
శ్రీశైల దేవస్థానం:పర్యావరణ పరిరక్షణకు , క్షేత్రాన్ని మరింతగా సుందరీకరించేందుకు శ్రీశైలక్షేత్ర పరిధిలో పలుచోట్ల విస్తృతంగా మొక్కలు నాటుతున్నామని కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు అన్నారు. క్షేత్రంలో మరింత ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించేందుకు మొత్తం మొక్కలలో 30 శాతం దేవతా మొక్కలను నటుతున్నామని తెలిపారు.
ఇందులో భాగంగా గురువారం భ్రామరీ పుష్పవనంలో బిల్వమొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించామన్నారు. ఇప్పటికే భ్రామరీ పుష్పవనంలో మొక్కలు పెంచుతున్నామన్నారు . ప్రస్తుతం 2000 బిల్వం మొక్కలను నాటడం జరుగుతోందన్నారు. ఈ 2000 బిల్వం మొక్కలను విరాళంగా అందజేసిన ఎన్. ఆదికేశవులురెడ్డి, ఛైర్మెన్, ఎన్.డి.ఆర్ గ్రూప్, నెల్లూరు వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు.
కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ ఈ వర్షాకాలం ముగిసేలోగా కనీసం 5000 మొక్కలు నాటే విధంగా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఇప్పటికే పలుచోట్ల సుమారు 3000 మొక్కలు నాటడం జరిగిందన్నారు.పలుచోట్ల దేవతా వృక్షాలు, నీడనిచ్చే మొక్కలు, ఉద్యానవనాలలో పూలచెట్లు, సుందరీకరణ మొక్కలు నాటేవిధంగా సమగ్ర విధానాన్ని రూపొందించామన్నారు. ముఖ్యంగా దేవతా వృక్షాలలో బిల్వం, కదంబం, రుద్రాక్ష, తెల్లమద్ది, ఉసిరి, రావి, మేడి, వేప మొదలైనవి నాటుతున్నామన్నారు.
అదేవిధంగా పలు పార్కింగ్ ప్రదేశాలు, ఆరు బయలు ప్రదేశాలు మొదలైన చోట్ల నీడనిచ్చే చెట్ల మొక్కలు నాటుతున్నామన్నారు . వలయ రహదారికిరువైపులా కూడా మరిన్ని మొక్కలు నాటుతున్నామన్నారు.
ఈ సందర్భంగా నాటిన మొక్కలు సంరక్షణపట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉద్యానవన అధికారులను ఆదేశించారు. క్రమం తప్పకుండా మొక్కలకు నీళ్ళు పోస్తుండాలన్నారు. ఆరుబయలు ప్రదేశాలు, రహదారికిరువైపులా నాటుతున్న మొక్కలకు తప్పనిసరిగా ట్రీ – గార్డ్స్ ఏర్పాటు చేయాలన్నారు.
తరువాత ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న దాత ఆదికేశవులురెడ్డి మాట్లాడుతూ స్వామివారి నిత్యకైంకర్యానికి వినియోగించుకునేందుకు వీలుగా మొత్తం 2000 బిల్వం మొక్కలను దేవస్థానానికి విరాళంగా అందించామన్నారు.
ఈ కార్యక్రమములో ఉద్యానవన అధికారి ఎస్. లోకేష్, ఉద్యానవన సిబ్బంది పాల్గొన్నారు.