ఆగస్టు 5, త్రయోదశి రోజున పరోక్షసేవగా నందీశ్వరస్వామివారి విశేషపూజ

 శ్రీశైల దేవస్థానం:శ్రీశైల మహాక్షేత్రాన ప్రధాన ఆలయం లో మల్లికార్జునస్వామివారికి అభిముఖంగా కొలువైవున్న నందీశ్వరస్వామివారి శనగలబసవన్న స్వామివారి) విశేషపూజలో భక్తులు పరోక్ష ఆర్జితసేవ ద్వారా పాల్గొనే అవకాశం కల్పించారు.

ఈ నెల 5వ తేదీ సాయంకాలానికి త్రయోదశి ఘడియలు రావడంతో సాయంత్రం 5.30 గంటల నుంచి ఈ విశేషపూజాదికాలను చేస్తారు. భక్తులు ఈ విశేషపూజను పరోక్షసేవగా జరిపించుకోవచ్చు.

 లోకకల్యాణం కోసం దేవస్థానం ప్రతి మంగళవారం,  త్రయోదశి రోజులలో శ్రీనందీశ్వరస్వామివారికి విశేషపూజాదికాలను నిర్వహిస్తోంది. త్రయోదశిరోజున జరిగే పూజలలో భక్తులు కూడా పాల్గొనే అవకాశం కల్పించామని ఈ ఓ తెలిపారు.

ఈ పరోక్ష ఆర్జిత సేవకు భక్తులు ఆన్లైన్ ద్వారా రూ.1,116/-లను సేవారుసుముగా చెల్లించాల్సి ఉంటుంది.

భక్తులు సేవారుసుమునుwww.srisailadevasthanam.org లేదా www.tms.ap.gov.inద్వారా చెల్లింపు చేయవచ్చు.

ఈ స్వామి ఆరాధన వలన సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని, సమస్యలు తొలగి సుఖసంతోషాలు కలుగుతాయని, ఋణబాధలు తీరుతాయని, అనారోగ్యం తొలగి ఆరోగ్యం చేకూరుతుందని, కష్టాలు నివారించబడతాయని, మానసిక ప్రశాంతత చేకూరుతుందని పండితులు పేర్కొంటున్నారు.

అదేవిధంగా ఈ స్వామికి నానబెట్టిన శనగలను సమర్పించడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి.

 కాగా శ్రీశైలక్షేత్రానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు ఆయా సేవలను జరిపించుకునేందుకు వీలుగా గత సంవత్సరం ఏప్రియల్ 13న దేవస్థానం పరోక్షసేవ విధానాన్ని ప్రవేశపెట్టింది.

ప్రస్తుతం రాష్ట్ర దేవదాయశాఖ ఉన్నతాధికారులవారి ఆదేశాల మేరకు దేవస్థానం నిర్వహిస్తున్న ఈ పరోక్షసేవలను మరింతగా విస్తరింపజేసేందుకు పలు చర్యలు తీసుకోబడుతున్నాయి.

ఇందులో భాగంగానే ఈ పరోక్షసేవలో ప్రతీ త్రయోదశి రోజున నందీశ్వరస్వామివారికి విశేష పూజను జరిపించుకునే వీలుకూడా కల్పించారు.

ఈ పరోక్షసేవ ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించేందుకు వీలుగా ప్రసార వివరాలు, ప్రసారాల సమయం మొదలైనవాటిని ఎప్పటికప్పుడు సేవాకర్తలకు తెలుపుతున్నారు.

సేవాకర్తలేకాకుండా భక్తులందరు కూడా వీటిని శ్రీశైలటి.వి | యూ ట్యూబ్ ద్వారా వీక్షించవచ్చును.

భక్తులందరు కూడా ఈ పరోక్షసేవను సద్వినియోగం చేసుకోవాలని  దేవస్థానం కోరుతోంది .

ఇతర వివరములకు దేవస్థానం సమాచార కేంద్ర ఫోన్ నంబర్లు 83339 01351/52/53/ 54/55/56 లను సంప్రదించవచ్చును.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.