
శ్రీశైల దేవస్థానం:శ్రీశైలదేవస్థానం:కార్తిక మొదటి సోమవారం సందర్భంగా ఈ రోజు (08.11.2020) న పుష్కరిణి వద్ద దేవస్థానం లక్షదీపోత్సం పుష్కరిణి హారతిని ఘనంగా ఏర్పాటు చేసింది. లోకకల్యాణం కోసం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈకార్తికమాసంలో ప్రతి సోమవారం (మొత్తం నాలుగు సోమవారాలు), కార్తిక పౌర్ణమి రోజున కూడా ఈ కార్యక్రమాలు ఉంటాయి .
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ లక్షదీపోత్సవం, పుష్కరిణిహారతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
లక్షదీపోత్సవం:
ఈ దీపోత్సవ కార్యక్రమంలో పుష్కరిణి ప్రాంగణమంతా కూడా దీపాలను ఏర్పాటు చేసారు.
కార్తీకమాసంలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యముంది. ఈ మాసంలో దీపారాధననే కాకుండా దీపదర్శనం కూడా ఎంతో పుణ్యదాయకమని పురాణాలు చెబుతున్నాయి.
కార్తీక దీపదర్శన వలన జాతిభేదం లేకుండా మానవులందరికీ, ఇంకా పక్షులు, కీటకాలు, జలచరాలు మొదలైన వాటికి, ఇంకా వృక్షాలకు కూడా పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి.
పుష్కరిణి హారతి (దశవిధ హారతులు):
ఈ రోజు (08.11.2020) సాయంత్రం గం. 6.30ల నుండి ముందుగా శ్రీస్వామిఅమ్మవార్లకు, పుష్కరిణికి దశవిధ హారతులు శాస్త్రోక్తంగా ఏర్పాటు చేసారు.
ఈ కార్యక్రమానికి ముందుగా శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్కరిణి వద్దకు వేంచేబు చేయించి విశేషంగా పూజాదికాలు జరిపారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లకు, పుష్కరిణికి దశవిధ హారతులను సమర్పించడం ప్రత్యేకం.
ఆర్జిత హోమాలను రెండు విడతలుగా నిర్వహిస్తున్నారు. కుంకుమార్చనలను అమ్మవారి ఆలయము లోని ఆశీర్వచన మండపంలో నిర్వహిస్తున్నారు.
సిబ్బందికి ప్రత్యేక విధులు:
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆయా సదుపాయాలను కల్పించేందుకు దేవస్థానం పర్యవేక్షకులకు, ఇతర సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు.
దాదాపుగా కార్యాలయం సిబ్బంది అంతా కూడా ప్రత్యేక విధులను నిర్వర్తిస్తున్నారు.
కార్తికదీపోత్సవం భక్తులు కార్తికదీపారాధన చేసుకునేందుకు వీలుగా ఉత్తర మాడవీధిలో, శ్రీ కృష్ణదేవరాయ గోపురము ఎదురుగా గల గంగాధర మండపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసారు.
ఈ రోజు ఉదయం నుండే భక్తులు కార్తికదీపారాధనలను చేస్తున్నారు. కొందరు భక్తులు లక్షవత్తుల నోములను కూడా నోచుకున్నారు.
ఈ రోజు ఉదయం క్యూలైన్లలోని భక్తులకు వేడిపాలను అందించారు.
క్యూలైన్లలో అల్పాహారం:
క్యూకాంప్లెక్స్ లో వేచివుండే భక్తులకు నిరంతరం అల్పాహారం, బిస్కెట్లు, మంచినీరు అందించారు.
ఉచిత ప్రసాద వితరణ:
ఈ రోజు వేకువజామున దర్శనాలు ప్రారంభమైనప్పటి నుండే భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేసారు. రాత్రివేళ సర్వదర్శనం ముగిసేంతవరకు భక్తులకు ఈ ఉచిత ప్రసాద వితరణ చేస్తున్నారు.
అన్నప్రసాద వితరణ:
కార్తికమాసం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ప్రతిరోజు కూడా అన్నదాన మందిరంలో ఉదయం 10.30గంటల నుండి మధ్యాహ్నం 3.30గంటల వరకు కూడా భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్నారు.
కార్తికమాసంలో వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన సంఖ్యలో లడ్డు ప్రసాదాలు సిద్ధం చేస్తున్నారు. మొత్తం 8 కౌంటర్ల ద్వారా ఈ లడ్డు ప్రసాదాలు విక్రఇస్తున్నారు.