గజ వాహనంపై శ్రీ మలయప్ప కటాక్షం
తిరుమల, 2021 అక్టోబరు 12: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు మంగళవారం రాత్రి 7 నుండి 8 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు గజ వాహనంపై కటాక్షించారు.
గజ వాహనం – కర్మ విముక్తి
రాజులను పట్టాభిషేకాది సమయాలలో గజాలపై ఊరేగిస్తారు. ఒక విశిష్ట వ్యక్తిని ఘనంగా సన్మానించాల్సి వస్తే గజారోహనం చేసే ప్రక్రియ నేటికీ ఉంది. ఈ వాహనసేవ దర్శనం వల్ల కర్మ విముక్తి కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది. స్వామి గజవాహనాన్ని అధిష్టించిన రోజేగాక, ఉత్సవాల వేళ తిరుమల తిరుపతి దేవస్థానం గజరాజులు పాలు పంచుకుంటాయి.
వాహన సేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి దంపతులు, బోర్డు సభ్యులు శ్రీమతి ప్రశాంతి రెడ్డి, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి దంపతులు, విజివో బాలిరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో రమేష్‌బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.
కాగా, బ్రహ్మోత్సవాలలో ఏడవ రోజైన బుధవారం ఉదయం 9 నుండి 10 గంటల వరకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 నుండి 8 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై శ్రీమలయప్పస్వామి వారు దర్శనమిస్తారు.
Post Comment