంటామఠంలోని గణపతికి పూజాదికాలు నిర్వహించారు. తరువాత అన్ని మఠాలలో సంప్రదాయబద్దంగా అభిషేకాది అర్చనలను నిర్వహించారు.
కాగా శ్రీశైల సంస్కృతిలో చాలాకాలం పాటు మఠాలు ప్రధానపాత్ర పోషించాయి. ప్రస్తుత సాధారణ శకం 7వ శతాబ్దం నుంచి నిర్మించిన ఈ మఠాలు, గర్భాలయం, అంతరాలయం, ముఖమండపం లాంటి నిర్మాణాలను కలిగివుండి, చూడటానికి ఆలయాల మాదిరిగానే కనిపిస్తాయి.
కొన్ని శతాబ్దాల నుండి కూడా ఈ మఠాలన్నీ క్షేత్ర ప్రశాంతతలోనూ, ఆలయ నిర్వహణలోనూ, ఆధ్యాత్మికపరంగా, భక్తులకు సదుపాయాలను కల్పించడంలోనూ ప్రధాన భూమికను వహించాయి.
శ్రీశైలంలో కొన్ని మఠాలు కాలగర్భములో కలిసిపోగా, ప్రస్తుతం ఆలయానికి దగ్గరలో వాయువ్య భాగాన ఘంటామఠం, భీమశంకరమఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠం, సారంగధర మఠం మఠాలు పంచమఠాలనే పేర్లతో పిలువబడుతున్నాయి.
కాగా శిథిలావస్థలో ఉన్న ఈ మఠాలలో ఘంటామఠం, విభూతిమఠం, రుద్రాక్షమఠాలను దేవస్థానం పూర్తిగా పునరుద్ధరించింది. ప్రాచీన నిర్మాణశైలికి ఎలాంటి విఘాతం కలుగకుండా ఈ పునర్నిర్మాణ పనులు పూర్తి చేసారు. అదేవిధంగా భీమశంకర మఠానికి తగు మరమ్మతులు కూడా చేసారు.
ఈ మఠాలలోని దేవతా మూర్తులకు నిత్యధూపదీప నివేదన కైంకర్యాలు చేస్తున్నారు.
