
శ్రీశైలదేవస్థానం: కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలలోని పలు భక్త సంఘాలు,పాదయాత్ర బృందాలు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులతో శ్రీశైల దేవస్థానం బుధవారం బీజాపూర్ (విజయపుర)లో సమావేశాన్ని నిర్వహించింది. శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు 30.03.2022 నుండి 03.04.2022వరకు జరుగనున్నాయి. ఉగాది పర్వదినం 02.04.2022న రానున్నది. ఈ ఉత్సవాలకు కర్ణాటక రాష్ట్రం నుండి ముఖ్యంగా ఉత్తర కర్ణాటక ప్రాంతం నుండి మహారాష్ట్రలోని షోలాపూర్, సాంగ్స్ తదితర ప్రాంతాల భక్తులు తరలివస్తారు. వీరిలో పలు ప్రాంతాల భక్తులు పాదయాత్రతో శ్రీశైలం రావడం విశేషం. ఈ నేపధ్యంలో ఈ సమావేశం జరిగింది. కళాభవనం ఆడిటోరియం లో ఈ సమావేశం ఏర్పాటు చేసారు.
శ్రీశైల జగద్గురు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చెన్నసిద్ధరామ శివాచార్య మహాస్వామి కూడా ఈ సమావేశంలో పాల్గొని అనుగ్రహ భాషణం చేశారు.
ఈ సమావేశంలో దేవస్థానం ఈ ఓ ఎస్.లవన్న మాట్లాడుతూ శ్రీశైల దేవస్థానం పక్షాన కన్నడ ప్రాంతానికి విచ్చేసి, ఈ విజయపుర నగరములో శ్రీస్వామి అమ్మవార్ల భక్తాదులతో సంభాషించే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కర్ణాటక భక్తులకు 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 7 రోజులపాటు స్వామివార్ల స్పర్శదర్శనం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.శ్రీశైలక్షేత్ర సంస్కృతీ సంప్రదాయాలలో కన్నడ ప్రాంతానికి ఎంతో విశిష్టస్థానం ఉందని తెలుపుతూ, కన్నడ భక్తులు శ్రీభ్రమరాంబాదేవివారిని తమ ఆడపడుచుగా, శ్రీమల్లికార్జునస్వామివార్లను తమ అల్లునిగా భావిస్తారన్నారు.
ఇటీవల కాలంలో 11రోజులపాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహించామని, ఇదే పంథాలో ఉగాది మహోత్సవాలను కూడా నిర్వహిస్తామన్నారు ఈ ఓ.ముఖ్యంగా కాలిబాటలో వచ్చే భక్తులకు అవసరమైన మంచినీరు,మార్గమధ్యంలో దాతల సహకారంతో అన్నదాన ఏర్పాట్లను చేయనున్నామన్నారు.సామాన్య భక్తుల సౌకర్యార్థం క్షేత్రపరిధిలోని ఆరుబయలు ప్రదేశాలలో విశాలమైన చలువ పందిర్లను వేయనున్నామని, భక్తులందరు ఈ చలువపందిర్లలో సేద తీరవచ్చన్నారు. క్షేత్రంలో పలుచోట్ల స్నానపు గదులను, మూత్రశాలలను, మరుగుదొడ్లను భక్తులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. భక్తులు వీటిని వినియోగించుకోవచ్చునని పేర్కొన్నారు.
పాతాళగంగలో నీటిమట్టం గణనీయంగా పడిపోయిన కారణంగా పాతాళగంగలోనూ, క్షేత్రపరిధిలో పలుచోట్ల షవరు బాతులకు ( జల్లు స్నానాలకు) ఏర్పాట్లు చేశామన్నారు.ఎప్పటివలనే కాలిబాట మార్గములో భక్తులకు దేవస్థానం మంచినీటి సరఫరా మొదలైన ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు ఈ ఓ.
ఉగాది మహోత్సవాలలో పలు భక్తబృందాల వారు అన్నదానాలు చేయడం జరుగుతోందన్నారు. అన్నదానం చేసే భక్త బృందాల వారికి దేవస్థానం తరుపున సంపూర్ణ సహాయ సహాకారాలను అందిస్తుందన్నారు ఈ ఓ.భక్తులందరు దేవస్థానానికి సహకరించి తమ శ్రీశైలయాత్రను శుభప్రదం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు.
జగద్గురు పీఠాధిపతి శ్రీ చెన్నసిద్ధ శివాచార్య మహాస్వామి మాట్లాడుతూ ఉత్సవాలలో దేవస్థానానికి సహకరించాలని, 7 రోజులు పాటు స్వామివార్ల స్పర్శదర్శనం కన్నడ భక్తులకు దక్కిందని తెలిపారు.
దేవస్థానం సిబ్బందికి కన్నడ భక్తులందరు సహకరించాలని పేర్కొన్నారు.
శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం
బీజాపూర్ లో ధర్మప్రచారం:
ధర్మప్రచారంలో భాగంగా కర్ణాటక రాష్ట్రం, బీజాపూర్ (విజయపుర)లో దేవస్థానం బుధవారం ధర్మప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది.ఇందులో భాగంగా ఈ ఉదయం ధర్మప్రచార రధం ద్వారా శోభయాత్ర జరిపారు. సుమారు 350కి పైగా ముత్తైదువులచే కలశయాత్ర జరిగింది.నగరంలోని శ్రీ శంకరలింగ దేవస్థానం నుండి ప్రారంభమైన ఈ శోభాయాత్ర మహాత్మగాంధీ రోడ్డు, గాంధీ చౌరస్తా మీదుగా సిద్దేశ్వర దేవస్థానం ఆలయం వరకు కొనసాగింది.
ఈ శోభయాత్రలో ముందుగా ఈ ఓ మరియు అర్చకస్వాములు ధర్మ ప్రచార రథములోని స్వామి అమ్మవార్లకు పూజాదికాలను నిర్వహించారు. తరువాత శోభయాత్ర జరిగింది.
ఈ సాయంత్రం సిద్దేశ్వర దేవస్థానం ప్రాంగణంలో శ్రీ స్వామి అమ్మవార్లకు కల్యాణోత్సవం జరిగింది.
కల్యాణోత్సవంలో లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ ముందుగా అర్చకస్వాములు కల్యాణోత్సవ సంకల్పాన్ని తరువాత కల్యాణోత్సవం నిర్విఘ్నంగా జరగాలని గణపతిపూజ నిర్వహించారు. అనంతరం స్థలశుద్ధి కోసం , అభ్యుదయాన్ని కాంక్షిస్తూ పుణ్యాహవచనం చేసారు.తరువాత కంకణపూజ, యజ్ఞోపవీత పూజ చేసి స్వామివారికి కంకణధారణ, యజోపవీతధారణ చేసారు. అనంతరం సప్త ఋషుల ప్రార్థన చేసి కన్యావరణ మంత్రాలను తరువాత స్వామివారికి వరపూజను చేసారు. అనంతరం స్వామి అమ్మవార్ల ప్రవర పఠనాన్ని జరిపారు.
అనంతరం స్వామివారికి మధుపర్కం సమర్పించిన తరువాత శ్రీస్వామి అమ్మవార్లకు వస్త్రాలను సమర్పించి బాషికధారణ ఆ తరువాత గౌరీ పూజ చేసారు. తరువాత స్వామి అమ్మవార్ల మధ్య తెరసెల్లను ఏర్పరచి మహాసంకల్పం పఠనం అనంతరం సుముహూర్త సమయంలో స్వామి అమ్మవార్లకు జీలకర్ర, బెల్లం ఆ తరువాత మాంగల్యపూజను జరిపించి అమ్మవారికి మాంగల్యధారణ నిర్దివహించారు. తరువాత తలంబ్రాలు, బ్రహ్మముడి కార్యక్రమాలను జరిపి భక్తలకు తీర్థప్రసాద వితరణ, ఆశీర్వచనాన్ని అందించారు.
ధర్మప్రచార కార్యక్రమములో స్వామివారి ఆలయ ఉపప్రధానార్చకులు వీరయ్య, ఆలయ విభాగపు సహాయ కార్యనిర్వహణాధికారి హరిదాసు, ఆలయ పర్యవేక్షకులు అయ్యన్న, ఎగువశ్రేణి గుమాస్తాలు డి. రంగన్న, ఎం. శ్రీనివాసరావు, శ్రీశైలప్రభ సహాయసంపాదకులు కె.వి.సత్యబ్రహ్మాచార్య పలువురు అర్చకస్వాములు తదితర సిబ్బంది పాల్గొన్నారు.