మహిమాన్విత మహాగౌరి మాతకు భక్త వందనం
శ్రీశైల దేవస్థానం:దసరా మహోత్సవాలలో భాగంగా ఎనిమిదవ రోజైన ఈ రోజు (14.10.2021) ఉదయం అమ్మవారికి ప్రాత:కాల పూజలు, విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, జపానుష్ఠానాలు, పారాయణలు, సూర్యనమస్కారములు, చండీహోమం, పంచాక్షరి, భ్రామరి, బాలా జపానుష్ఠానములు, చండీపారాయణ, చతుర్వేద పారాయణలు, కుమారీపూజలు జరిగాయి.
శ్రీస్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, రుద్రయాగాంగ జపములు, రుద్ర పారాయణలు జరిగాయి.
అదేవిధంగా ఈ సాయంకాలం జపములు, పారాయణలు, నవావరణార్చన, కుంకుమార్చన, చండీ హోమం జరిగాయి.
ఈ రోజు రాత్రి 9.00గంటల నుండి కాళరాత్రిపూజ, అమ్మవారి ఆస్థాన సేవ, సువాసినీ పూజలు జరిగాయి.
కుమారి పూజ దసరా మహోత్సవాలలో భాగంగా ప్రతీరోజు కుమారి పూజలు నిర్వహిస్తున్నారు.
ఈ కుమారి పూజలో రెండుసంవత్సరాల నుంచి పదిసంవత్సరాల వయస్సు ఉన్న బాలికలను పూలు, పండ్లు, నూతన వస్త్రాలను సమర్పించి పూజిస్తారు. కుమారి పూజ నవరాత్రి ఉత్సవాలలో ఒక ముఖ్యమైన సంప్రదాయం .
మహాగౌరి అలంకారం:
ఈ నవరాత్రి మహోత్సవాలలో , నవదుర్గ అలంకారాలలో భాగంగా ఈ రోజు శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తిని మహాగౌరి స్వరూపంలో అలంకరింపజేశారు. నవదుర్గ స్వరూపాలలో ఎనిమిదవ రూపం ఈ మహాగౌరి.
దసరా మహోత్సవాలలో ఎనిమిదవ రోజున ఈ స్వరూపాన్ని పూజిస్తారు.
నవదుర్గలలో మహాగౌరి రూపం అత్యంత శాంతమూర్తిగా ఉంటుంది . ఈ దేవి తెల్లని వస్త్రాలను ధరించి, చతుర్భుజాలను కలిగి ఉంటుంది. కుడివైపు పైభుజంలో త్రిశూలాన్ని, క్రింది భుజంలో అభయహస్తాన్ని, ఎడమవైపు పై భుజంలో వరముద్రను, క్రింది భుజంలో డమరుకాన్ని కలిగి ఉంటుంది. మహాగౌరి తన పార్వతిరూపంలో పరమశివుని భర్తగా పొందేందుకు కఠోర తపస్సు చేయసాగింది.
ఈ తపస్సు కారణంగా ఈమె శరీరమంతా నల్లబడింది. ఆ తపస్సుకు ప్రసన్నుడైన పరమశివుడు ఈమె శరీరంపై గంగాజలాన్ని చిలకరించాడు. అప్పుడు ఆ దేవి తేజోవంతమైన గౌరవర్ణంతో అలరారింది. అందుకే ఈ దేవి మహాగౌరిగా పిలువబడింది. దసరా మహోత్సవాల ఎనిమిదవ రోజున ఈ దేవిని పూజించారు. ఈ దేవిని పూజించడం వలన సకల పాపాలు నశిస్తాయని, కష్టాలు తొలగిపోతాయని నమ్మకం.
నంది వాహనసేవ ఈ ఉత్సవాలలో శ్రీస్వామి అమ్మవార్లకు నిర్వహిస్తున్న వాహనసేవలలో భాగంగా ఈ రోజు నందివాహనసేవ జరిపారు. ఈ వాహనసేవలో శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరింపజేసి, నందివాహనంపై వేంచేబు చేయించి పూజాదికాలు చేసారు.
Post Comment