శ్రీశైల దేవస్థానం:
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం సాయంకాలం రాష్ట్ర ప్రభుత్వం తరుపున రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, స్థానిక శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డితో కలిసి శ్రీస్వామిఅమ్మ వార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు.
ఈ కార్యక్రమంలో దేవదాయ కమిషనరు, కె. రామచంద్ర మోహన్, జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఎస్.ఎస్. చంద్రశేఖర ఆజాద్ , ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు, కార్యనిర్వహణాధికారి యం.శ్రీనివాసరావు వారు పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.
ముందుగా ఆలయ రాజగోపురం వద్ద వస్త్ర సమర్పణ సంకల్పం, వస్త్రాలకు పూజాదికాలు మొదలైన కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం మంత్రి , స్థానిక శాసనసభ్యులు మేళతాళాలతో ఆలయ ప్రవేశం చేసి ప్రదక్షిణ పూర్వకంగా స్వామిఅమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు.
ఎంతో చారిత్రక ప్రసిద్ధి పొందిన శ్రీశైలక్షేత్రంలో ఎందరో చక్రవర్తులు, రాజులు, రాజకుటుంబీకులు మొదలైన వారు ఆయా ఉత్సవ సందర్భాలలో శ్రీ స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించేవారని ప్రతీతి.
ఈ సంప్రదాయాన్ని అనుసరించే రాష్ట్ర ప్రభుత్వం ఏటా మహాశివరాత్రి , దసరా మహోత్సవాలలోనూ శ్రీ స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పిస్తోంది.
