
శ్రీశైల దేవస్థానం:విధినిర్వహణలో జవాబుదారీతనాన్ని పెంపొందించుకోవాలని ఈ ఓ లవన్న ఆదేశించారు. దేవస్థాన పరిపాలనా సంబంధిత అంశాలపై సోమవారం కార్యనిర్వహణాధికారి లవన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పరిపాలనా భవనం లోని సమావేశ మందిరం లో జరిగిన ఈ సమావేశం లో అన్ని విభాగాల అధిపతులు, పర్యవేక్షకులు పాల్గొన్నారు.
సమావేశ ప్రారంభంలో ఈ ఓ లవన్న మాట్లాడుతూ ఇక మీదట ప్రతీనెలలో కూడా రెండో వారంలో పరిపాలనా పరమైన సమీక్ష ఉంటుందన్నారు. సమావేశంలో ఆయా విభాగాల ప్రగతిని పరిశీలిస్తామన్నారు.అందరూ కూడా విధినిర్వహణలో జవాబుదారీతనాన్ని పెంపొందించుకోవాలన్నారు.విధినిర్వహణలో పారదర్శకత కూడా ఎంతో ముఖ్యం అన్నారు. అదేవిధంగా అందరూ కూడా సమయ పాలన పాటించాలన్నారు. సమయ పాలన నిర్వహణ కోసమే ముఖ ఆధారిత హాజరును ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.అన్ని విభాగాల అధిపతులు, ఆయ విభాగాల క్రింది స్థాయి సిబ్బంది నిర్వర్తించాల్సిన విధుల పట్ల పూర్తి అవగాహన కల్పించాలన్నారు.
కార్యనిర్వహణాధికారి , ఆయా విభాగాల వారీగా సమీక్షను నిర్వహించారు. ముందుగా పరిపాలనా విభాగపు అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిపాలనా విభాగం సిబ్బంది రోజువారి హాజరు పట్ల తగు పరిశీలన చేయాలన్నారు. ఆయా విభాగాలు నిర్వహిస్తున్న విధులు, ఆయా విభాగాలలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తదితర . అంశాలతో నివేదిక రూపొందిచాలన్నారు.
తరువాత గణాంక విభాగాన్ని సమీక్షించారు. ప్రతి విభాగాధికారి కూడా వారి వారి విభాగాలలో ఎప్పటికప్పుడు జమా ఖర్చులను పరిశీలించాలన్నారు. దీనివలన దేవస్థాన రాబడి, వ్యయాలపై విభాగాధిపతులందరికీ అవగాహన కలుగుతుందన్నారు.అనంతరం ఆడిట్ అభ్యంతరాలకు తగు సమాధానాలు రూపొందింది, ఆయా అభ్యంతరాలను తొలగింపజేసేందుకు అన్ని విభాగాల అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. ఆడిట్ అభ్యంతరాల సమాధాన రూపకల్పనకు పాత రికార్డులను పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా వుంటుందని అధునాతన పద్ధతిలో రికార్డు రూము నిర్మాణానికి తగు చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులు ఆదేశించారు.
తర్వాత ప్రచురణ, ప్రచార విభాగాన్ని సమీక్షించారు. రాబోవు శ్రావణ మాసాన్ని దృష్టిలో ఉంచుకొని క్షేత్ర పరిధిలో మరిన్ని సూచన బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.అనంతరం రెవెన్యూ విభాగాన్ని సమీక్షించారు. దుకాణాల అద్దె వసూళ్ళు, కోర్టు కేసులు గురించి చర్చించారు.తరువాత ఇంజనీరింగ్ విభాగాన్ని సమీక్షించారు. ఇటీవల పూర్తి చేసిన ఇంజనీరింగ్ పనులు, ప్రస్తుతం జరుగుతున్న ఇంజనీరింగ్ పనులు, సమీప భవిష్యత్తులో చేపట్టవలసిన పనుల గురించి చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంజనీరింగ్ సమలలో పూర్తి నాణ్యతను పాటించాలన్నారు. సకాలములో ఆయా పనులను పూర్తి చేయాలన్నారు. ఘంటామఠ ప్రాంగణంలోని కౌమారిదేవి అమ్మవారి ఆలయ నిర్మాణానికి, పాండవుల గుహవద్ద కాలభైరవ ఆలయ నిర్మాణానికి వెంటనే చర్యలు చేపట్టాలన్నారు.
తరువాత వసతి విభాగాన్ని ఈ ఓ సమీక్షిస్తూ దేవస్థాన గదులు, కాటేజీలు పరిశుభ్రత పట్ల ప్రత్యేక వద్ద కనబర్చాలన్నారు. క్షేత్రానికి విచ్చేసే ప్రతి భక్తుడిని కూడా ఒక అతిథిగా భావించాలన్నారు. ప్రతి ఉద్యోగి కూడా ఈ భావనను అలవర్చుకోవాలన్నారు.ఇక ఆలయ విభాగాన్ని సమీక్షిస్తూ, భక్తులకు సౌకర్యవంతమైన దర్శనాన్ని కల్పించడానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. క్యూ కాంప్లెక్స్ విభాగం, ఆలయ విభాగం పరస్పర సమన్వయంతో దర్శనము ఏర్పాట్లను చేస్తుండాలన్నారు. భక్తులు ఎక్కువ సమయము క్యూలైన్ లో వేచి వుండకుండా వుండేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.
గోసంరక్షణశాలను విభాగాన్ని ఈ ఓ సమీక్షిస్తూ దోర్నాల సమీపం లోని దేవస్థాన భూమిలో పచ్చగడ్డి పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు.చివరగా ఉద్యానవన విభాగాన్ని సమీక్షిస్తూ వర్షాకాలం ముగిసేలోగా క్షేత్ర పరిధిలో విస్తృతంగా మొక్కలు నాటలన్నారు.