
శ్రీశైల దేవస్థానం: మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకు శ్రీశైల ఉగాది మహోత్సవాలు జరుగుతాయని ఈ ఓ లవన్న తెలిపారు. ఐదు రోజులపాటు జరిగే ఈ మహోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై దేవస్థానం కార్యాలయంలోని సమావేశ భవనం లో ఈ ఓ ఆదివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో దేవస్థానం అన్ని విభాగాల అధిపతులు (యూనిట్ ఆఫీసర్స్) పర్యవేక్షకులు, ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు, స్థానాచార్యులు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
సమావేశ ప్రారంభంలో ఈ ఓ మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరిగాయని, సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఉగాది ఉత్సవాలకు కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండే కాకుండా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని కోణాల నుండి తగు జాగ్రత్తలు తీసుకుంటూ, ఆయా ఏర్పాట్లన్నీ పూర్తి చేయవలసినదిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఉగాది ఉత్సవాలు 30వ తేదీన ప్రారంభమవుతున్నప్పటికీ వారం రోజులు ముందుగానే భక్తులు క్షేత్రానికి చేరుకునే అవకాశం ఉందని ఈ ఓ చెబుతూ, ఈ నెల 20వ తేదీకంతా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత విభాగాలను ఆదేశించారు.
కాలిబాట మార్గములో ఏర్పాట్లు:
ఉత్సవాలకు కాలిబాట మార్గములో వెంకటాపురం, నాగలూటి, దామెర్లకుంట్ల, పెద్దచెరువు, మఠంబావి, భీమునికొలను, కైలాసద్వారం మీదుగా క్షేత్రానికి వస్తారని,కాలిబాట మార్గములో తగిన సదుపాయాలను కల్పించాలని సంబంధిత విభాగాలను ఈ ఓ ఆదేశించారు.ముఖ్యంగా భక్తులకు మంచినీటిని అందించడములో ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. అదేవిధంగా పాదయాత్ర భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకుగాను పెద్ద చెరువు వద్ద వారికి కంకణాలను అందజేయాలన్నారు. కంకణాలు ధరించిన భక్తులకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా దర్శనం కల్పించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
శ్రీస్వామి అమ్మవార్ల కైంకర్యాలు:
ఉత్సవాలలో శ్రీస్వామి అమ్మవార్లకు జరిగే ఆయా కైంకర్యాలన్నీ ఎలాంటి లోపం లేకుండా పరిపూర్ణంగా జరగాలని ఈ ఓ ఆదేశించారు. పూజాదికాలు అన్నీ నిర్దేశించిన సమాయానికంతా ప్రారంభించాలని
అన్నారు.
దర్శనం ఏర్పాట్లు :
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల మాదిరిగా భక్తులను మూడు క్యూలైన్ల ద్వారా , ఉచిత దర్శనం, శీఘ్రదర్శనం ,అతిశీఘ్ర దర్శనం ద్వారా భక్తులకు దర్శనాన్ని కల్పించే విధంగా తగు ఏర్పాట్లు చేయాల్సి ఉందన్నారు ఈ ఓ.
సమయానుకూలంగా క్యూలైన్లలో వేచివున్న భక్తులకు నిరంతర మంచినీరు, అల్పాహారాన్ని అందజేసే ఏర్పాట్లు చేయాలని అన్నదాన, ఆలయ, క్యూల నిర్వహణ విభాగాలను కార్యనిర్వహణాధికారి ఆదేశించారు. తాత్కాలిక వసతి :
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఏర్పాట్లు చేసినట్లుగానే భక్తులు సేద తీరేందుకు ఉగాది మహోత్సవాలలో కూడా పలు చోట్ల షామియానాలు, పైప్ పెండాల్స్ ( చలువ పందిర్లు) మొదలైనవి ఏర్పాటు చేయాలని ఈ ఓ ఆదేశించారు.శ్రీశైలంలోని పలు ఖాళీ ప్రదేశాలలో ముఖ్యంగా బసవవనం, బాలగణేశవనం, ఆలయ ఉత్తరభాగంలో గల ఉద్యానవనం, ఆలయ దక్షిణభాగంలో గల ఉద్యానవనం, శివదీక్షా శిబిరాలు, హేమారెడ్డి మల్లమ్మ మందిర ప్రాంతం మొదలైన చోట్ల చలువపందిర్లు ( పైప్ పెండాల్స్) ఏర్పాటు చేయాలన్నారు. మంచినీటి సరఫరా :
భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా నీటిసరఫరాకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు ప్రత్యేకమైన కార్యచరణ ప్రణాళికను రూపొందించి ఆ క్రమంలో చర్యలు తీసుకోవాలని ఈ ఓ ఆదేశించారు.
మహాశివరాత్రిలో వేసిన మంచినీటి కుళాయిలన్నింటిని కూడా ఉగాది ఉత్సవాలలో కూడా వినియోగించుకునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. సాక్షిగణపతి, హఠకేశ్వరం, శిఖరేశ్వరం, కైలాద్వారంతో పాటు క్షేత్రంలో భక్తులు బసచేసే పలు ప్రదేశాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇంకా దర్శనం క్యూలైన్లలో కూడా నిరంతరం మంచినీటి సరఫరా చేయాలన్నారు. కైలాసద్వారం వద్ద అదనపు సింటెక్స్ ట్యాంకులు ఏర్పాటు చేయాలన్నారు.
కైలాసద్వారం నుండి భీమునికొలను మార్గములో 1000 లీటర్ల సామర్థ్యం గల ట్యాంకులను ఏర్పాటు చేస్తారు.
భక్తులకు సేవలను అందించేందుకు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన స్వచ్ఛంద సేవకుల సహకారాన్ని తీసుకోవాలన్నారు.ముఖ్యంగా ఆలయంలో క్యూలైన్ల నిర్వహణ, క్యూలైన్లలో అల్పాహారం, మంచినీటిని అందజేయడం, అన్నదానం మొదలైన చోట్ల ఈ స్వచ్ఛంద సేవకుల సేవలు వినియోగించుకోవాలన్నారు.
ఆలయంలో స్వచ్ఛంద సేవలను అందించే సేవకులకు నిర్ణీత వేళలలో షిఫ్టులను నిర్ణయించి వీరికి తదనుగుణంగా తాత్కాలిక గుర్తింపు కార్డులను అందజేయాలన్నారు.
దాతలకు సహకారం:
కాలిబాట మార్గంలోని నాగలూటి, పెచ్చెర్వు, కైలాసద్వారం మొదలైన చోట్ల మరియు శ్రీశైలక్షేత్ర పరిధిలో పలుచోట్ల భక్తులకు అన్నదానం చేసే దాతలకు దేవస్థానం నుండి అవసరమైన సహాయ సహకారాలను అందించాలని సంబంధిత అధికారులను ఈ ఓ ఆదేశించారు.
భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకుని శ్రీశైలమంతటా పలు ఆరుబయలు ప్రదేశాలలో లైటింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. దేవస్థానం అతిథిగృహాలప్రాంగణం, ఉద్యానవనాలు, తాత్కాలిక వసతిప్రదేశాలు మొదలైన చోట్ల వీలైనంత ఎక్కువ విస్తీర్ణంలో ఈ తాత్కాలిక లైటింగ్ ను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
వైద్య ఆరోగ్య సేవలు :
లక్షలాది సంఖ్యలో భక్తులు వస్తున్న కారణంగా అవసరానికి సరిపడ మేరకు దేవస్థానం వైద్యశాలలో అవసరమైన మేరకు ఔషధాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు ఈ ఓ.గుండెజబ్బులు మొదలైన వాటికి అవసరమైన అత్యవసరమైన మందులు, కాలినడకన వచ్చే భక్తులకు బొబ్బల నుండి ఉపశమనం కల్పించేందుకు పూత మందులు (ఆయింట్ మెంట్ మందు) మొదలైన వాటితో పాటు అవసరమైన సూది మందులను కూడా సిద్ధంగా సిద్ధంగా ఉండేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు.క్షేత్రపరిధిలోనూ , కైలాసద్వారం మొదలైనచోట్ల జిల్లా వైద్యశాఖ సహకారం తో తాత్కాలిక వైద్యశిబిరాలను ఏర్పాటు చేయాలని వైద్యాధికారి సూచించారు.
పారిశుద్ధ్యం :
పారిశుద్ధ్య నిర్వహణకుగాను మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల లాగానే కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఆ దిశలో చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుద్ధ్య పనులకు గాను దేవస్థానం పారిశుద్ధ్య సిబ్బందితో పాటు అదనంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నారు.ఎప్పటికప్పుడు చెత్తచెదారాలను తొలగించేందుకుగాను అవసరమైన సంఖ్యలో ట్రాక్టర్లను అందుబాటులో ఉంచుకోవాలన్నారు.క్షేత్రపరిధిలో పలుచోట్ల గల శాశ్వత మరుగుదొడ్లను భక్తులు వినియోగించుకునేందుకు వీలుగా అందుబాటులో ఉంచాలన్నారు. వీటితో పాటు పలుచోట్ల తాత్కాలిక మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేయాలన్నారు.
స్వచ్ఛ శ్రీశైలంలో భాగంగా క్షేత్రపరిధిలో బహిరంగ మలమూత్ర విసర్జనను నిషేధించిన విషయమై సూచికబోర్డుల ద్వారా భక్తులకు అవగాహన కల్పించాలన్నారు.
సూచిక బోర్డులు :
భక్తులకు సమాచారాన్ని తెలియజేసేందుకు అవసరమైన అన్ని చోట్ల కూడా కన్నడభాషలో విస్తృతంగా సూచికబోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.
పుష్పాలంకరణ :
ఉత్సవాలలో ప్రత్యేకంగా పుష్పాలంకరణ చేయాలని ఉద్యానవిభాగాన్ని ఆదేశించారు.
సాంస్కృతిక కార్యక్రమాలు :
ఉత్సవాలలో భక్తులను అలరించేందుకు కన్నడ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. కన్నడ భక్తి సంగీతవిభావరి కార్యక్రమాలను ఏర్పాటు చేయడంతో పాటు కన్నడ ప్రవచనాలు, కన్నడ భక్తి నాటకాలు కూడా ఏర్పాటు చేయాలని ఈఓ ఆదేశించారు.