శ్రీశైల దేవస్థానం:మార్చి 30వ తేదీ నుంచి ఏప్రియల్ 3వ తేదీ వరకు జరుగనున్న ఉగాది మహోత్సవాల
ఏర్పాట్లపై శుక్రవారం ధర్మకర్తల మండలి ఈ ఓ తో చర్చించింది. ధర్మకర్తల మండలి అధ్యక్షులు, సభ్యులు, ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు ఇందులో పాల్గొన్నారు.దేవస్థాన కార్యాలయ భవనములోని సమావేశ మందిరములో జరిగిన ఈ కార్యక్రమం లో ముందుగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు, సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు తమ స్వపరిచయాలను చేసుకున్నారు.
అనంతరం ఈ ఓ దేవస్థానంలోని ఆయా శాఖల అధిపతులను, పర్యవేక్షకులను ధర్మకర్తల మండలికి పరిచయం చేశారు.
తరువాత ఈ ఓ మాట్లాడుతూ ఉగాది మహోత్సవాలలో దేవస్థానం చేస్తున్న ఆయా ఏర్పాట్ల గురించి ధర్మకర్తల మండలికి వివరించారు.ముఖ్యంగా ఉత్సవాలలో శ్రీస్వామిఅమ్మవార్లకు జరిగే కైంకర్యాలు, కాలిబాటమార్గములో భక్తులకు చేస్తున్న ఏర్పాట్లు, భక్తులకు వసతికల్పన, దర్శనం ఏర్పాట్లు, ఉత్సవాల సందర్భంగా భక్తులు సేద తీరేందుకు ఏర్పాటు చేసే చలువ పందిర్లు.. మంచినీటి సరఫరా, అన్నప్రసాద వితరణ, వైద్య ఆరోగ్యసేవలు, పారిశుద్ధ్య నిర్వహణ మొదలైనవాటి గురించి కార్యనిర్వహణాధికారి ధర్మకర్తల మండలికి వివరించారు.
తరువాత ధర్మకర్తల మండలివారు కార్యనిర్వహణాధికారితో కలిసి లడ్డు ప్రసాదాల విక్రయ కేంద్రాలు, అన్నదానభవనం ప్రాంగణములో కమాండ్ కంట్రోల్ రూమ్, అన్నదానం విభాగం మొదలైన వాటిని పరిశీలించారు.
తరువాత దేవస్థాన ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు పి.వి. సుబ్బారెడ్డి, దేవస్థానం ఉద్యోగుల తరుపున ధర్మకర్తల మండలి అధ్యక్షులను సత్కరించారు.