
శ్రీశైల దేవస్థానం:ఏప్రియల్ 11వ తేదీన శ్రీ భ్రమరాంబాదేవి అమ్మ వారికి కుంభోత్సవం జరుగనున్నది.సాత్వికబలిగా ఈ వార్షిక కుంభోత్సవం నిర్వహిస్తారు.
కుంభోత్సవ నిర్వహణ ఏర్పాట్లపై చర్చించేందుకు ఆదివారం స్థానిక రెవెన్యూ, పోలీస్, ఆర్టిసి, దేవస్థానం యూనిట్ అధికారులు, సెక్షన్ అధికారులు, దేవస్థాన వైదిక సిబ్బంది తదితర అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో డిప్యూటీ తహశీల్దార్ ఎం. కిషోర్ కుమార్, స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ దివాకరరెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ జి. లక్షణరావు, ఎస్పిఎఫ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి.వి. రమణ, ఎస్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ రంగస్వామి, ఏపిఎస్ ఆర్టీసీ స్టేషన్ మేనేజర్ కె. మధుకుమార్, టీఎస్ ఆర్టీసీ స్టేషన్ మేనేజర్ అశోక్ వర్థన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ ముఖ్యంగా కుంభోత్సవం ” క్షేత్ర రక్షణ” కోసం నిర్వహించే ఉత్సవంగా పేరొందిన కారణంగా, శ్రీ అమ్మవారికి ఉత్సవ సంబంధిత కైంకర్యాలన్నింటినీ పరిపూర్ణంగా జరిపించాలని వైదిక సిబ్బందికి సూచించారు. చట్టం ప్రకారం జంతుబలులకు ప్రత్యక్షంగా గాని లేదా పరోక్షంగా గాని సహకరించడం నేరంగా పరిగణించడం జరుగుతుందన్నారు. అందుకే జంతుబలుల నిషేధానికి అన్ని చర్యలను తీసుకుని , నిషేధం అమలుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.క్షేత్రపరిధిలో జంతు, పక్షిబలి నిరోధానికి ప్రత్యేకం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయమైన స్థానిక రెవెన్యూ, పోలీస్ శాఖలు పూర్తి సహాయ సహకారాలను అందించాలని ఆ శాఖల స్థానిక అధికారులకు సూచించారు.జంతుబలి నిషేధానికి పోలీస్, రెవెన్యూ సిబ్బందిత తనిఖీ బృందాలను ( మోబైల్ స్క్వాడ్) ఏర్పాటు చేయాలన్నారు. ఈ తనిఖీ బృందాలకు దేవస్థానం వాహనాలను, తగిన సెక్యూరిటీ సిబ్బందిని సమకూర్చడం జరుగుతుందన్నారు.
ఉత్సవ సమయంలో జంతుబలులు నిషేధానికు ప్రత్యేకంగా గస్తీని ఏర్పాటు చేయవలసినదిగా కూడా కార్యనిర్వహణాధికారి సూచించారు. ఇందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించవలసిందిగా స్థానికపోలీస్ అధికారులను కోరారు.దేవస్థాన అధికారులకు, సిబ్బందికి కూడా గస్తీకి సంబంధించి ప్రత్యేక విధులను కేటాయించవలసినదిగా పరిపాలనా విభాగాన్ని ఆదేశించారు.
ముఖ్యంగా ఆలయ మాడ వీధులు, ప్రధానద్వారాలు, అంకాళమ్మ ఆలయం, పంచమఠాల దగ్గర గల మహిషాసురమర్ధిని, రుద్రాక్షమఠం వద్ద గల ఛిన్నమస్తాదేవి, పాతవర్క్షాప్ వద్ద గల సుంకులమ్మ, పాతాళగంగ మార్గ సమీపంలో గల వజ్రాల గంగమ్మ, టోల్ గేట్ మొదలైన చోట్ల సిబ్బంది ప్రత్యేక విధులను నిర్వహించాలన్నారు.అదేవిధంగా కుంభోత్సవం రోజుల్లో జంతువులను, పక్షులను బస్సులలో అనుమతించకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకోవలసినదిగా ఆర్.టి.సి. అధికారులకు సూచించారు. దేవస్థానం టోల్ గేట్ వద్ద ప్రత్యేక తనిఖీ ఏర్పాట్లు చేయవలసిందిగా స్థానిక రెవిన్యూ, పోలీస్ అధికారులకు సూచించారు. ఈ తనిఖీలకు దేవస్థానం కూడా తగు సిబ్బందిని ఏర్పాటు చేసి సహకరిస్తుందన్నారు.
జంతుబలి నిషేధాన్ని గురించి భక్తులలో అవగాహన కల్పించేందుకు టెంపుల్ బ్రాడ్ కాస్టింగ్ సిస్టమ్ ద్వారా విస్తృత ప్రచారం చేయవలసినదిగా ఆలయ విభాగాన్ని ఈ ఓ ఆదేశించారు.
క్షేత్రపరిధిలో జంతుబలి నిషేధం గురించి అవగాహన కల్పించేందుకు పలుచోట్ల విస్తృతంగా బోర్డులను ఏర్పాటు చేయవలసినదిగా ఇంజనీరింగ్ , ప్రచురణల విభాగాన్ని ఈ ఓ ఆదేశించారు. కుంభోత్సవం ముందు రోజు , కుంభోత్సవం రోజు మద్యం అమ్మకాలను నిలిపివేసేందుకు తగు ఉత్తర్వులు ఇవ్వవలసిందిగా జిల్లా కలెక్టర్ కు విన్నవించాలని కూడా సమావేశంలో నిర్ణయించారు.తరువాత సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ కుంభోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ తరుపున చేయనున్న అన్ని ఏర్పాట్లను గురించి వివరించారు.