
శ్రీశైల దేవస్థానం:ఉగాది పర్వదినం సందర్భంగా మంగళవారం ఉదయం 10.00గంటలకు ఆలయ ప్రాంగణములోని శ్రీస్వామిఅమ్మవార్ల నిత్యకల్యాణమండపంలో పంచాంగ శ్రవణం కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి విచ్చేశారు. నంద్యాల జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్రెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు, అర్చకులు, వేదపండితులు, పలు విభాగాల అధికారులు, పలువురు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
శ్రీ పండిత బుట్టే వీరభద్ర దైవజ్ఞ, రాజమండ్రి , పంచాంగ పఠనం చేసి పంచాంగ శ్రవణం చేయించారు.
పంచాంగ శ్రవణం కంటే ముందు లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు, వేదపండితులు సంకల్పాన్ని పఠించారు.
ఈ సంకల్పంలో దేశం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికి ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు జరగకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన, ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, జనులందరు ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు, వేదపండితులు సంకల్పపఠనం చేశారు.
అనంతరం మహాగణపతిపూజ జరిగింది. తరువాత లోకక్షేమం కోసం శ్రీస్వామి అమ్మవార్ల కల్యాణమూర్తులకు విశేషపూజలను నిర్వహించారు.
స్వామిఅమ్మవార్ల పూజాదికాల తరువాత నూతన పంచాంగానికి కూడా పూజాదికాలు జరిపారు.
అనంతరం కార్యనిర్వహణాధికారి దేవస్థానం తరుపున ఆస్థాన సిద్ధాంతి శ్రీ పండిత బుట్టేవీరభద్ర దైవజ్ఞ వారిని ఆహ్వానించారు.తరువాత ఆస్థాన సిద్ధాంతి క్రోధినామ సంవత్సర విశేషాలను వివరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం దేశమంతటా సగటు వర్షపాతం నమోదవుతుందన్నారు. ఉత్తరాదిలో నదులు పొంగి ప్రవహిస్తాయన్నారు.దేశంలో ఆహారధాన్యాల నిల్వలు సమృద్ధిగా ఉంటాయన్నారు. పల్లపు భూములు విశేషంగా పండుతాయన్నారు. మిర్చి, ప్రత్తి, పొగాకు, ఎరుపు ధాన్యాలకు మంచి దిగుబడి ఉంటుందన్నారు. నూనెగింజల ఉత్పత్తులు పెరుగుతాయన్నారు.పారిశ్రామిక రంగంలో అభివృద్ధి ఉంటుందన్నారు. ఈ సంవత్సరం క్రీడారంగం కూడా
బాగుంటుందన్నారు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నారు. అంతరిక్ష పరిశోధనలు విజయవంతమవుతాయన్నారు.