పరోక్షసేవగా నందీశ్వరస్వామివారికి విశేషపూజ

 శ్రీశైల దేవస్థానం: నందీశ్వరస్వామివారికి పరోక్షసేవగా ఈ రోజు (18.10.2021)న  విశేషార్చన జరిగింది.

ప్రతి మంగళవారం రోజున, త్రయోదశి రోజులలో దేవస్థాన సేవగా (సర్కారీసేవగా) ఈ కైంకర్యం చేస్తున్నారు.

అయితే ప్రతి నెలలో కూడా త్రయోదశి రోజులలో , శుద్ధ త్రయోదశి,  బహుళ త్రయోదశి రోజులలో భక్తులు నందీశ్వరస్వామివారి పూజను భక్తులు పరోక్ష సేవగా జరిపించుకునే అవకాశం కల్పించారు.

కాగా ఈ పూజాదికాలలో ముందుగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకుమహాగణపతిపూజను చేసారు.

ఆ తరువాత నందీశ్వరస్వామికి  పంచామృతాలతోనూ, పలు ఫలోదకాలతోనూ హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, భస్మోదకం, రుద్రాక్షోదకం, బిల్వోదకం, పుష్పోదకం, సువర్లోదకం మరియు మల్లికాగుండంలోని శుద్ధజలంతో అభిషేకం నిర్వహించారు. తరువాత నందీశ్వరస్వామికి అన్నాభిషేకం జరిగింది.

పురుషసూక్తం, వృషభసూక్తం మొదలైన వేదమంత్రాలతో శాస్తోక్తంగా ఈ విశేషాభిషేకాన్ని చేసారు. తరువాత నందీశ్వరస్వామివారికి నూతనవస్త్ర సమర్పణ, విశేషపుష్పార్చనలను చేసారు. తరువాత నానబెట్టిన శనగలను నందీశ్వరస్వామికి సమర్పించారు. చివరగా స్వామికి నివేదన చేసారు.

కాగా నందీశ్వరస్వామివారి పరోక్షసేవకు భక్తులు ఆన్లైన్ ద్వారా రూ.1,116/-లను సేవారుసుముగా చెల్లించాల్సి ఉంటుంది.

భక్తులు సేవారుసుమును www.srisailadevasthanam.org లేదా http: //aptemples.ap.gov.in ద్వారా చెల్లింపు చేయవచ్చు.

నందీశ్వరస్వామివారి ఆరాధన వలన సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని, సమస్యలు తొలగి సుఖసంతోషాలు కలుగుతాయని, ఋణబాధలు తీరుతాయని, అనారోగ్యం తొలగి ఆరోగ్యం చేకూరుతుందని, కష్టాలు నివారించబడతాయని, మానసిక ప్రశాంతత కూరుతుందని పండితులు పేర్కొంటున్నారు.

అదేవిధంగా ఈ స్వామికి నానబెట్టిన శనగలను సమర్పించడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పబడుతోంది. అందుకే ఈ స్వామివారికి శనగలబసవన్న అనే పేరు కూడా ప్రసిద్ధంగా ఉంది.

ఈ పరోక్షసేవ ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించేందుకు వీలుగా ప్రసార వివరాలు, ప్రసారాల సమయం మొదలైనవాటిని ఎప్పటికప్పుడు సేవాకర్తలకు తెలుపుతారు.

సేవాకర్తలేకాకుండా భక్తులందరు కూడా వీటిని శ్రీశైలటి.వి / యూ ట్యూబ్ ద్వారా వీక్షించవచ్చును.  భక్తులందరు కూడా ఈ పరోక్షసేవను సద్వినియోగం చేసుకోవాలని దేవస్థానం కోరింది.

ఇతర వివరాలకు దేవస్థానం సమాచార కేంద్ర ఫోన్ నంబర్లు 83339 01351/ 52 /53/54 /55/56 లను సంప్రదించవచ్చును.

print

Post Comment

You May Have Missed