
శ్రీశైల దేవస్థానం:కార్తీకమాసం సందర్భంగా దేవస్థానం బుధవారం సాధువులకు వన భోజనాలను ఏర్పాటు చేసింది. హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా ఈ వనభోజనాలను ఏర్పాటు చేసారు. ఈ విధంగా సాధువులకు ప్రత్యేకంగా వనభోజనాలు ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. రుద్రాక్షమఠం సమీపంలో మహిషాసురమర్థిని ఆలయం వద్ద వన భోజన కార్యక్రమం ఏర్పాటు చేసారు.శ్రీశైల క్షేత్రంలోని పలువురు సాధువులేకాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సాధువులు కూడా ఈ వనభోజనానికి విచ్చేశారు.
ఈ కార్యక్రమం లో దేవస్థానం కార్యనిర్వహణాధికారి లవన్న తో పాటు ధర్మకర్తల మండలి సభ్యులు మేరాజోత్ హనుమంత్ నాయక్, ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు పాల్గొన్నారు. కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ మన ఆచార వ్యవహారాలలో కార్తీక వనభోజనాలకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. ముఖ్యంగా శ్రీశైలక్షేత్రంలో ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనడం ఎంతో ఫలదాయకమని అన్నారు.శ్రీశైల సిద్ధక్షేత్రంగా ప్రసిద్ధమైందన్నారు. ఎంతో ప్రాచీనకాలంనుంచి కూడా ఎందరో సిద్ధ పురుషులు శ్రీశైలాన్నే తమ నివాసాన్ని చేసుకున్నారని పేర్కొన్నారు. ఆలయ ప్రాకారకుడ్యం మీద, ఘంటామఠం వద్ద, ఇష్టకామేశ్వరి ఆలయం మొదలైనచోట్ల సిద్ధపురుషుల విగ్రహాలు ఉన్నాయన్నారు. భారతీయ హృదయానికి సాకారమే శివుడని మన సంప్రదాయం చెబుతోందన్నారు.శాంతం, సమత్వం, త్యాగం, నిరాడంబరత అనేది శివతత్త్వం ప్రబోధిస్తుందన్నారు. అందుకే మన సంప్రదాయంలో శివారాధన ఎంతగానో వ్యాప్తమైందన్నారు. పరమేశ్వరుడు ఈ విశ్వమంతా వ్యాపించియున్నాడని, పరమేశుని ఆరాధించడం వలన విశ్వానికంతా శ్రేయస్సు కలుగుతుందన్నారు.
ప్రాచీన కట్టడాల పరిరక్షణలో భాగంగా దేవస్థానం పంచమఠాల పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు ఈ ఓ. అతిత్వరలో ఈ పంచమఠాల పునరుద్ధరణ పనులు పూర్తవుతుందన్నారు. పంచమఠాలు పునరుద్ధరణ పనులు పూర్తయినవెంటనే, అన్ని మఠాలను ఒకేసారి దర్శించేవిధంగా ఏకరహదారిని నిర్మించడం జరుగుతుందన్నారు.ధ్యానం, పారాయణలు చేసుకునేందుకు పంచమఠాలు ఎంతో అనువుగా ఉంటాయన్నారు. అందుకే సాధువులందరు కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.
తరువాత ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు ప్రసంగించారు. దేవస్థానం పక్షాన సాధువుల వనభోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కార్యనిర్వహణాధికారిని ధర్మకర్తల మండలి తరుపున అభినందించారు. దేవస్థాన అభివృద్ధి కార్యక్రమాలకు ధర్మకర్తల మండలి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తుందన్నారు.తరువాత ధర్మకర్తల మండలి సభ్యులు మేరాజోత్ హనుమంత్ నాయక్ మాట్లాడుతూ ఆధునీకత, వేగవంతమైన జీవితం మొదలైన వాటివలన చాలామంది ముఖ్యంగా యువతీయువకులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్నారు.మన సనాతన ధర్మం ప్రబోధించిన యోగా, ధ్యానం లాంటి వాటిని సాధన చేయడం వలన మానసిక ఒత్తిడిని దూరం చేసుకుని ఉత్సహవంతమైన జీవితాన్ని గడపవచ్చునన్నారు.
ఈ కార్యక్రమం లో అన్నప్రసాద వితరణ సహాయ కార్యనిర్వహణాధికారి డి. మల్లయ్య, ఎడిటర్ డా.సి.అనిల్ కుమార్, ప్రజాసంబంధాల అధికారి టి. శ్రీనివాసరావు, పర్యవేక్షకురాలు పి. దేవిక, అన్నప్రసాద వితరణ గుమాస్తా కోమలి, ముఖ్యభద్రతా అధికారి నరసింహారెడ్డి తదితర సిబ్బంది పాల్గొన్నారు.