
శ్రీశైల దేవస్థానం:విజయవాడ, ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీకనకదుర్గ అమ్మవారికి ఆషాఢమాసం సందర్భంగా శనివారం ఉదయం శ్రీశైల దేవస్థానం తరుపున సారె సమర్పించారు.
సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ కార్యక్రమం లో అమ్మవారికి పట్టుచీర, పూలు, పలు రకాల ఫలాలు, గాజులు మొదలైనవి సమర్పించారు.
అదేవిధంగా శ్రీమల్లేశ్వరస్వామివారికి, అక్కడి ఆలయ ప్రాంగణములోని గణపతిస్వామివారికి, కుమారస్వామి వారికి కూడా పట్టువస్త్రాలు సమర్పించారు.
ఈ మేరకు శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి దంపతులు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు గురుమహాంతు ఉమామహేష్, శ్రీమతి ఎం. విజయలక్ష్మి శ్రీమతి సూరిశెట్టి మాధవీలత తదితరులు ఈ సారెను సమర్పించారు.
ఆలయ విభాగ సహాయ కార్యనిర్వహణాధికారి ఎం. హరిదాసు, అమ్మవారి ప్రధానార్చకులు మార్కండేయశాస్త్రి, సహాయ సంపాదకుడు కె. సత్యబ్రహ్మాచార్య తదితర సిబ్బంది కూడా పాల్గొన్నారు.
సారెతో కనకదుర్గ అమ్మవారి ఆలయానికి.. చేరుకున్న వీరికి దుర్గామల్లేశ్వర దేవస్థానం కార్యనిర్వహణాధికారిణి ధర్భముళ్ళ భ్రమరాంబ, ఆ దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు బుద్ధా రాంబాబు, కట్టా సత్తయ్య, స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, ఉప కార్యనిర్వహణాధికారి గురుప్రసాద్, సహాయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ తదితరులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.అనంతరం దేవస్థానం తరుపున అమ్మవారికి సారె, స్వామివార్లకు వస్త్రాలు సమర్పించారు .తరువాత ఈ దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు, కార్యనిర్వహణాధికారి, ధర్మకర్తల మండలి సభ్యులను శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివారు దేవస్థానం వారు వేదాశీర్వచనంతో శేషవస్త్రాలు, ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ దేవస్థానం తరుపున కూడా దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం వారికి శేషవస్త్రాలు, ప్రసాదాలను కూడా అందించారు.