
తరిగొండ వెంగమాంబ 204వ వర్ధంతి ఉత్సవాలు ప్రారంభం
తిరుపతి, 2021 ఆగస్టు 15: మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ సామాన్యులు సైతం అర్థం చేసుకునే ప్రజాకవిత్వం ద్వారా శ్రీవేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని వ్యాప్తి చేశారని ప్రముఖ పండితులు ఆచార్య కెజి.కృష్ణమూర్తి తెలిపారు. శ్రీవారి అపర భక్తురాలైన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 204వ వర్ధంతి ఉత్సవాలు ఆదివారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో
ఘనంగా ప్రారంభమయ్యాయి. టిటిడి తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. కోవిడ్-19 నేపథ్యంలో పరిమిత సంఖ్యలో భక్తులతో ఈ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తరిగొండ వెంగమాంబ సాహిత్యంపై సదస్సు జరిగింది. సదస్సుకు అధ్యక్షత వహించిన ఆచార్య కె.జె.కృష్ణమూర్తి ఉపన్యసిస్తూ వెంగమాంబ తన జీవితాన్ని స్వామివారి కైంకర్యానికి అంకితం చేశారని తెలిపారు. ఈమె వ్యక్తిగా, సంస్కర్తగా, యోగినిగా, కవయిత్రిగా శ్రీవారి భక్తితత్వాన్ని ప్రచారం చేశారని వివరించారు. అన్నమయ్య కీర్తనల ద్వారా స్వామివారిని ఆరాధించగా, వెంగమాంగ గద్యం, పద్యం, యక్షగానాల రచన ద్వారా భక్తిని చాటుకున్నారని వివరించారు. వెంగమాంబ తెలుగులో రచించిన వేంకటాచల మహత్యం చిరస్థాయిగా నిలిచిపోయిందని చెప్పారు.
అనంతరం ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా|| ఆకెళ్ల విభీషణ శర్మ, శ్రీకాళహస్తికి చెందిన ఎన్.చాముండేశ్వరరావు, చంద్రగిరికి చెందిన డా|| సంగీతం కేశవులు ప్రసంగించారు.
అంతకుముందు శ్రీవారు, తరిగొండ వెంగమాంబ చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. అనంతరం సాహితీ సదస్సులో పాల్గొన్న పండితులను శాలువ, శ్రీవారి ప్రసాదాలతో సన్మానించారు.
టిటిడి డెప్యూటీ ఈఓ విజయసారథి, తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ డా.సి.లత, సూపరింటెండెంట్ శ్రీమతి జి.నాగమణి, సీనియర్ అసిస్టెంట్ బి.నరసింహులు తదితరులు పాల్గొన్నారు.