





శ్రీశైల దేవస్థానం:పుష్పపల్లకీ సేవలో పులకించిన భక్తజనం:
శ్రీశైలంలో పాగాలంకరణ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ , జిల్లా ఎస్పీ
శ్రీశైలం / నంద్యాల జిల్లా, ఫిబ్రవరి 13:-
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైల మహా పుణ్యక్షేత్రంలో శివరాత్రి రోజు నిర్వహించనున్న పాగాలంకరణ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి శుక్రవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ కూడా ఈ పరిశీలనలో పాల్గొన్నారు.
పాగా అలంకరణ దర్శనం కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్లను, భక్తుల రాకపోకల మార్గాలను, భద్రతా చర్యలను కలెక్టర్ , ఎస్పీ సమగ్రంగా తనిఖీ చేశారు. దర్శనార్థం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సక్రమమైన మార్గదర్శకాలు, తాగునీటి సౌకర్యం, వైద్య సహాయం వంటి మౌలిక సదుపాయాలను సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ప్రత్యేకంగా పాగాలంకరణ సమయంలో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ ఏర్పాట్లు, భద్రతా బందోబస్తు తదితర అంశాలపై పోలీసు శాఖతో సమన్వయం కొనసాగించాలని సూచించారు. భక్తుల ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని అదనపు సిబ్బందిని నియమించి, నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.
అదేవిధంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ అవసరమైన సూచనలు ఇవ్వాలని పేర్కొన్నారు. భక్తులు సంయమనం పాటిస్తూ అధికారుల సూచనలు అనుసరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, రెవెన్యూ, పోలీసు ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
భక్తులతో కలిసి క్యూలైన్లో నిలబడి, సహపంక్తిగా భోజనం చేసిన జిల్లా కలెక్టర్
శ్రీశైలం / నంద్యాల, ఫిబ్రవరి 13 :-
శ్రీశైలం క్షేత్రంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉచిత క్యూలైన్ ద్వారా వచ్చే భక్తులకు అన్ని విధాలా సమగ్ర సదుపాయాలు కల్పించినట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. భక్తుల సౌకర్యం, భద్రత, పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ ఏర్పాట్లు పటిష్టంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం సాధారణ భక్తులతో కలిసి ఉచిత క్యూలైన్లో ప్రయాణించిన జిల్లా కలెక్టర్, శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవస్థానం లో స్వామి, అమ్మవార్లను భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. క్యూలైన్లో భక్తులతో మమేకమై వారి అభిప్రాయాలు, సూచనలు స్వయంగా తెలుసుకున్నారు. దర్శన సమయం, క్యూలైన్ నిర్వహణ, తాగునీరు, వైద్య సదుపాయాలు, విశ్రాంతి ఏర్పాట్లపై భక్తులను అడిగి వివరాలు సేకరించారు.
దర్శనానంతరం స్వామివారి ఉచిత లడ్డు ప్రసాదాన్ని భక్తులకు స్వయంగా పంపిణీ చేశారు. లడ్డు కౌంటర్ల వద్ద టోకెన్ విధానం, క్రమబద్ధమైన సరఫరా ప్రక్రియ, నిల్వలు, భక్తుల రద్దీ నియంత్రణ తదితర అంశాలను పరిశీలించారు. ప్రసాద పంపిణీ వేగవంతంగా, పారదర్శకంగా జరుగుతున్నదీ నిర్ధారించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అదనపు సిబ్బంది నియామకం, మార్గదర్శక బోర్డులు వంటి ఏర్పాట్లను మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా, క్యూలైన్ ద్వారా భక్తులతో కలిసి దేవస్థానం నిర్వహిస్తున్న అన్నదాన సత్రానికి వెళ్లిన కలెక్టర్, సహపంక్తిగా కూర్చొని భోజనం చేశారు. భోజన నాణ్యత, వంటశాల పరిశుభ్రత, తాగునీటి సరఫరా, వడ్డింపు విధానం, కూర్చునే ఏర్పాట్లపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. భక్తులకు గౌరవప్రదంగా, వేగవంతంగా భోజనం అందేలా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులను ఆదేశించారు.
బ్రహ్మోత్సవాల దృష్ట్యా రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా పరిశుభ్రత, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సదుపాయాలు, తాగునీటి సరఫరా, భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. భక్తుల సూచనలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన మార్పులు చేయాలని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర ప్రణాళికతో ఏర్పాట్లు చేపట్టామని, ప్రతి విభాగం నిరంతరం పర్యవేక్షణలో ఉందని జిల్లా కలెక్టర్ తెలిపారు.
శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రత ఏర్పాట్లు:
మ్యాప్ ఆధారంగా బందోబస్తులో చేయవలసిన విధులపై సవివరంగా తెలియజేసిన జిల్లా ఎస్పీ:
మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రజల (భక్తుల)భద్రత, రక్షణను దృష్టిలో ఉంచుకుని సుమారు 1782 మంది అధికారులు సిబ్బందిచే ప్రతిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసారు.
👉ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుండి బందోబస్తుకు వచ్చిన అడిషనల్ ఎస్పీ, డిఎస్పీలతో నేడు శ్రీశైలం పోలీస్ స్టేషన్ ఆవరణలో సమావేశం ఏర్పాటు చేసి దిశా నిర్దేశం జరిగింది.
👉ఈ సందర్భంగా ఎస్పీ బందోబస్తును 10 సెక్టార్లుగా విభజించడం జరిగిందని ప్రతి సెక్టార్ గురించిన వివరాలను మ్యాప్ లో చూపిస్తూ చేయవలసిన విధులపై సవివరంగా తెలిపారు.
అధికారులు ,సిబ్బంది వివరాలు
👉కర్నూలు, అనంతపురం, అన్నమయ్య, కడప జిల్లాల నుండి సుమారు 1614 మంది సివిల్ పోలీస్ అధికారులు సిబ్బంది.
ASPలు — 11,
DSPలు — 24
CIలు ——-78
SIలు ——132
ASI/HCలు-303
PC లు ——-568
WPC లు —- 88
HG లు ——- 386
WHG లు ——-30
Total 1614 మందిని నియమించారు.
👉ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ , ఆర్ముడు రిజర్వు సిబ్బంది (AR) 34 మంది సిబ్బందితోపాటు 3 RSI లు ఉన్నారు.
👉స్పెషల్ పార్టీలు 03 అనగా సిబ్బంది 24 మంది సిబ్బందితో పాటు RSI లు 03 మంది నియమించారు.
👉బ్రహ్మోత్సవాల ప్రారంభం నుండి ముగింపు వరకు నిరంతరం కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షణ జరుగుతుంది.
👉సిబ్బంది మరియు అధికారులు భక్తులతో మర్యాదపూర్వకంగా మాట్లాడి వారికి మార్గ నిర్దేశం చేయాలి.
👉లడ్డు కౌంటర్ల వద్ద క్యూలైన్లో భక్తులు స్వామివారి ప్రసాదం స్వీకరించేలా నిరంతరం అప్రమత్తంగా ఉండాలి.
👉వాహనాల రద్దీ పెరుగుతూ ఉండడం వలన ట్రాఫిక్ అధికారులు వారి సిబ్బందికి దిశా నిర్దేశం చేస్తూ వాహనాలను రోడ్డుకు ఇరువైపులా ఉంచకుండా పార్కింగ్ ప్రదేశంలో మాత్రమే నిలుపుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు.
ఉచిత క్యూలైన్ ద్వారా శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్ల దర్శనం చేసిన జిల్లా కలెక్టర్
సుమారు 20 నిమిషాల్లో మల్లన్న దర్శనం పూర్తి
శ్రీశైలం / నంద్యాల, ఫిబ్రవరి 13 :-
ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీశైలం దేవస్థానంలో కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లను జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి ఉచిత క్యూలైన్ ద్వారా సాధారణ భక్తులతో కలిసి దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ క్యూలైన్లలో భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు. ఉచిత దర్శన క్యూలైన్ల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, శానిటేషన్ సదుపాయాలు, వైద్య సేవలు తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్యూలైన్లలో తాగునీటి సదుపాయం నిరంతరంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, పారిశుధ్య ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారికి కలుగుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకొని, అవసరమైన తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు మార్గనిర్దేశం చేశారు.
ప్రత్యేక దర్శనాల కంటే సాధారణ భక్తులకు ప్రాధాన్యతనిస్తూ నిర్వహించిన సమర్థవంతమైన ఏర్పాట్ల ఫలితంగా సుమారు 20 నిమిషాల్లోనే శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్ల దర్శనం పూర్తి చేయగలిగామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఉచిత క్యూలైన్ ద్వారా భక్తులకు తక్షణ దర్శనం కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామన్నారు. మహాశివరాత్రి వేళల్లో భారీగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో, భక్తులు సంయమనం పాటిస్తూ, శివనామ స్మరణతో, దేవాలయ నియమ నిబంధనలు అనుసరిస్తూ దర్శనం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
*సి. యల్లయ్య, హైదరాబాద్ ఈ రోజు గో సంరక్షణ పథకానికి విరాళం రూ. 1,00,000/-లను అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు కె. అయ్యన్నకు అందించారు. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.
*వి. నాగ శ్రీనివాసరెడ్డి, గుంటూరు ఈ రోజు అన్నప్రసాద వితరణ పథకానికి విరాళం రూ. 1,01,102/-లను,యు ప్రాణదాన ట్రస్ట్ పథకానికి రూ. 1,00,000/-లను అందజేశారు. ఈ మొత్తాన్ని గౌరవ ధర్మకర్తల మండలి సభ్యులు ఆలా అనిల్కుమారు, ప్రత్యేక ఆహ్వానితులు వేమిరెడ్డి కోటారెడ్డిగార్లకు అందించారు. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.
