×

త్రయోదశి సందర్భంగా నందీశ్వరస్వామి వారికి పరోక్షసేవగా విశేషార్చన

త్రయోదశి సందర్భంగా నందీశ్వరస్వామి వారికి పరోక్షసేవగా విశేషార్చన

 శ్రీశైల దేవస్థానం: త్రయోదశి సందర్భంగా నందీశ్వరస్వామి వారికి పరోక్షసేవగా విశేషార్చన జరిగింది.

ప్రతి మంగళవారం , త్రయోదశి రోజులలో దేవస్థానసేవగా (సర్కారీసేవగా) ఈ కైంకర్యం వుంటుంది.

 ప్రతి నెలలోకూడా త్రయోదశి రోజులలో,శుద్ధ త్రయోదశి , బహుళ త్రయోదశి రోజులలో భక్తులు నందీశ్వరస్వామివారి పూజను పరోక్షసేవగా జరిపించుకునే అవకాశం కూడా కల్పించారు.

 ఈ రోజు మొత్తం 32 మంది భక్తులు పరోక్షసేవగా ఈ నందీశ్వరస్వామి విశేషపూజను జరిపించుకున్నారు.

ఇందులో తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా పశ్చిమ బెంగాల్ తదితర ప్రాంతాల నుంచి కూడా ఈ విశేషపూజను నిర్వహించుకున్నారు.

ఈ పూజాదికాలలో ముందుగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజను

జరిపారు.ఆ తరువాత నందీశ్వరస్వామికి శాస్త్రోక్తంగా పంచామృతాలతోనూ, పలు ఫలోదకాలతోనూ హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, భస్మోదకం, రుద్రాక్షోదకం, బిల్వోదకం, పుష్పోదకం, సువర్ణోదకం, మల్లికాగుండంలోని శుద్ధజలంతో అభిషేకం నిర్వహించారు. తరువాత నందీశ్వరస్వామికి అన్నాభిషేకం నిర్వహించారు.

పురుషసూక్తం, వృషభసూక్తం మొదలైన వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా ఈ విశేషాభిషేకాన్ని చేస్తారు. తరువాత నందీశ్వరస్వామివారికి నూతన వస్త్ర సమర్పణ, విశేష పుష్పార్చనలు జరిగాయి. తరువాత నానబెట్టిన శనగలను నందీశ్వరస్వామికి సమర్పించారు. చివరగా స్వామికి నివేదన సమర్పించారు.

కాగా త్రయోదశి రోజున  నందీశ్వరస్వామివారి పరోక్షసేవకు భక్తులు ఆన్లైన్ ద్వారా రూ.1,116/-లను సేవారుసుముగా చెల్లించాల్సి ఉంటుంది.

భక్తులు సేవారుసుమును www.srisailadevasthanam.org లేదా aptemples.ap.gov.in ద్వారా చెల్లింపు చేయవచ్చు.

నందీశ్వరస్వామివారి ఆరాధన వలన సంతానంలేనివారికి సంతానం కలుగుతుందని, సమస్యలు తొలగి సుఖసంతోషాలు కలుగుతాయని, ఋణబాధలు తీరుతాయని, అనారోగ్యం తొలగి ఆరోగ్యం చేకూరుతుందని, కష్టాలు నివారించబడతాయని, మానసిక ప్రశాంతత చేకూరుతుందని పండితులు పేర్కొంటున్నారు.

అదేవిధంగా ఈ స్వామికి నానబెట్టిన శనగలను సమర్పించడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పబడుతోంది. అందుకే ఈ స్వామివారికి శనగలబసవన్న అనే పేరు కూడా ప్రసిద్ధంగా ఉంది.

 సేవాకర్తలేకాకుండా భక్తులందరు కూడా వీటిని శ్రీశైలటి.వి / యూ ట్యూబ్ ద్వారా వీక్షించవచ్చును.

భక్తులందరు కూడా ఈ పరోక్ష సేవను సద్వినియోగం చేసుకోవాలని దేవస్థానం కోరింది.

ఇతర వివరములకు దేవస్థానం సమాచార కేంద్ర ఫోన్ నంబర్లు 833390351 52 53 లను సంప్రదించవచ్చును.

print

Post Comment

You May Have Missed