శ్రీశైల మహాక్షేత్రంలో ఆధ్యాత్మిక గ్రంథాలయం, మ్యూజియం ఏర్పాటుకు నిర్ణయం -మంత్రి కొట్టు సత్యనారాయణ
శ్రీశైల దేవస్థానం:శ్రీశైలక్షేత్ర వైభవంపై జాతీయ సదస్సు ప్రారంభమైంది.దేవస్థానం నిర్వహిస్తున్న ఈ జాతీయ సదస్సు మూడు రోజులపాటు జరుగుతుంది. అన్నప్రసాద వితరణ భవనం లోని కమాండ్ కంట్రోల్ రూము వద్ద సమావేశ మందిరంలో ఈ సదస్సును శుక్రవారం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రారంభించారు.సదస్సులో ఆయా అంశాలపై ప్రసిద్ధులైన పండితులు, పరిశోధకులు ప్రసంగిస్తున్నారు.ఈ సదస్సుకు స్థానిక పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సాహితీ లహరి సాహిత్య సాంస్కృతిక సంస్థ, విజయవాడ వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు.
మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీశైల మహా క్షేత్రానికి అనాదిక్షేత్రం అనే ప్రసిద్ధి ఉందన్నారు. యుగయుగాలుగా ప్రసిద్ధిపొందిన ఈ క్షేత్రం భూమండలానికి నాభిస్థానంగా ప్రసిద్ధమైందన్నారు. అందుకే భారతదేశంలో ఎక్కడ ఏ పూజ చేసినా, ఏ వ్రతం ఆచరించినా మన ఉనికి శ్రీశైలక్షేత్రాన్నే కేంద్రంగా చేసుకుని చెబుతారన్నారు. చారిత్రకంగా కూడా శ్రీశైలమహాక్షేత్రం ఎంతో ప్రసిద్ధమైందన్నారు. పలు రాజవంశాల పాలనలో శ్రీశైలం సమున్నతస్థాయిని పొందిందన్నారు. శ్రీశైల ఆలయ ప్రాకారకుడ్యం కూడా ఎంతో ప్రత్యేక కలిగి ఉందన్నారు. ఈ ప్రాకార కుడ్యంపై పురాణకథలకు సంబంధించిన శిల్పాలతో పాటు సామాజిక శిల్పాలు, ప్రకృతి శిల్పాలు కూడా ఉండటం విశేషమన్నారు.
శ్రీశైల మహాక్షేత్రానికి సంబంధించిన విషయాలు జనబాహ్యంలో ఉన్నప్పటికీ మరెన్నో విషయాలు ఇంకనూ భక్తులకు తెలియవలసి ఉందన్నారు మంత్రి. అందుకే ఆయా ప్రాచీన గ్రంథాలలో పేర్కొన్న శ్రీశైల సంబంధిత అంశాలను సామాన్యులకు కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ సదస్సు అని పేర్కొన్నారు. ఈ క్షేత్రం గొప్పతనం భావితరాలకు తెలిసే విధంగా అవసరమైన అన్ని చర్యలను చేపడుతున్నామన్నారు. శ్రీశైల మహాక్షేత్రంలో ఆధ్యాత్మిక గ్రంథాలయాన్ని, మ్యూజియమును ఏర్పాటు చేయాలని కూడా సంకల్పించామన్నారు.
అంతకుముందు దేవదాయశాఖ అర్చక ట్రైనింగ్ అకాడమీ డైరెక్టర్ డా. వేదాంతం రాజగోపాల చక్రవర్తి సదస్సు లక్ష్యాలను వివరించారు. పురాణలలోనే కాకుండా మరెన్నో సంస్కృత, తెలుగు, కన్నడ, తమిళ గ్రంథాలలో శ్రీశైలం ప్రస్తావన విశేషంగా ఉందన్నారు.
కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న ప్రారంభ ప్రసంగం చేశారు. మరెక్కడా లేనివిధంగా జ్యోతిర్లింగం, మహాశక్తి స్వరూపిణి ఒకే ఆలయ ప్రాంగణంలో ఉండటం ఈ క్షేత్రం విశేషమన్నారు. దివ్యక్షేత్రంగా పేరొందిన శ్రీశైల క్షేత్రం, పవిత్రతీర్థంగా, గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా కూడా ప్రసిద్ధమైందన్నారు. అందుకే ఎందరెందరో యోగిపుంగవులు, సిద్ధపురుషులు మొదలైనవారు తమ ఆధ్యాత్మిక సాధనకు శ్రీశైలాన్నే కేంద్రంగా చేసుకున్నారన్నారు. ఈ క్షేత్రంలో లెక్కకు మిక్కుటంగా వెలసిన సహజ జలధారలు, గుహలు, గుహాలయాలు క్షేత్ర ఆధ్యాత్మిక వైభవానికి దోహదం చేసాయన్నారు.
ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ శ్రీశైలక్షేత్రం చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా, సంస్కృతీపరంగా ఎన్నో ప్రత్యేకతలు కలిగివుందన్నారు. సదస్సు ద్వారా శ్రీశైల సంబంధి అంశాలను ప్రామాణికంగా తెలుసుకునే అవకాశం కలుగుతుందన్నారు. ధర్మకర్తల మండలి సభ్యులు మఠం విరూపాక్షయ్యస్వామి, మేరాజోత్ హనుమంతునాయక్ ప్రసంగీస్తూ ఈ క్షేత్రం మహిమాన్వితమన్నారు.
మధ్యాహ్నం జరిగిన కార్యక్రమానికి స్థానిక తెలుగు విశ్వవిద్యాలయ డీన్ డా. ఎం. శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. శ్రీశైలానికి సంబంధించిన పలు చారిత్రక అంశాలను ప్రస్తావించారు. వివిధ రాజవంశాల కాలంలో శ్రీశైలక్షేత్ర పరిశీలన అనే అంశం గురించి ప్రస్తావించారు.
మధ్యాహ్నం జరిగిన కార్యక్రమం లో అష్టదళపద్మం – శ్రీశైలమహాక్షేత్రం అనే అంశంపై శ్రీశైల దేవస్థాన విశ్రాంత సంపాదకులు డా. వి.ఎం. చక్రవర్తి, తీర్థయాత్ర క్షేత్రంగా శ్రీశైలం – చారిత్రక నేపథ్యం అనే అంశపై స్థానిక తెలుగువిశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఇ శోభన్బాబు, ఘంటామఠంలో లభించిన తామ్ర శాసనాలు – అధ్యయనం అనే అంశంపై ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, మైసూర్ లో ఎపీగ్రఫిస్ట్ గా విధులు నిర్వహిస్తున్న డా. ఎం.వి.ఆర్. వర్మ, శ్రీశైలక్షేత్రంలోని భైరవసెలను గురించి డా. కత్తి వెంకటమ్మ, మధ్యయుగాంతంలోని వీరశైవమతం – అక్కమహాదేవి చరిత్ర అనే అంశంపై కుమారి బి. శివగంగమ్మ ప్రసంగించారు.
ప్రసంగికులకు కార్యనిర్వహణాధికారి లవన్న , శ్రీస్వామి వారి శేష వస్త్రం, ప్రసాదాలు, శ్రీస్వామిఅమ్మవార్ల జ్ఞాపికతో సత్కరించారు.
Post Comment