
శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న వీరశైవాగమ పాఠశాలలో 2014 – 15 , 2015 -16 విద్యా సంవత్సరం లో ప్రవేశాలు పొంది, మొత్తం 6 సంవత్సరాల వీరశైవాగమ కోర్సును పూర్తి చేసిన విద్యార్థులకు శనివారం సాయంత్రం పరిపాలనా భవనం లోని సమావేశమందిరం లో జరిగిన కార్యక్రమం లో దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న విద్యాభ్యాస ధృవీకరణ పత్రాలను అందజేశారు.
కోర్సు పూర్తి చేసిన విద్యార్థులందరికీ మొత్తం 6 సంవత్సరాల విద్యాభ్యాస కాలపరిమితి కి సంబంధించి స్టయిపెండ్ మొత్తాన్ని కూడా చెక్కుల రూపం లో విద్యార్థులకు అందించారు.మొత్తం 18 మంది విద్యార్థులకు విద్యాభ్యాస ధృవీకరణ పత్రాలు, స్టయిపెండ్ అందించారు.
ఈ ఓ మాట్లాడుతూ విద్యార్థులందరికీ కూడా శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల కృపా కటాక్షాలతో మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు. విద్యార్థులందరు ఆగమ విద్యను మరింతగా సాధన చేస్తూ, మరింత మందికి ఆగమ విద్యను నేర్పి తాము విద్యభ్యసించిన దేవస్థానం పాఠశాలకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు.
స్వామివారి ఉపప్రధానార్చకులు, ఆగమపాఠశాల ప్రిన్సిపల్ శ్రీ మఠం శివశంకరయ్యస్వామి ఆధ్వర్యములో విద్యార్థులందరు కార్యనిర్వహణాధికారిని సన్మానించారు. మఠం శివశంకరయ్యస్వామితో పాటు ఆలయ సహాయకార్యనిర్వహణాధికారి ఎం. హరిదాసు, పాఠశాల గుమాస్తా డి. రంగన్న, పాఠశాల ఆంగ్ల అధ్యాపకుడు నారాయణ, తదితర సిబ్బంది పాల్గొన్నారు.