
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానంలో మృత్యుంజయ మంత్ర జప పారాయణ ముగిసింది. లోకకల్యాణార్థం దేవస్థానం 40రోజులకు పైగా నిర్వహించిన మృత్యుంజయ మంత్రజప పారాయణ కార్యక్రమం ఈ రోజు (03.07.2021)తో ముగిసింది. గత మే నెలలో, వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున ఈ పారాయణ కార్యక్రమం ప్రారంభమైంది.ముఖ్యంగా కరోనా సంక్షోభం వలన ఏర్పడిన విపత్కర పరిస్థితులు తొలగిపోయి అందరికీ ఆయురారోగ్యాలు చేకూరాలని, అకాల మరణాలు నివారణ జరగాలని ఈ విశేష పారాయణను నిర్వహించారు.
ప్రతిరోజు ఆలయప్రాంగణములోని అక్కమహాదేవి అలంకార మండపంలో ఉదయం 8.00గంటల నుంచి ఈ పారాయణలు నిర్వహించారు.
ఈ పారాయణలో అంతర్జాలం ద్వారా భక్తులు కూడా వారి ఇళ్ల వద్ద నుంచే పాల్గొని మంత్ర పారాయణను చేసే అవకాశం కూడా కల్పించారు . పారాయణ ప్రారంభానికి ముందస్తుగా ప్రతీరోజూ గూగుల్ లింకను దేవస్థానం వెబ్ సైట్ www.srisailadevasthanam.org ద్వారా భక్తులకు తెలిపారు.వివిధ ప్రాంతాల నుంచి పలువురు భక్తులు అంతర్జాలం ద్వారా పాల్గొన్నారు.
ఈ పారాయణ ముగింపు సందర్భంగా కార్యనిర్వహణాధికారి కే ఎస్ .రామరావు మాట్లాడుతూ రాష్ట్ర దేవదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. దేవా దాయశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి డా. శ్రీమతి వాణీమోహన్, కమి షనర్ అర్జునరావు కార్యక్రమ నిర్వహణకు ఎంతోగానో ప్రోత్సహాన్ని అందించారన్నారు.
మొత్తం 40 రోజులకు పైగా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగిందని, పలుప్రాంతాలలోని భక్తులు గూగుల్ మీట్ లింక్ ద్వారా పా ల్గొన్నారన్నారు.
కార్యక్రమం నిర్వహణలో స్వామివారి ఆలయ అర్చక, పరిచారక సిబ్బంది, ఆలయ, ప్రచార, ఐ.టి, ఎలక్ట్రికల్ విభాగపు అధికారులు, సిబ్బంది తదితరులందరు పాలుపంచుకున్నారని , కార్యక్రమాన్ని జయప్రదం చేసిన సిబ్బంది అందరికీ ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి ధన్యవాదాలు తెలియజేశారు.
కార్యక్రమం చివరలో స్వామివారి ప్రధానార్చకులకు వీరభద్రయ్యస్వామికి, స్వామివారి ఆలయ పర్యవేక్షకులు అయ్యనకు, ఐ.టి విభాగపు సిస్టమ్ అడ్మినిస్టేటర్ ఇందూధర్ రెడ్డికి, పారాయణలు చేసిన 20 మంది అర్చక, పరిచారక సిబ్బందికి, ఇతర విభాగాల అయిదుమంది సిబ్బందికి కార్యనిర్వహణాధికారి ప్రశంసాపత్రాలను అందజేశారు.
అదేవిధంగా ప్రశంసాపత్రాలతో పాటు దేవస్థానం ఇటీవల ప్రచురించిన శ్రీశైలవైభవం గ్రంథాన్ని కూడా అందించారు. ప్రఖ్యాత ప్రవచకులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ ఈ గ్రంథాన్ని రచించారు.
* Dr.Mallikarjun, Shimoga District, Karnataka State donated Rs.1,00,110/- For Annadhaanam scheme in the temple.