మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లన్నీ కూడా ఫిబ్రవరి మొదటి వారంలోగానే పూర్తి చేయాలి-ఈ ఓ

 శ్రీశైల దేవస్థానం: మహా శివరాత్రి  బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19న ప్రారంభమవుతున్నప్పటికీ, పాదయాత్రతో వచ్చే భక్తులు ఉత్సవాల కంటే ముందుగానే క్షేత్రానికి చేరుకోనున్నందున ఏర్పాట్లన్నీ కూడా ఫిబ్రవరి మొదటి వారంలోగానే పూర్తి చేయాలన్నారు ఈ ఓ.  ఫిబ్రవరి 19 నుండి మార్చి 1వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.

 బ్రహ్మోత్సవాల నిర్వహణకు సంబంధించి చేయాల్సిన ఆయా ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా సోమవారం  కార్యనిర్వహణాధికారి  ఎం. శ్రీనివాసరావు సంబంధిత అధికారులతో కలిసి కైలాసద్వారం, హాటకేశ్వరం, క్యూకాంప్లెక్సు తదితర ప్రదేశాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి  మాట్లాడుతూ అటవీశాఖ వారి సహకారంతో భీమునికొలను మెట్ల మార్గం, కైలాసద్వారం వద్ద పిచ్చిమొక్కలను తొలగించే పనులు (జంగిల్ క్లియరెన్సు ) వీలైనంత త్వరగా ప్రారంభించాలన్నారు. అదేవిధంగా కైలాసద్వారం నుంచి హాటకేశ్వరం వరకు రహదారికి ఇరువైపులా ఉండే పిచ్చిమొక్కలు కూడా తొలగించాలన్నారు. అటవీశాఖ వారి సహకారంతో ఆ రహదారిపై గ్రావెల్ ఏర్పాటు పనులు కూడా చేయాలని సూచించారు.

 కైలాసద్వారం వద్ద ఏర్పాటు చేయనున్న చలువపందిర్లు, తాత్కాలిక షెడ్లు, మంచినీటి వసతి, తాత్కాలిక విద్యుద్దీకరణ మొదలైన ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలన్నారు ఈ ఓ.బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19న ప్రారంభమవుతున్నప్పటికీ, పాదయాత్రతో వచ్చే భక్తులు ఉత్సవాల కంటే ముందుగానే క్షేత్రానికి చేరుకోనున్నందున ఏర్పాట్లన్నీ కూడా ఫిబ్రవరి మొదటి వారంలోగానే పూర్తి చేయాలన్నారు.

కైలాసద్వారం వద్ద అన్నదానం చేసే భక్త బృందాలకు దేవస్థానం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు ఈ ఓ. అక్కడ దాతలు అన్నదానాన్ని ప్రారంభించేంత వరకు భక్తుల రద్దీని అనుసరించి దేవస్థానమే అన్నప్రసాదాలను అందజేసేవిధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.ఉత్సవ రోజులలో కైలాసద్వారం , పరిసరాలను, భీమునికొలను మెట్ల ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుండేవిధంగా పారిశుద్ధ్య ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వారి సమన్వయంతో బ్రహ్మోత్సవాల రోజులలో కైలాసద్వారం వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు ఈ ఓ. ముఖ్యంగా ఈ శిబిరంలో ఒళ్ళునొప్పులకు సంబంధించిన ఔషధాలతో పాటు పూతమందులు (ఆయింట్మెంట్) కూడా అధికసంఖ్యలో అందుబాటులో ఉంచుకోవాలన్నారు.

* హాటకేశ్వర ఆలయాన్ని పరిశీలించారు ఈ ఓ. హాటకేశ్వర ఆలయ ప్రాంగణ ఉద్యానవనంలో మరిన్ని దేవతా మొక్కలు నాటాలని ఉద్యానవన అధికారులను ఆదేశించారు.అనంతరం క్యూకాంప్లెక్సును, దర్శనం క్యూలైన్లను పరిశీలించారు. క్యూకంపార్టుమెంట్లలో ఫ్లోరింగులను ఎలాంటి పగుళ్ళు లేకుండా అవసరమైనచోట్ల తగు మరమ్మతులు చేయాలని ఆదేశించారు.క్యూకాంప్లెక్సులో మరిన్ని శౌచాలయాలను ఏర్పాటు చేయాలన్నారు. అన్ని శౌచాలయాలలో శుభ్రత నిర్వహణపట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. అన్ని శౌచాలయాలకు కూడా నిరంతరం నీటిసరఫరా ఉండేవిధంగా అధికారులు పర్యవేక్షిస్తుండాలన్నారు.క్యూకాంప్లెక్సులోని మంచినీటి కుళాయిలు, వాష్ బేసిన్లు అన్ని కూడా వినియోగించడానికి అందుబాటులో ఉండాలన్నారు.ముఖ్యంగా క్యూకాంప్లెక్సులో వినియోగంలో ఉన్న ప్లాస్టిక్ కుర్చీల స్థానంలో ఎయిర్పోర్టు చైర్లను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు.పెద్దసత్రం సమీపంలో ఏర్పాటు చేస్తున్న పాదరక్షలు భద్రపరిచే గదిని వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. 

ప్రధాన రహదారి నుంచి క్యూకాంప్లెక్సుకు వెళ్ళే మార్గంలో అనగా క్యాంటిన్ నెం -1 భవనాన్ని తొలగించిన ప్రదేశంలో బండపరుపు వేసే చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు ఈ ఓ.అదేవిధంగా శ్రీశైలటీవి ప్రసారాలు చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తులు తిలకించేందుకు వీలుగా క్యూకాంప్లెక్సులో ఎల్.ఈ.డి స్క్రీన్లను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు.

క్యూకాంప్లెక్సులో ఎటువంటి తొక్కిసలాటలు జరగకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలని భద్రతా విభాగాన్ని ఆదేశించారు ఈ ఓ. ఈ విషయమై పోలీస్ శాఖ వారి పూర్తి సహాయ సహకారాలను పొందాలన్నారు. కైలాసద్వారం ఏర్పాట్ల పరిశీలనలో దేవస్థాన ఇంజనీరింగ్, భద్రతా అధికారులతో పాటు స్థానిక అటవీశాఖ రేంజ్ అధికారి  సుభాష్ రెడ్డి, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.అదేవిధంగా క్యూకాంప్లెక్సు , క్యూలైన్ల పరిశీలనలో ఇంజనీరింగ్ అధికారులతో పాటు క్యూకాంప్లెక్సు విభాగపు అధికారులు కూడా పాల్గొన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.