శ్రీశైల దేవస్థానం:మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం, కాణిపాకం వారు శనివారం ఉదయం పట్టువస్త్రాలను సమర్పించారు.కాణిపాక దేవస్థానం తరుపున ఆ దేవస్థాన కార్యనిర్వహణాధికారి కె. పెంచలకిషోర్ పట్టువస్త్రాలను సమర్పించారు.
ఈ కార్యక్రమంలో ముందుగా ఆలయ రాజగోపురం వద్ద సంప్రదాయాన్ని అనుసరించి శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు, అర్చకులు, వేదపండితులు, శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం అధికారులకు స్వాగతం పలికారు.తరువాత ఆలయ రాజగోపురం వద్ద పట్టువస్త్రాలకు ప్రత్యేక పూజలు జరిపారు.
అనంతరం కాణిపాక దేవస్థాన అధికారులు, అర్చకులు మేళతాళాలతో ఆలయ ప్రవేశం చేసి వస్త్ర సమర్పణ చేశారు.
ఈ కార్యక్రమంలో కాణిపాకదేవస్థాన స్థానాచార్యలు ఫణికుమారశర్మ, అర్చక స్వాములు గణేశ్ గురుకుల్, వేదపండితులు అభిరామ, అన్నపూర్ణయ్య, పర్యవేక్షకులు కె. కోదండపాణి, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాలలో స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. బ్రహ్మోత్సవాలలో శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకోవడం వలన ఎంతో ఆధ్యాత్మికానుభూతి కలిగిందన్నారు. కాణిపాక దేవస్థానం తరుపున శివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఆనవాయితీగా పట్టువస్త్రాలను సమర్పించడం జరుగుతోందన్నారు.