భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలి-ఎస్.లవన్న

 శ్రీశైల దేవస్థానం:భక్తులకు ఎలాంటి  అసౌకర్యాలు  కలగకుండా, అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఈ ఓ ఎస్.లవన్న  ఆదేశించారు   భక్తులకు  సౌకర్యాల కల్పనపై ఆదివారం కార్యనిర్వహణాధికారి   సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఈ నెల 22వ తేదీన  ఉపముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రి  కొట్టు సత్యనారాయణ ఆలయాల కార్యనిర్వహణాధికారులతో వీడియో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశం లో రాష్ట్ర దేవదాయ కమి షనరు డా. ఎం. హరిజవహర్ లాల్, అదనపు కమిషనర్లు  టి. చంద్రకుమార్,  ఎస్.ఎస్. చంద్రశేఖర అజాద్ కూడా పాల్గొన్నారు.సమావేశం లో ఉపముఖ్యమంత్రి  కొట్టు సత్యనారాయణ  సౌకర్యాల కల్పనపై పలు ఆదేశాలు ఇచ్చారు.  ఈ దేవస్థానం లో  ఆదేశాలను అమలు చేసేందుకుగాను  కార్యనిర్వహణాధికారి ఆయా అంశాల గురించి చర్చించారు.

 కార్యనిర్వహణాధికారి  మాట్లాడుతూ ఏఏ రోజులలో భక్తులు ఎక్కువగా వస్తారనే దాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ తదనుగుణంగా ఏర్పాట్లు చేస్తుండాలన్నారు. క్యూలైన్లలో నిరంతరం మంచినీరు, అల్పాహారాన్ని అందిస్తుండాలన్నారు. రద్దీ అంతగాలేని సాధారణ రోజులలో కూడా క్యూలైన్లలో అల్పాహారం, మంచినీటి సరఫరా యథావిధిగా కొనగాలన్నారు. ఎట్టి పరిస్థితులలో కూడా క్యూలైన్లలో తొక్కిసలాట లేకుండా ఉండేందుకు అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలను తీసుకోవాలన్నారు. రద్దీ సమయాలలో మరిన్నీ ముందస్తు జాగ్రత్తలను తీసుకోవలసి ఉంటుందన్నారు. క్యూలైన్లలో భక్తులు అధికసమయం వేచివుండకుండా ఉండేవిధంగా దర్శన విధానాన్ని రూపొందించాలన్నారు.

తరువాత వేసవి జాగ్రత్తల గురించి మాట్లాడుతూ భక్తులు దర్శనానంతరం ఎండవేడిమి నుండి సేద తీరేవిధంగా అవసరమైనచోట్ల వెంటనే చలువ పందిర్లను వేయాలని ఈ ఓ  ఆదేశించారు. ఇప్పటికే క్యూలైన్ల పై భాగంగా చలువపందిర్లు వేసారు, వీటికి అదనంగా నిత్యకళారాధన వేదిక సమీపం లో ప్రచురణల విక్రయ కేంద్రం ఎదురుగా), హరిహరరాయగోపురం ఎదురుగా ఉద్యానవనం మొదలైన చోట్ల చలువపందిర్లు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

 క్యూకాంప్లెక్స్ లోనే కాకుండా ఆలయప్రాంగణములో కూడా భక్తులకు మంచినీటిని అందిస్తుండాలన్నారు. మంచినీటితో పాటు సమయానుకూలంగా మజ్జిగను కూడా అందజేస్తుండాలన్నారు ఈ ఓ.దర్శనాలు ప్రారంభమైనప్పటి నుంచి దర్శనాలు ముగిసేంతవరకు కూడా ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరం ఉచిత ప్రసాదాన్ని భక్తులకు అందజేయాలని ఆలయ విభాగాన్ని ఆదేశించారు.

క్షేత్ర పరిధిలో పూజాద్రవ్యాలు, తినుబండరాలు, వాటర్ బాటిల్స్ మొదలైన వాటిని అధిక ధరలకు విక్రయించకుండా నిర్ణీత ధరలకే విక్రయించే విధంగా తగు చర్యలు చేపట్టాలని దేవస్థానం రెవెన్యూ విభాగాన్ని ఈ ఓ ఆదేశించారు. క్షేత్రపరిధిలో ఆటోలు, దర్శనీయ స్థలాలకు వెళ్లే కారు, జీపు మొదలైన వాహనాలు భక్తుల నుంచి నిర్ణీత రుసుము మాత్రమే వసూలు చేసేవిధంగా చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించారు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా క్షేత్రపరిధిలో ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించాల్సి ఉందని ఈ ఓ పేర్కొన్నారు. అందుకే ప్లాస్టిక్ నిషేధంపై దుకాణదారులు,  స్థానికులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ విషయమై నిపుణుల చేత ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని రెవెన్యూ , పారిశుద్ధ్య విభాగాలను ఆదేశించారు. .

ఆలయ ప్రాంగణము, ఆలయ పరిసరాలు, క్షేత్రపరిధి మొదలైనవన్నీ శుభ్రంగా ఉండేవిధంగా నిరంతరం తగు చర్యలు చేపడుతుండాలని పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు ఈ ఓ. చెత్తా చెదారాలను ఎప్పటికప్పుడు తొలగిస్తుండాలని సూచించారు.వేసవిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నీటిసరఫరా జరుగుతుండాలని నీటిసరఫరా విభాగాన్ని ఆదేశించారు. ముఖ్యంగా నీరు కలుషితం కాకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు చేపట్టాలన్నారు.భక్తులకు తగినవిధంగా వైద్యసేవలు అందిస్తుండాలని, దేవస్థానం వైద్యశాలలో అవసరమైన ఔషధాలన్నీ అందుబాటులో ఉండే విధంగా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలన్నారు.

క్షేత్రపరిధిలో అగ్నిప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అవసరమైన ముందుజాగ్రత్తలు చేపట్టాలని సంబంధిత విభాగాలను ఆదేశించారు. అవసరమైనచోట్ల మరిన్నీ మంటలను ఆర్పే యంత్రాలను (Fire Extinguishers) అందుబాటులో ఉంచుకోవాలన్నారు.క్షేత్రపరిధిలో పచ్చదనాన్ని పెంపొందించాలని, భక్తులు సేద తీరేవిధంగా ఉద్యానవనాలను తీర్చిదిద్దాలని ఉద్యానవన విభాగాన్ని ఆదేశించారు. క్షేత్ర సుందరీకరణకు ప్రణాళికలు రూపొందించి తదనుగుణంగా చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ మరియు ఉద్యానవన విభాగాన్ని ఆదేశించారు.

గో సంరక్షణపట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుండాలని గోశాల విభాగాన్ని ఈ ఓ  ఆదేశించారు.  కోవిడ్ ముందుజాగ్రత్తలను అందరు విధిగా పాటించేలా అవగాహన చర్యలు చేపట్టాలని సంబంధిత విభాగాధిపతులను ఆదేశించారు. ఈ విషయమై స్థానికులు , యాత్రికులలో మరింత అవగాహన కల్పించాలని ఆదేశించారు.మొత్తం మీద భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశం లో అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు పాల్గొన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.