
శ్రీశైల దేవస్థానం: పరిపాలనాంశాల సమీక్షలో భాగంగా ఈ రోజు (20.09.2021)న కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న దేవస్థాన భవనాలను పరిశీలించారు.
మల్లికార్జునసదనం, గంగా – గౌరీ సదనము, దేవస్థాన వైద్యశాల, అన్నదాన భవనము, దేవస్థానం వైద్యశాల మొదలైనవాటిని పరిశీలించారు. వీటితో పాటు టోల్ గేట్ ప్రాంతాన్ని కూడా పరిశీలించారు.
ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు మురళీ బాలకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఎం. నరసింహారెడ్డి తదితర ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ టోల్ గేట్ వద్ద రూఫింగ్ షెడ్ వేయాలని ఆదేశించారు. దీనివలన టోల్ గేట్ రుసుము చెల్లించేటప్పుడు వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందన్నారు.
తరువాత వారు మల్లికార్జునసదన్, గంగా -గౌరీ సదన్, అన్నదాన భవనము మొదలైన వాటికి పెయింటింగ్ పనులు చేసేందుకు అంచనాలను రూపొందించి తదనుగుణంగా వెంటనే చర్యలు చేపట్టాలన్నారు.
అదేవిధంగా దేవస్థాన భవనాలకు అవసరమైన మరమ్మతులు చేపట్టాలని కూడా సూచించారు.
ముఖ్యంగా అన్ని భవనాలలో కూడా ఎలక్ట్రికల్ వైరింగ్ సజావుగా వుండేవిధంగా ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతుండాలని ఆదేశించారు.