శ్రీశైల దేవస్థానం:మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నాలుగో రోజు శుక్రవారం శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. యాగశాల లో శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపారు. అనంతరం లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు చేసారు.అనంతరం మండపారాధనలు, పంచావరణార్చనలు, శివపంచాక్షరి, నిత్యహవనాలు, రుద్రహోమం, చండీహోమం, కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారంగా జరిపారు.
సాయంకాలం ప్రదోష కాల పూజలు, జపానుష్టానాలు, రుద్రపారాయణలు, హోమాలు జరిగాయి.
మయూర వాహనసేవ:
వాహనసేవలలో భాగంగా సాయంకాలం శ్రీ స్వామి అమ్మవార్లకు మయూరవాహనసేవ నిర్వహించారు.
ఈ సేవలో శ్రీ స్వామిఅమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో మయూర వాహనంపై వేంచేబు చేయించి ప్రత్యేక పూజాదికాలు జరిపారు. తరువాత శ్రీశైలక్షేత్ర ప్రధాన వీధులలో గ్రామోత్సవం జరిగింది. కోలాటం, చెక్కభజన, రాజబటులవేషాలు, జాంజ్ పథక్, జానపద పగటి వేషాలు, గొరవనృత్యం, బుట్టబొమ్మలు, తప్పెటచిందు బీరప్పడోలు, చెంచునృత్యం, నందికోలసేవ, ఢమరుకం, చితడలు, శంఖం,పిల్లన్నగ్రోవి తదితర కళారూపాలను గ్రామోత్సవంలో ఏర్పాటు చేసారు.ఈ ఓ ఎస్.లవన్న ఇతర అధికారులు, సిబ్బంది, అర్చక స్వాములు,అసంఖ్యాక భక్తులు పాల్గొన్నారు.