
శ్రీశైల దేవస్థానం;వినాయకచవితిని పురస్కరించుకుని ఆగస్టు 27వ తేదీన ప్రారంభమైన గణపతి నవరాత్రోత్సవాలు ఈ రోజు తో ముగిశాయి.ఈ ముగింపు కార్యక్రమంలో భాగంగా శ్రీ స్వామివారి యాగశాలలో పూర్ణాహుతి జరిపారు.
ఈ ఉత్సవాలలో ప్రతిరోజు రత్నగర్భగణపతిస్వామివారికి, సాక్షిగణపతిస్వామివారికి, యాగశాలలో నెలకొల్పిన పంచలోహ వరసిద్ధి వినాయకస్వామివారికి, సాక్షిగణపతి ఆలయములో నెలకొల్పిన మృత్తికా గణపతికి వ్రతకల్పపూర్వకపూజలు, మండపారాధనలు, ఉపనిషత్ పారాయణలు, జపానుష్ఠానాలు, గణపతి హోమం, సాయంకాల పూజలు జరిపించారు. నెలకొల్పబడిన పంచలోహవరసిద్ధి వినాయకస్వామివారికి కూడా విశేష పూజలు జరిపారు.
అనంతరం లోకకల్యాణం కోసం జపాలు, నిత్యహోమ బలిహరణలను చేసి గణపతిహోమం, జయాది హోమం జరిపారు.
తరువాత పూర్ణాహుతి, వసంతోత్సవం, అవబృథం కార్యక్రమాలు జరిగాయి.
పూర్ణాహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా నారికేళాలు పలు సుగంధద్రవ్యాలు మొదలైన ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించి పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేసారు.
తరువాత జరిగిన అవబృథంలో వరసిద్ధి వినాయకస్వామి పంచలోహమూర్తికి ఆలయ ప్రాంగణంలో గల మల్లికాగుండంలో వైదిక శాస్త్రోక్తంగా స్నపన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమములో అధికారులు, అర్చకులు, వేదపండితులు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.
మృత్తికాగణపతికి నిమజ్జనోత్సవం:
గణపతి నవరాత్రతోత్సవాల సందర్భంగా సాక్షిగణపతి ఆలయంలో నెలకొల్పిన మృత్తికా గణపతిస్వామి వారికి ఈ రోజు నిమజ్జనోత్సవం జరిగింది.ఈ సందర్భంగా మృత్తికాగణపతికి విశేషంగా పూజాదికాలు జరిగాయి.