
శ్రీశైలదేవస్థానం: రక్షిత నీటిని అందించేందుకు పూర్తి సాంకేతిక ప్రమాణాలను పాటించాలని ఈ ఓ ఆదేశించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు మరిన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి . ఈ నెల 22 నుండి మార్చి 4 వరకు 11 రోజులపాటు ఉత్సవాలు జరుగుతాయి.భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా ఆదివారం కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న గంగాభవాని స్నానఘట్టాలు శివగంగా జలప్రసాద పథక కేంద్రాలు, అన్న ప్రసాద వితరణ ప్రాంగణములోని వాటర్ బాటిల్, వాటర్ ప్యాకింగ్ యూనిట్లను పరిశీలించారు.
ఈ ఓ మాట్లాడుతూ గంగాభవాని స్నానఘట్టాలు ఆలయానికి సమీపంలో ఉన్న కారణంగా అధిక సంఖ్యలో భక్తులు ఈ స్నానఘట్టాలకు వచ్చే అవకాశం ఉందన్నారు. శివదీక్ష భక్తులు ఈ స్నానఘట్టాలలో స్నానాలు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్న కారణంగా, అవసరమైన అన్ని ఏర్పాట్లను రెండు – మూడు రోజులలో పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.గంగాభవాని స్నానఘట్టాల వద్ద వీలైనన్ని ఎక్కువ కుళాయిలను ఏర్పాటు చేయాలన్నారు. దీనివలన ఒకే సమయములో ఎక్కువమంది భక్తులు స్నానాలు చేసేందుకు వీలు కలుగుతుందన్నారు.
ప్రత్యేకంగా పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు స్నానఘట్టాలను, అక్కడి పరిసరాలను శుభ్రపరుస్తుండాలని శానిటేషన్ విభాగాన్ని ఈ ఓ ఆదేశించారు.తరువాత మల్లమ్మకన్నీరు, ఘంటామఠం, నందిసర్కిల్, మల్లికార్జునసదనం కూడలి, పెద్దసత్రం, జగద్గురుమఠం, బయలువీరభద్రస్వామి ఆలయం, టూరిస్ట్ బస్టాండ్ మొదలైనచోట్ల గల శివగంగా జలప్రసాద కేంద్రాలను ఈ ఓ పరిశీలించారు.
ఆయా కేంద్రాల వద్ద నీటి టీ.డి.ఎస్ స్థాయిని కూడా ఈ ఓ పరిశీలించారు. రక్షిత నీటిని అందించేందుకు పూర్తి శాస్త్రీయ ప్రమాణాలను పాటించాలన్నారు.తరువాత అన్నప్రసాద వితరణ భవన ప్రాంగణంలో గల వాటర్ బాటిల్, వాటర్ ప్యాకింగ్ యూనిట్లను కూడా పరిశీలించారు. ఎప్పటికప్పుడు అవసరమైన మంచినీటి ప్యాకెట్లను తయారు చేసి అవసరమైన చోట్లకు సరఫరా చేస్తుండాలని అన్నదాన విభాగం పర్యవేక్షకులను ఆదేశించారు.
ఈ పరిశీలనలో సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. ఫణిధర ప్రసాద్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ( ఐసి) శ్రీనివాసరెడ్డి, నీటి సరఫరా విభాగపు సహాయ ఇంజనీరు రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.