
శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో మహాశివరాత్రి రోజు మంగళవారం శ్రీ స్వామి అమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి. యాగశాల లో శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిగాయి. అనంతరం లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు జరిగాయి. మండపారాధనలు, పంచావరణార్చనలు, శివపంచాక్షరి, నిత్యహవనాలు, రుద్రహోమం, చండీహోమం, కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారంగా జరిగాయి.
సాయంకాలం ప్రదోషకాల పూజలు, జపానుష్ఠానాలు, రుద్రపారాయణలు, హోమాలు జరిపారు.
ప్రభోత్సవం :
ఈ సాయంత్రం గం.5.30 ని||లకు శ్రీ స్వామి అమ్మవార్ల ప్రభోత్సవం ఘనంగా జరిగింది.
రథోత్సవంలో రథానికి చేసినట్లుగానే ప్రభోత్సవంలో కూడా ప్రభకు పలు రకాల పుష్పాలతో పుష్పాలంకరణ చేసారు. ప్రభోత్సవంలో నాదస్వరం, కోలాటం, చెక్క భజన, శంఖం,
డమరుకం, బీరరప్పడోలు, పగటివేషాలు, తప్పెటచిందు,డోలు విన్యాసాలు మొదలైన పలు సాంప్రదాయ జానపద కళారూపాలు కూడా ఏర్పాటు చేసారు.