×

కోరికలు ఉంటే చాలవు, అందుకు తగ్గట్టుగా కష్టపడి చదవాలి – రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

కోరికలు ఉంటే చాలవు, అందుకు తగ్గట్టుగా కష్టపడి చదవాలి – రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

* ప్రసాద్ స్కీం కింద వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము*శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకున్న  ద్రౌపదిముర్ము,  తెలంగాణా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్*శివాజీ స్ఫూర్తికేంద్రంలో గిరిజన మహిళలతో ముఖాముఖి నిర్వహించిన భారత రాష్ట్రపతి.

శ్రీశైలం/నంద్యాల, 26.12.2022:-ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవదైన శ్రీమల్లికార్జునస్వామివారు, అష్టాదశశక్తిపీఠాలలో ఆరవ శక్తిపీఠమైన శ్రీభ్రమరాంబాదేవి వారు వెలసిన శ్రీశైలమహా పుణ్యక్షేత్రంలో రూ. 43.08 కోట్లతో ప్రసాద్ స్కీం క్రింద వివిధ అభివృద్ధి కార్యక్రమాలను భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ప్రారంభించారు. రాష్ట్రపతి, శ్రీశైలపర్యటన సందర్బంగా  సోమవారం ఉదయం11.45 గంటలకు సున్నిపెంట హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. తెలంగాణా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌, రాష్ట్రపతి కుమార్తె, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,  దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఆర్థిక, ప్రణాళిక, శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, భారత పర్యాటక అభివృద్ధి, సంస్కృతి శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, నంద్యాల పార్లమెంటు సభ్యులు పోచా బ్రహ్మానందారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రవీణ్‌కుమార్, ఏడి జిపి ఎల్ఎల్ఓ రవిశంకర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామూన్, జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఈ ఓ లవన్న  తదితరులు ఘనస్వాగతం పలికారు.

అనంతరం భ్రమరాంబా అతిథిగృహం చేరుకుని అక్కడి నుంచి శ్రీశైల భ్రమరాంబామల్లికార్జున స్వామివార్ల దర్శనార్థం ఆలయం వద్దకు మధ్యాహ్నం 12-45 గంటలకు చేరుకున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,  దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, దేవదాయశాఖ కమిషనర్, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి, సంస్కృతి శాఖ మంత్రి శ్రీమతి ఆర్.కె.రోజా, డాక్టర్ హరిజవహర్‌లాల్, ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డి వారి చక్రపాణి రెడ్డి, దేవస్థానం ఈఓ లవన్న, అర్చకస్వాములు, వేద పండితులు ఆలయ మర్యాదలతో రాజగోపురం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

స్వామిఅమ్మవార్లను దర్శించుకున్న భారత రాష్ట్రపతి:

రాష్ట్రపతి ముందుగా రత్నగర్భగణపతిస్వామి వారిని దర్శించుకుని హారతిని స్వీకరించారు. అనంతరం శ్రీ మల్లికార్జునస్వామి వారిని దర్శించుకుని రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి మల్లికా గుండంలో ప్రతిబింబించే ఆలయ విమాన గోపురాన్ని దర్శించుకున్నారు. తదుపరి శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవార్లకు కుంకుమార్చాన  జరిపించారు.  రాష్ట్రపతి, తెలంగాణ గవర్నర్లను అర్చక స్వాములు, వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందజేశారు. తరువాత శేషవస్త్రాలను, లడ్డుప్రసాదాలను , శ్రీస్వామిఅమ్మవార్ల జ్ఞాపికను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, దేవదాయశాఖ కమిషనర్ డాక్టర్ హరిజవహర్ లాల్, ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డి వారి చక్రపాణి రెడ్డి, దేవస్థానం ఈఓ లవన్న అందచేశారు. ఆ తరువాత ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు మఠం విరూపాక్షయ్యస్వామి,  గురుమహంత్ మహేష్, ఎం. విజయలక్ష్మి,  మేరాజోత్ హనుమంత్ నాయక్,  ఓ మధుసూదన్‌ రెడ్డి, శ్రీమతి బి. పద్మజ, శ్రీమతి ఎస్. మాధవీలత, శ్రీమతి డా. సి. కనకదుర్గభారత రాష్ట్రపతిని కలిసి జ్ఞాపికను అందజేశారు.

టూరిజం ఫెసిలిటేషన్ సెంటర్‌ ( యాత్రికుల సదుపాయ కేంద్రం) శిలా ఫలకం ఆవిష్కరణ

అనంతరం నంది సర్కిల్ సమీపంలోని టూరిజం ఫెసిలిటేషన్ సెంటర్‌లో ( యాత్రికుల సదుపాయ కేంద్రం) రూ. 43.08 కోట్లతో చేపట్టిన ప్రసాద్ ప్రాజెక్ట్‌ను రిబ్బన్ కట్‌చేసి శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. హాఠకేశ్వరం, శిఖరేశ్వరంలలో ఎమినీటిస్ సెంటర్, శిఖరేశ్వరంలో పుష్కరిణి పునరుద్ధరణ, ఆలయంలో కళాత్మక విద్యుద్దీకరణ, బస్టాండ్ నుంచి పాతాళగంగ వరకు కృష్ణవేణి రోడ్డు నిర్మాణం, యాంఫీ థియేటర్, ఇల్యూమినేషన్స్,  సౌండ్ అండ్ లైట్ షో, డిజిటల్ ఇంటర్‌వెన్షన్‌, పార్కింగ్ ఏరియా, టాయిలెట్ కాంప్లెక్స్‌లు, సావనీర్ షాపులు, ఫుడ్‌కోర్ట్, ఎటిఎం & బ్యాంకింగ్ సేవలు తదితర అత్యాధునిక సౌకర్యాలను భక్తులకు ప్రసాద్ స్కీం క్రింద అందుబాటులోకి రానున్నాయి. భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ సెక్రటరీ అరవింద్ సింగ్, ఏపీ టూరిజం ఎండి అండ్ సీఈఓ కన్నబాబు, టూరిస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ డా. వరప్రసాద్ రెడ్డిలు స్కీం వివరాలను భారత రాష్ట్రపతికి వివరించారు.

శివాజీస్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించిన భారత రాష్ట్రపతి:

శ్రీశైల మహా క్షేత్రంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తెలంగాణ  రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌లకు గిరిజన చెంచు విద్యార్థులతో స్వాగత నృత్యంతో, శివాజీ స్ఫూర్తి కేంద్రం అధ్యక్షులు టి.జి.వెంకటేష్ తదితరులు ఆహ్వానం పలికారు.అనంతరం చెంచు మహిళలతో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖాముఖి నిర్వహించారు.ఈ సందర్భంగా  గిరిజన మహిళలైన గంగమ్మ, వెంకటమ్మ, భ్రమరాంబ, ఉప్పులాపురం గంగమ్మలతో సంభాషిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమపథకాలను ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకొని జీవన విధానాలను మెరుగుపరుచుకోవాలన్నారు. మీ ప్రాంతంలో ఎన్ని చెంచుగూడాలు ఉన్నాయి…. చెంచు ప్రజలు ఎంత మంది ఉన్నారు. మీకెంతమంది సంతానం, పిల్లలను బాగా చదివిస్తున్నారా తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. అటవీ హక్కుల చట్టం క్రింద కేటాయించిన భూములలో ఎలాంటి పంటలు సాగు చేస్తున్నారు….. ప్రభుత్వం గృహాలు నిర్మించి ఇచ్చారా లేదా, నిత్యావసర వస్తువుల రేషన్ సరుకులు సరిగా అందుతున్నాయా తదితర విషయాలపై రాష్ట్రపతి మహిళలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా గిరిజన మహిళలు మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన నవరత్నాల పథకాలకు సంబంధించిన ఆర్థిక సహాయాన్ని పొందుతున్నామని రాష్ట్రపతికి నివేదించారు. మా ప్రాంతంలో 3233 చెంచు కుటుంబాలకు10,153 ఎకరాల ఆర్ ఓ ఎఫ్ ఆర్ భూములను అందించారన్నారు. ఈ భూములలో బోర్వెల్లులు,  విద్యుద్దీకరణకు   అటవీ శాఖ వారి నుండి అనుమతులు మంజూరు చేయాలని కోరారు. గత 15 సంవత్సరాల కిందట మాకు గృహాలు నిర్మించి ఇచ్చారు కానీ, ఈ గృహాలు శిథిలావస్థకు చేరడం వల్ల PMAY పథకం ద్వారా 6000 కొత్త గృహాలను నిర్మించేలా చర్యలు తీసుకోవాలని గిరిజన మహిళలు కోరారు. మేమంతా పొదుపు సంఘాలు ఏర్పడి, ప్రభుత్వం సహకారంతో బ్యాంకు లింకేజీ రుణాలను పొందిన చిన్న చిన్న వ్యాపారాలను చేసుకుంటూ లబ్ది పొందుతున్నామని తెలిపారు.

అనంతరం రాష్ట్రపతి గిరిజన విద్యార్థులతో ముచ్చటిస్తూ మీరు ఏ పాఠశాలలో చదువుతున్నారు… మీ తల్లిదండ్రులు బాగా చదివిస్తున్నారా…. మీరు విద్యనభ్యసించి ఏం చేయాలనుకుంటున్నారు…. మీ కోరికలు ఏమిటని విద్యార్థులను ప్రశ్నించారు. కొంతమంది విద్యార్థులు నేను డాక్టర్‌గా చదివి గిరిజన కాలనీలో గిరిజనులకు ఉచిత వైద్య సేవలు చేయాలని…. ఇంకొంతమంది విద్యార్థులు పోలీసు ఆఫీసర్‌గా చదివి గిరిజనులకు స్ఫూర్తిగా నిలిచి వారికి సేవలు చేయాలనుకున్నానని తెలిపారు. మరికొంత మంది జిల్లా కలెక్టర్‌గా చదివి ప్రజలకు సేవలను అందించాలనుకుంటున్నానన్నారు. ఇందుకు స్పందించిన రాష్ట్రపతి మీకు కోరికలు ఉంటే చాలవు…. అందుకు తగ్గట్టుగా కష్టపడి చదవాలని…. రోజుకు దాదాపుగా 10 గంటలకు తక్కువ కాకుండా చదువుకోవాలని హితవు పలికారు. మీకు ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడు ఉంటుందని రాష్ట్రపతి తెలిపారు.

రాష్ట్రపతి, తెలంగాణా రాష్ట్ర గవర్నరుకు  ఘనంగా వీడ్కోలు:

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తెలంగాణా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌లు శ్రీశైలపర్యటనను ముగించుకుని సాయంత్రం 4.00గంటలకు హెలిప్యాడ్ చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద భారత పర్యాటక అభివృద్ధి, సంస్కృతి శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఆర్థిక, ప్రణాళిక, శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, నంద్యాల పార్లమెంటు సభ్యులు పోచా బ్రహ్మానందారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామూన్, జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి తదితరులు ఘనంగా వీడ్కోలు పలికారు.

ఈ కార్యక్రమాలలో జాయింట్ కలెక్టర్ టి. నిశాంతి , ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ మేద జోష్ణవి, ఐటిడి ఏ పిఓ రవీంద్రారెడ్డి, శివాజీ స్ఫూర్తి కేంద్ర వైస్ ప్రెసిడెంట్ ఉద్యాజి, కేంద్ర ఇంచార్జి నాగేశ్వరరావు, సెక్రెటరీ జి.రఘురామయ్య, ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులుమఠం విరూపాక్షయ్యస్వామి,  గురుమహంత్ మహేష్, ఎం. విజయలక్ష్మి,  మేరాజోత్ హనుమంత్ నాయక్,  ఓ మధుసూదన్‌ రెడ్డి, శ్రీమతి బి. పద్మజ, శ్రీమతి ఎస్. మాధవీలత, శ్రీమతి డా. సి. కనకదుర్గ, సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed