
శ్రీశైల దేవస్థానం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో మహాశివరాత్రి రోజు మంగళవారం శ్రీ స్వామి అమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి. యాగశాల లో శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిగాయి. అనంతరం లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు జరిగాయి. మండపారాధనలు, పంచావరణార్చనలు, శివపంచాక్షరి, నిత్యహవనాలు, రుద్రహోమం, చండీహోమం, కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారంగా జరిగాయి.
సాయంకాలం ప్రదోషకాల పూజలు, జపానుష్ఠానాలు, రుద్రపారాయణలు, హోమాలు జరిపారు.
ప్రభోత్సవం :
ఈ సాయంత్రం గం.5.30 ని||లకు శ్రీ స్వామి అమ్మవార్ల ప్రభోత్సవం ఘనంగా జరిగింది.
రథోత్సవంలో రథానికి చేసినట్లుగానే ప్రభోత్సవంలో కూడా ప్రభకు పలు రకాల పుష్పాలతో పుష్పాలంకరణ చేసారు. ప్రభోత్సవంలో నాదస్వరం, కోలాటం, చెక్క భజన, శంఖం,
డమరుకం, బీరరప్పడోలు, పగటివేషాలు, తప్పెటచిందు,డోలు విన్యాసాలు మొదలైన పలు సాంప్రదాయ జానపద కళారూపాలు కూడా ఏర్పాటు చేసారు.
నందివాహనసేవ:
వాహనసేవలో భాగంగా ఈ రోజు శ్రీ స్వామిఅమ్మవార్లకు నందివాహన సేవ, ఆలయ ఉత్సవం నిర్వహించారు.
లింగోద్భవకాల మహారుద్రాభిషేకం:
ఈ రోజు (1.03.2022) రాత్రి గం.10.00ల నుండి శ్రీస్వామివారికి లింగోద్భవకాల మహారుద్రాభిషేకం, ప్రత్యేకం. నిష్ణాతులైన 11 మంది అర్చక స్వాములు మహాన్యాసపూర్వకంగా రుద్ర మంత్రాలను పఠిస్తుండగా, దాదాపు 4గంటలకు పైగా జ్యోతిర్లింగ స్వరూపుడైన శ్రీస్వామివారికి అభిషేకం ఘనం.
ఆలయప్రాంగణంలోని పవిత్రమైన మల్లికాగుండంలోని జలంతోను, పంచామృతాలతోనూ, పలు ఫలోదకాలతోనూ ఈ అభిషేకం అపురూపం.
పాగాంలకరణ:
లింగోద్భవకాల మహారుద్రాభిషేకం ప్రారంభమైన వెంటనే పాగాలంకరణ మరో ప్రత్యేకం . ఈ పాగాలంకరణకు ఎంతో ప్రత్యేకత ఉంది. మన వివాహాలలో పెండ్లికుమారునికి తలపాగ చుట్టడం ఒక సంప్రదాయం . ఈ ఆచారమే శ్రీశైల ఆలయంలో పాగాలంకరణ పేరతో ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ పాగా స్వామివారి గర్భాలయ విమాన శిఖరం నుండి ముఖమండపంపై ఉండే నందులను అనుసంధానం చేస్తూ అలంకరించారు. పాగాలను సమర్పించే భక్తులు నియమంతో భక్తిని మేళవించి రోజుకు ఒక మూర చొప్పున సంవత్సరంలో 365 మూరల పొడవుతో ఈ పాగాను నేస్తారు. ఈ పాగాలను అలంకరించే వ్యక్తి దిగంబరుడై పాగాను అలంకరించారు. దిగంబరుడై పాగాను అలంకరించవలసి ఉన్నందున పాగాలంకరణ సమయంలో ఆలయంలో విద్యుత్ సరఫరాను నిలిపి పద్ధతులను పాటించడం ఓ ప్రత్యేకం. చిమ్మచీకటిలో పాగాలంకరణ చేయడం ఎంతో నేర్పుతో కూడుకొన్న పని.
యథావిధిగా రాత్రి గం.10.00ల నుండి ప్రకాశం జిల్లా, చీరాల మండలం, హస్తినాపుర గ్రామానికి చెందిన పృథ్వీ వెంకటేశ్వర్లు తాను స్వయంగా తెచ్చిన పాగాతో పాటు ఇతర భక్తులు సమర్పించిన పాగాలను కూడా స్వామివారికి అలంకరించడం విశేషం.ఆపై వేడుకగా కల్యాణ ఘట్టం.
ప్రత్యేక వేదికపై కల్యాణోత్సవం
ఈ రోజు రాత్రి గం.12.00 లకు స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం వైభవంగా జరపడం దేవస్థాన నియమాలలో విశేషం.
కనుల పండువగా జరగనున్న ఈ కల్యాణోత్సవంలో స్వామివారు పట్టువస్త్రాన్ని ధరించి, తలపై ఒకవైపు గంగమ్మను, మరొకవైపు నెలవంకను, మెడలో రుద్రాక్షమాలను, నుదుట విభూతి రేఖలను , పట్టువస్త్రాలను ధరించి పెండ్లికుమారుడుగా ముస్తాబు చేసారు.
కాగా అమ్మవారు కూడా పట్టువస్త్రాలను ధరించి, నుదుట కల్యాణ తిలకాన్ని, బుగ్గన చుక్కను, సర్వాభరణాలను ధరించి పెండ్లికుమార్తె అయి స్వామికి సరిజోడనిపించారు. మంగళ తూర్యనాదాలతో, వేదమంత్రాల నడుమ నేత్రానందంగా ఈ కల్యాణోత్సవం జరిపారు. అంతకు ముందు ఈ లీలా కల్యాణానికి కంకణాలను స్వామి అమ్మవారి అభరణాలను,యజ్ఞోపవీతాన్ని, భాషికాలను ఊరేగింపుగా కల్యాణ వేదిక వద్దకు తీసుకొని వచ్చారు.
ఈ కల్యాణోత్సవంలో లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ ముందుగా అర్చకస్వాములు కల్యాణోత్సవ సంకల్పాన్ని తరువాత కల్యాణోత్సవం నిర్విఘ్నంగా జరగాలని గణపతి పూజ జరిపారు. ఆ తరువాత వృద్ధి అభ్యుదయాల కోసం పుణ్యహవచనం చేసారు.
తరువాత కంకణపూజ, యజోపవీతపూజ చేసి స్వామివారికి కంకణధార, యజ్ఞోపవీతధారణ చేసారు. అనంతరం సప్త ఋషుల ఘన చేసి కన్యావరణ మంత్రాలను ఆ తరువాత స్వామివారికి వరపూజను జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల ప్రవర పఠనాన్నిచేసారు.
తరువాత స్వామివారికి మధువర్కం , శ్రీస్వామిఅమ్మవార్లకు వస్త్రాలను సమర్పించారు. తరువాత భాషికధారణ కార్యక్రమం ఆ తరువాత గౌరీపూజ జరిపారు.
స్వామి అమ్మవార్ల మధ్య తెర సెల్లను ఏర్పరచి మహాసంకల్ప పఠనం అనంతరం సుముహూర్త సమయంలో స్వామిఅమ్మవార్లకు జీలకర్ర, బెల్లం సమర్పించారు. ఆ తరువాత మాంగల్యపూజను చేసి అమ్మవారికి మాంగల్యధారణ ఘట్టం జరిపారు. తరువాత తలంబ్రాలు, బ్రహ్మముడి కార్యక్రమాలను జరిపి భక్తులకు ఆశీర్వచనాన్ని చేసారు.
ఈ ఉత్సవ వేడుకలలో జిల్లా కలెక్టర్ పి కోటేశ్వర రావు, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జిల్లా జడ్జి డాక్టర్ వి. రాధాకృష్ణ కృపా సాగర్, జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి, శ్రీశైల దేవస్థానం బ్రహ్మోత్సవాల స్పెషల్ ఆఫీసర్ ఎస్ ఎస్ చంద్రశేఖర్ ఆజాద్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి లవన్న, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) ఎం కె వి శ్రీనివాసులు, ఇతర ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.