
శ్రీశైల దేవస్థానం:కౌమారీదేవి అమ్మవారికి, కాలభైరవస్వామివారికి ప్రాచీనశైలిలో ఆలయాలు నిర్మించాలని మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశించారు. ఉపముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ శనివారం సాయంకాలం పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు.
పాతాళగంగరోడ్డు, ప్రధానాలయానికి తూర్పుభాగంలో నిర్మించతలపెట్టిన రహదారి ప్రదేశం, క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రతిపాదించిన ప్రదేశం, ఆలయ దక్షిణ, పశ్చిమ మాడ వీధులు (శివవీధులు), ఏనుగుల చెరువు కట్ట ప్రాంతం, పంచమఠాలు మొదలైన వాటిని మంత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి లవన్న , ఆయా ప్రదేశాల అభివృద్ధి ప్రతిపాదనల గురించి మంత్రికి వివరించారు.
తరువాత ఆయా ప్రదేశాల పరిశీలన సందర్భంగా మంత్రి పలు సూచనలను చేశారు.ప్రధానాలయ తూర్పుభాగంలోని రహదారిని సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. భక్తులందరు స్వామివార్ల ప్రభోత్సవం, రథోత్సవం, గ్రామోత్సవాలను వీక్షించేందుకు వీలుగా ఈ రహదారిపై గ్యాలరీ నిర్మాణానికి చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా ఈ రహదారిలో ఇరువైపులా సుందరీకరణ మొక్కలతో పచ్చదనాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఆధ్యాత్మికత ఉట్టిపడేవిధంగా తగు చర్యలు చేపట్టాలన్నారు. ఈ రహదారిపై కళాత్మక లైటింగ్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టవలసినదిగా ఆదేశించారు.
తరువాత క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రతిపాదించిన ప్రధానాలయ దక్షిణభాగంలో ప్రదేశాన్ని
( రుద్రాక్షవనం ప్రదేశం) ఆలయ మాడ వీధులను, ఆలయ ప్రాకారకుఢ్యాన్ని మంత్రి పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ మాడవీధులలో సుందరీకరణకు చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా పశ్చిమమాడవీధి ఎగువ ప్రాంతంలో కూడా సుందరీకరణ మొక్కల పెంపకానికి, ల్యాండ్ స్కేపింగ్ గార్డెనింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.తరువాత ఏనుగుల చెరువుకట్ట ప్రాంతాన్ని పరిశీలిస్తూ, చెరువు పరిసర ప్రాంతాలన్నింటిని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలన్నారు.
అనంతరం పంచమఠాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మఠాల ప్రాంగణాలు, పరిసరాలు ఆహ్లాదకరంగా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా మఠాల ప్రాంగణాలచుట్టూ పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలన్నారు. మఠాల ప్రాంగణములో బిల్వం, కదంబంలాంటి దేవతా వృక్షాలను పెంచాలన్నారు.భక్తులందరు ఈ మఠాలన్నీంటిని దర్శించుకునేందుకు వీలుగా అన్ని మఠాలు కలుపుతూ ( ఒకే సర్క్యూట్) నిర్మిస్తున్న ఏకరహదారి పనులను వీలైనంత త్వరలో పూర్తి చేయాలన్నారు.
ఆయా మఠాల ప్రాశస్త్యం తెలిసేవిధంగా అన్నిచోట్ల కూడా బోర్డులను ఏర్పాటు చేయాలని కూడా మంత్రి ఆదేశించారు.
ఘంటామఠం ప్రాంగణములోని కౌమారీదేవి అమ్మవారికి నూతనంగా ఆలయాన్ని నిర్మించాలన్నారు. ఘంటామఠం సముదాయంలోని ఇతర ఆలయాల నిర్మాణశైలి పోలివుండే విధంగా పూర్తి రాతికట్టడంగా ఈ ఆలయ నిర్మాణం ఉండాలన్నారు.అదేవిధంగా యాంఫీథియేటర్ ( సాంస్కృతిక కళాప్రదర్శనశాల) సమీపంలోని కాలభైరవస్వామివారికి కూడా ప్రాచీనశైలిలో ఆలయం నిర్మించేందుకు తగు చర్యలు చేపట్టాలన్నారు.అనంతరం మంత్రి హేమారెడ్డిమల్లమ్మ మందిరాన్ని దర్శించుకున్నారు.
ఈ పరిశీలనలో సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు నరసింహారెడ్డి, ప్రజాసంబంధాల అధికారి టి.శ్రీనివాసరావు, పర్యవేక్షకులు అయ్యన్న, రవికుమార్, రెవెన్యూ విభాగపు గుమాస్తాలు మల్లిక్ రాజా, రవి, సహాయ స్థపతి ఐ. ఉమావెంకట జవహర్లాల్, ఉద్యానవన అధికారి లోకేష్, సహాయ ఇంజనీరు భవన్, ఎడిటర్ డా.సి.అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.