
శ్రీశైల దేవస్థానం:ధర్మప్రచారంలో భాగంగా దేవస్థానం సోమవారం ఉచిత సామూహిక సేవలలో భాగంగా మహామృత్యుంజయ హోమాన్ని నిర్వహించింది.తెల్లరేషన్‌కార్డు కలిగిన వారి సౌకర్యార్థం ప్రవేశపెట్టిన ఉచిత సామూహిక సేవలలో భాగంగా చంద్రవతి కల్యాణ మండపంలో మహామృత్యుంజయ హోమం నిర్వహించారు.
ఈ ఉచితసేవ కోసం ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకున్న భక్తులచేత ఈ రోజు ఉదయం సామూహిక మహామృత్యుంజయహోమం జరిపించారు.కార్యక్రమం లో ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి , పర్యవేక్షకులు శ్రీమతి సాయికుమారి, పలువురు వేదపండితులు అర్చకస్వాములు పాల్గొన్నారు.
సామూహిక మహామృత్యుంజయ హోమంలో ముందుగా భక్తులందరి గోత్రనామాలతో సంకల్పం చేయించారు.
అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ జరిపారు. తరువాత మహామృత్యుంజయ హోమం జరిపారు.
హోమం లో పాల్గొన్న భక్తులందరికీ అతిశీఘ్ర దర్శనం క్యూలైను ద్వారా శ్రీస్వామివార్ల దర్శనం కల్పించారు. స్వామివారి దర్శనానంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు
సేవాకర్తలకు 2 లడ్డు ప్రసాదాలు, కైలాసకంకణాలు, ఆధ్యాత్మిక మాసపత్రిక అందించారు. దర్శనానంతరం భక్తులందరికీ దేవస్థానం అన్నపూర్ణ భవనం లో భోజన సదుపాయం కూడా కల్పించారు.
హోమంలో స్థానికులే కాకుండా శ్రీకాళహస్తి, మార్కాపురం, భీమవరం, గుంటూరు, దోర్నాల, నరసరావుపేట, అనంతపురం, కడప, తిరుపతి, బాపట్ల, పొన్నూరు, కోలార్ (కర్ణాటక) తదితర ప్రాంతాలకు చెందిన వారు కూడా పాల్గొన్నారు.