‘పద్మ పురస్కారాలు-2025’ కు నామినేషన్ లను ఈ ఏడాది సెప్టెంబరు 15 వరకు దాఖలు చేయవచ్చు

    *  వచ్చే సంవత్సరంలో గణతంత్ర దినం సందర్భంగా ప్రకటించవలసి ఉన్న ‘పద్మ పురస్కారాలు-2025’ కు నామినేషన్ ల/ సిఫారసుల ప్రక్రియ గత మే నెల 1న మొదలైంది.  ఈ నామినేషన్ లకు ఈ సంవత్సరం సెప్టెంబరు 15 ఆఖరి తేదీ.  పద్మ పురస్కారాలకు నామినేషన్ లను/సిఫారసులను రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ (https://awards.gov.in) ద్వారా ఆన్ లైన్ మాధ్యమంలో స్వీకరిస్తున్నారు.

 

పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మ శ్రీ.. ఈ ‘పద్మ’ పురస్కారాలు దేశంలోకెల్లా అత్యున్నత పౌర పురస్కారాలలో భాగంగా ఉన్నాయి.  1954వ సంవత్సరంలో మొదలు పెట్టిన ఈ పురస్కారాలను ప్రతి ఏటా గణతంత్ర దినం సందర్భంగా ప్రకటిస్తూ వస్తున్నారు.  ఈ పురస్కారాలను ‘విశిష్ట కృషి’ ని గుర్తించడానికీ, కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు,  చికిత్స, సమాజ సేవ, విజ్ఞాన శాస్త్రం, ఇంజినీరింగ్, సార్వజనిక వ్యవహారాలు, పౌర సేవ, వ్యాపారం, పరిశ్రమ వంటి అన్ని రంగాలలో/విభాగాలలో ప్రముఖమైన, అసాధారణమైన కార్యసాధనలకూ/సేవకూ ఇవ్వడం జరుగుతోంది.  తెగ, వృత్తి, పదవి, మహిళలు, పురుషులు అనే  భేదభావాలకు తావు లేకుండా అందరికీ ఈ పురస్కారాలను అందుకొనే అర్హత ఉంది.  ప్రభుత్వ రంగ సంస్థ (పిఎస్ యు) లలో పని చేస్తున్న వ్యక్తులు సహా ప్రభుత్వ ఉద్యోగులు, ‘పద్మ పురస్కారాల’కు అర్హులు కారు; వైద్యులకు, శాస్త్రవేత్తలకు మాత్రం ఈ విషయంలో మినహాయింపు ఉంది.

 

పద్మ పురస్కారాలను ‘ప్రజా పద్మాలు’గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం కంకణం కట్టుకొంది.  ఈ కారణంగా, పౌరులందరినీ వారి వారి నామినేషన్ లను/ సిఫారసులను- స్వీయ నామినేషన్ సహా- సమర్పించవలసిందిగా అభ్యర్థించడమైంది.  మహిళలు, సమాజంలో బలహీనవర్గాలకు చెందినవారు, ఎస్‌సి లు, ఎస్‌టి లు, దివ్యాంగ జనులతో పాటు సమాజానికి నిస్వార్థంగా సేవలను అందిస్తున్న వారు.. ఈ వర్గాల నుంచి శ్రేష్ఠత కలిగిన ప్రతిభావంతులను, నిజంగా పురస్కార పాత్రత కలిగిన కార్యసాధకులను గుర్తించాలనే ధ్యేయంతో ఏకోన్ముఖ ప్రయత్నాలకు నడుం కట్టవచ్చు.

 

నామినేషన్ లను/ సిఫారసులను పైన ప్రస్తావించిన పోర్టల్ లో పేర్కొన్న విధంగా సంబంధిత నిర్దిష్ట వివరాలను అన్నింటినీ- ఒక వ్యక్తి (ఆమె/అతడు) తనకు సంబంధించిన రంగంలో/విభాగంలో ఒనరించిన ప్రసిద్ధమైన, అసామాన్యమైన కార్యసాధనలను/అందించి సేవలను విడమరచి చెప్పేటటువంటి ఒక కథనాన్ని (ఇది 800 పదాలకు మించకూడదు) జోడిస్తూ- తెలియ జేయాలి.

 

దీనికి సంబంధించిన విస్తృత వివరణ హోం శాఖ వెబ్ సైట్ (https://mha.gov.in) లోని ‘పురస్కారాలు, పతకాల’ శీర్షికన, అలాగే పద్మ పురస్కారాల పోర్టల్ (https://padmaawards.gov.in ) లోనూ లభిస్తోంది.  ఈ పురస్కారాలకు సంబంధించిన విధి విధానాలు, నియమాలు వెబ్ సైట్ లింకు  https://padmaawards.gov.in/AboutAwards.aspx  లో కూడా అందుబాటులో ఉన్నాయి.

print

Post Comment

You May Have Missed