
శ్రీశైల దేవస్థానం:పర్యావరణ పరిరక్షణకు, క్షేత్రాన్ని మరింతగా సుందరీకరించేందుకు శ్రీశైల క్షేత్ర పరిధిలో పలుచోట్ల మరిన్ని మొక్కలు నాటాలని దేవస్థానం నిర్ణయించింది.
ముఖ్యంగా వలయరహదారికి ఇరువైపులా, ఆరుబయలు ప్రదేశాలలో, దేవస్థానం ఉద్యానవనాలలో ఈ మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టారు.
వలయరహదారి ఇరువైపులా నీడనిచ్చే మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ఆదివారం కార్యనిర్వహణాధికారి లవన్న మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్రస్తుతం వలయరహదారికి ఇరువైపులా సుమారు 1500 మొక్కలు నాటారు. కదంబం, వేప, మర్రి, రావి, జువ్వి, కానుగ, ఆకాశమల్లి, పెద్ద ఆరే, నేరేడు మొదలైన మొక్కలను నాటారు.
మొక్కల నాటే కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలని ముందుగా గణపతిపూజ జరిపారు. అనంతరం మొక్కను నాటి సంప్రదాయబద్ధంగా వృక్షపూజా కార్యక్రమం జరిపారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ నాటిన మొక్కల సంరక్షణపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉద్యానవన అధికారులను ఆదేశించారు. క్రమం తప్పకుండా మొక్కలకు నీళ్ళు పోస్తుండాలన్నారు. క్షేత్రంలో మరింత ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించేందుకు అనువైన చోట్ల మరిన్ని బిల్వం, కదంబం, ఉసిరి, మేడి తదితర మొక్కలు నాటాలన్నారు.
ఉద్యానవనాలలో నిమ్మ, మామిడి, కొబ్బరి మొదలైన మొక్కలు నాటాలని ఈ ఓ సూచించారు. ముఖ్యంగా క్షేత్రపరిధిలోని పలు ఆరబయలు ప్రదేశాలలో కూడా నీడనిచ్చేమొక్కలు నాటాలన్నారు. రాబోయే వర్షాకాలమంతా మరింత విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమానికి రూపకల్పన చేయాలని కూడా అధికారులను ఆదేశించారు.
కార్యక్రమం లో దేవస్థాన ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు వి. రామకృష్ణ, ఉద్యానవన విభాగపు విశ్రాంత అసిస్టెంట్ డైరెక్టర్ జి. ఈశ్వరరెడ్డి, ఉద్యానవన అధికారి లోకేష్, అర్చకస్వాములు తదితరులు పాల్గొన్నారు.