శ్రీశైల దేవస్థానం: పక్షి, జంతుబలి నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఈ ఓ లవన్న ఆదేశించారు. ఈ నెల 19న శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారికి నిర్వహించనున్న కుంభోత్సవ ఏర్పాట్లకు సంబంధించి ఆదివారం సాయంకాలం సన్నాహక సమావేశం జరిగింది.పరిపాలనా కార్యాలయ భవనములోని సమావేశ మందిరంలో సమావేశం జరిగింది. సమావేశం లో ధర్మకర్తల డలి సభ్యులు మఠం విరూపాక్షయ్యస్వామి, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక తహశీల్దార్ బి.రాజేంద్రసింగ్, స్థానిక ఎ.ఎస్.ఐ ఎం.రామయ్య, ఎడిటర్ డా.సి.అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ ఓ మాట్లాడుతూ కుంభోత్సవం క్షేత్ర రక్షణ కోసం నిర్వహించే పండుగగా పేరొందిన కారణంగా అమ్మవారికి ఉత్సవ సంబంధి కైంకర్యాలన్నింటిని పరిపూర్ణంగా జరిపించాలని వైదిక సిబ్బందికి సూచించారు. కుంభోత్సవం ఊరిపండుగగా ప్రసిద్ధి పొందిందన్నారు. దేవదాయ చట్టం అనుసరించి క్షేత్రపరిధిలో జంతు , పక్షి బలులు , జీవహింస పూర్తిగా నిషేధించడం జరిగిందని, కాబట్టి పక్షి, జంతుబలి నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అన్ని విభాగాల యూనిట్ అధికారులను, పర్యవేక్షకులను , సిబ్బంది ని ఆదేశించారు.
జంతుబలి నిషేధాన్ని గురించి స్థానికులలో అవగాహన కల్పించేందుకు గాను క్షేత్రపరిధిలో పలుచోట్ల , ఆలయమాడవీధులు, అంకాళమ్మ ఆలయం, పంచమఠాల వద్ద గల మహిషాసురమర్ధిని, ఘంటామఠం, టోల్ గేట్ మొదలైనచోట్ల హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని శ్రీశైలప్రభ విభాగాన్ని ఆదేశించారు. ప్రధాన కూడళ్ళలో కూడా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.అదేవిధంగా ఆలయ ప్రసారవ్యవస్థ (ఆలయ మైకు ద్వారా) ద్వారా కూడా జంతుబలినిషేధం గురించి సమయానుసారంగా తెలియజేయాలని ఆలయవిభాగాన్ని ఆదేశించారు.
పక్షి – జంతు బలుల నిషేధాన్ని అమలు చేయడానికిగాను ఎప్పటిలాగే దేవస్థానం యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది చేత కుంభోత్సవం ముందు రోజున ప్రత్యేకంగా గస్తీ ఏర్పాట్లు చేయాలని ఈ ఓ ఆదేశించారు.కుంభోత్సవం ముందురోజు రాత్రి నుండి కుంభోత్సవం ఉదయం వరకు నిరంతరంగా ఈ సిబ్బంది గస్తీ విధులు నిర్వహించాలన్నారు. ఈ విషయమై స్థానిక పోలీస్ శాఖ సహకారం తీసుకోవాలన్నారు.ఇంకా స్థానిక రెవెన్యూ, పోలీస్ సిబ్బంది, దేవస్థాన భద్రతా విభాగం చేత తనిఖీ బృందాలు కూడా ఏర్పాటు చేయాలని సూచించారు.
ఉత్సవాల సమయములో ముఖ్యంగా ఉత్సవ ప్రారంభానికి నాలుగైదు రోజుల ముందునుంచే బస్సులలో ఎటువంటి జంతువులను, పక్షులను అనుమతించకుండా ఆయా ఆర్టీసి డిపో మేనేజర్లకు లేఖలను వ్రాయాలని ఆలయ విభాగాన్ని ఆదేశించారు. దేవస్థానం టోల్ గేట్ వద్ద అన్నీ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని భద్రతా విభాగాన్ని ఆదేశించారు.ఉత్సవ సమయంలో అధిక సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శించనున్న కారణంగా ఎలాంటి తొక్కిసలాట జరగకుండా ఉండేందుకు అవసరమైన ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు.
భక్తులందరూ గుమ్మడికాయలు, కొబ్బరికాయలను సాత్త్వికబలిగా సమర్పించేటప్పుడు, స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు స్వామివారి ఆలయం నుండి అమ్మవారి ఆలయానికి కుంభహారతి తెచ్చే సమయంలోనూ, ,భక్తులు అమ్మవారిని దర్శించుకునే సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు.కుంభోత్సవం రోజున అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని తగు విధంగా అలంకరించాలని ఉద్యానవన విభాగాన్ని ఆదేశించారు.
ధర్మకర్తల మండలి సభ్యులు విరూపాక్షయ్యస్వామి మాట్లాడుతూ కుంభోత్సవ ఏర్పాట్లన్నీ పకడ్బందీగా చేయాలని సూచించారు.అనంతరం ధర్మకర్తల మండలి సభ్యులు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఉత్సవంలో అన్ని కార్యక్రమాలు సజావుగా జరిగే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.