
శ్రీశైల దేవస్థానం : మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి గం.10.00ల నుండి శ్రీస్వామివారికి లింగోద్భవకాల మహారుద్రాభిషేకం జరిగింది . నిష్ణాతులైన 11 మంది అర్చక స్వాములు మహాన్యాసపూర్వకంగా రుద్ర మంత్రాలను పఠిస్తుండగా, దాదాపు 4 గంటలకు పైగా జ్యోతిర్లింగ స్వరూపుడైన శ్రీస్వామివారికి అభిషేకం ప్రత్యేకం.ఆలయప్రాంగణంలోని పవిత్రమైన మల్లికాగుండంలోని జలంతోను, పంచామృతాలతోనూ, పలు ఫలోదకాలతోనూ ఈ అభిషేకం ప్రత్యేకం.
పాగాలంకరణ:
లింగోద్భవకాల మహారుద్రాభిషేకం ప్రారంభమైన వెంటనే పాగాలంకరణ ప్రారంభమైంది. బ్రహ్మోత్సవాలలో పాగాలంకరణకు ఎంతో ప్రత్యేకత ఉంది. మన వివాహాలలో పెండ్లికుమారునికి తలపాగ చుట్టడం ఒక సంప్రదాయం. ఈ ఆచారమే శ్రీశైల ఆలయంలో పాగాలంకరణ పేరుతో ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ పాగా స్వామివారి గర్భాలయ విమాన శిఖరం నుండి ముఖమండపంపై ఉండే నందులను అనుసంధానం చేస్తూ అలంకరించారు. . పాగాలను సమర్పించే భక్తులు నియమంతో భక్తిని మేళవించి రోజుకు ఒక మూర చొప్పున సంవత్సరంలో 365 మూరల పొడవుతో ఈ పాగాను నేసారు. ఈ పాగాలను అలంకరించే వ్యక్తి దిగంబరుడై పాగాను అలంకరించాడు. దిగంబరుడై పాగాను అలంకరించవలసి ఉన్నందున పాగాలంకరణ సమయంలో ఆలయంలో విద్యుత్ సరఫరాను నిలిపి వేసారు. చిమ్మచీకటిలో పాగాలంకరణ చేయడం ఎంతో నేర్పుతో కూడుకొన్న పని. యథావిధిగా రాత్రి గం.10.00ల నుండి ప్రకాశం జిల్లా, చీరాల మండలం, హస్తినాపుర గ్రామానికి చెందిన పృథ్వీ వెంకటేశ్వర్లు గారి తనయుడు స్వయంగా తెచ్చిన పాగాతో పాటు ఇతర భక్తులు సమర్పించిన పాగాలను కూడా స్వామివారికి అలంకరించాడు.
ఈ సంవత్సరం మొత్తం 31 పాగాలు శ్రీస్వామివారికి సమర్పించారు.
ప్రకాశం జిల్లా నుంచి 4, బాపట్ల జిల్లా నుంచి 7, శ్రీకాకుళం జిల్లా నుంచి 6, విజయ నగరం జిల్లా నుండి 3, కోనసీమ జిల్లా నుండి 6, పశ్చిమ గోదావరి నుండి 2, కృష్ణా జిల్లా నుండి 1, తిరుపతి నుంచి 1 ఒడిషా నుండి 1 పాగ సమర్పించారు.