
శ్రీశైలదేవస్థానం:లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్సు జాబితాలో శ్రీశైల దేవస్థానానికి స్థానం దక్కింది. ఈ మేరకు శుక్రవారం ఆ సంస్థ దక్షిణ భారత ప్రాంతీయ విభాగపు సంయుక్త కార్యదర్శి డా. ఉల్లాజి ఇలియాజర్ సంబంధిత ధృవీకరణ పత్రాన్ని దేవస్థానానికి అందజేశారు.
ఈ ధృవీకరణపత్ర సమర్పణ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు.
కాగా శ్రీశైలక్షేత్ర ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, ప్రధానాలయ విస్తీర్ణం, ప్రధానాలయం చుట్టు గల అరుదైన శిల్పప్రాకారం, క్షేత్రంలోని ప్రాచీన కట్టడాలు మొదలైన అంశాల ఆధారంగా శ్రీశైల ఆలయాన్ని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు జాబితాలో చేర్చినట్లుగా ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.
పరిపాలనా కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన ఈ ధృవీకరణపత్ర అందజేత కార్యక్రమములో ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు.
బుడ్డా రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్సులో శ్రీశైలక్షేత్రానికి చోటు లభించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. శ్రీశైలక్షేత్ర ప్రత్యేకతల కారణంగా లండన్ వరల్డ్ రికార్డ్సు జాబితాలో ఆ సంస్థవారు శ్రీశైలాన్ని చేర్చినట్లుగా తెలుస్తోందన్నారు.
అంతకు ముందు కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు ప్రారంభ ప్రసంగం చేస్తూ శ్రీశైలక్షేత్ర ప్రత్యేకతలను వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ క్షేత్రం భూమండలానికి నాభిస్థానంగా పేరొందిందన్నారు. అదేవిధంగా శ్రీశైలక్షేత్రంలో పుణ్య తీర్థాలు, సహజ జలధారలు మొదలైనవన్నీ క్షేత్ర ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తున్నాయన్నారు.
అనంతరం లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు దక్షిణభారత ప్రాంతీయ విభాగపు సంయుక్త కార్యదర్శి డా. ఉల్లాజి ఇలియాజన్ మాట్లాడుతూ క్షేత్ర విశేషాలు, క్షేత్రంతో ముడిపడివున్న అరుదైన అంశాలు మొదలైనవాటి కారణంగా శ్రీశైలాలయం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్సు జాబితాలో చేరిందన్నారు.కార్యక్రమములో పలువురు దేవస్థానం యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.