
శ్రీశైల దేవస్థానం:కార్తిక మాసోత్సవాల సందర్భంగా వివిధ ఏర్పాట్లు చేసారు. మరిన్ని ఏర్పాట్లలో , పరిశీలనలో భాగంగా ఈ రోజు (14.11.2021)న కార్యనిర్వహణాధికారి ఎస్.లవన్న కల్యాణకట్టను (కేశఖండనశాలను) అకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ క్షురకులు భక్తుల నుంచి ఎలాంటి మొత్తాన్ని స్వీకరించకూడదన్నారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై తగు చర్యలు ఉంటాయన్నారు. భక్తులు కేవలం కేశఖండన టికెట్టును మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ విషయములో ఖచ్చితంగా వ్యవహరించాలని సిబ్బందిని ఆదేశించారు.
భక్తులతో మర్యాదగా మెలగాలని అక్కడి సిబ్బందికి, క్షురకులకు ఈ ఓ సూచించారు.కల్యాణకట్టను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, సిబ్బందిని ఆదేశించారు.ముఖ్యంగా కోవిడ్ నిబంధనలను తప్పకుండ పాటించాలని సూచించారు. తలనీలాలు తీసే పరికరాలను ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తతో శుభ్రపరుస్తుండాలన్నారు. కల్యాణకట్టలో భక్తులు భౌతిక దూరం పాటించడం పట్ల ప్రత్యేకశ్రద్ధ కనబర్చాలన్నారు. ఈ విషయమై ఉద్యోగులే భక్తులలో అవగాహన కలిగించాలన్నారు.
కార్యనిర్వహణాధికారి కల్యాణకట్టలో పలువురు భక్తులతో సంభాషిస్తూ ఏర్పాట్లపై అభిప్రాయాలను తెలుసుకున్నారు.అదేవిధంగా కేశఖండన కౌంటరును కూడా తనిఖీ చేసారు.
ఈ పరిశీలనలో సహాయ కార్యనిర్వహణాధికారి పి. నటరాజరావు, పర్యవేక్షకులు శివప్రసాద్, కల్యాణ కట్ట సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.