- శ్రీశైలంలోని 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి
శ్రీశైలం/నంద్యాల, ఫిబ్రవరి 11 :-
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీశైలానికి నడకదారిన భారీగా తరలివస్తున్న భక్తులకు అందిస్తున్న వైద్య సేవలపై నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి బుధవారం శ్రీశైలంలోని 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా నడకదారిన పాదయాత్ర ద్వారా చేరుకున్న భక్తులకు అందిస్తున్న వైద్య చికిత్సలు, అత్యవసర సేవలు, ప్రథమ చికిత్స (ఫస్ట్ ఎయిడ్) సదుపాయాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, అస్వస్థతకు గురైన భక్తుల ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యక్షంగా ఆరా తీశారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న చికిత్సలపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో కల్పించిన పడకల సదుపాయం, తాగునీటి ఏర్పాటు, విశ్రాంతి గదులు, శుభ్రత నిర్వహణ తదితర అంశాలను కలెక్టర్ పరిశీలించారు. ఔషధాల లభ్యత, అత్యవసర మందుల నిల్వలు, అవసరమైన వైద్య పరికరాల అందుబాటు పరిస్థితిపై వైద్య అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే స్పందించేలా సిద్ధంగా ఉండాలని సూచించారు.
వైద్య సిబ్బంది హాజరు, డ్యూటీ చార్ట్, రోగుల నమోదు విధానం తదితర పరిపాలనా అంశాలను కూడా కలెక్టర్ సమీక్షించారు. భక్తులకు సమయానుకూలంగా, నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఎటువంటి లోపాలు ఉండకూడదని స్పష్టం చేశారు. సేవలలో నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగించాలని వైద్యాధికారులకు ఆదేశించారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రతి భక్తుడికి అవసరమైన వైద్య సహాయం తక్షణమే అందేలా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా పాదయాత్ర ద్వారా వచ్చే భక్తుల కోసం ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ ఆదేశించారు.
