
• • ప్రధానాలయంలోని శ్రీస్వామిఅమ్మవార్ల గర్భాలయ విమానాలకు,ఆలయ ప్రాంగణంలోని అన్ని ఉపాలయాలకు, ఆలయప్రాంగణంలోని పునరుద్ధరించబడిన మూడు శివాలయాలకు మహాకుంభాభిషేకం ప్రత్యేకం
• క్షేత్రపరిధిలోని అన్ని ఆలయాలకు పంచమఠాలకు కుంభాభిషేకం ప్రత్యేకం
• సాక్షిగణపతి, హాటకేశ్వరం, ఫాలధార – పంచధార, శిఖరేశ్వరం, ఇష్టకామేశ్వరీ ఆలయాలలో మహాకుంభాభిషేకం ప్రత్యేకం
• ఆలయ ఉత్తరగోపురమైన శివాజీగోపుంపై కలశ పున: ప్రతిష్ట ప్రత్యేకం
• కార్యక్రమాలలో పాల్గొన్న కంచి, శ్రీశైలం, పుష్పగిరి పీఠాధిపతులు
• ఉపముఖ్యమంత్రి, దేవాదాయశాఖామంత్రి కొట్టు సత్యనారాయణ, MLA శిల్పా. ట్రస్ట్ బోర్డ్ సభ్యులు, ఈ ఓ పెద్దిరాజు , అధికారులు , సిబ్భంది, భక్త జనం పాల్గొన్నారు.
*వివరాలు *
* శ్రీశైల దేవస్థానం: ఈ నెల 16వ తేదీన ప్రారంభమైన మహాకుంభాభిషేకం మహోత్సవం ఈ రోజుతో ముగిసింది.
ఈ రోజు జరిగిన మహాకుంభాభిషేక మహోత్సవంలో కంచికామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతీ మహాస్వామివారు, శ్రీశైల జగద్గురు పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామివారు, పుష్పగిరి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విద్యాశంకర భారతీ మహాస్వామివారు, కాశీ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మల్లికార్జున విశ్వరాధ్య శివాచార్య మహాస్వామివారు పాల్గొన్నారు.
ఉపముఖ్యమంత్రి,దేవాదాయ శాఖామంత్రి కొట్టు సత్యనారాయణ, నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచాబ్రహ్మానందారెడ్డి, శ్రీశైల నియోజవర్గం శాసనసభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రదేవాదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వళవన్, రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఎస్. సత్యనారాయణ కూడా ఈ మహాకుంభాభిషేకమహోత్సవంలో పాల్గొన్నారు.
దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు విరూపాక్షయ్యస్వామి, శ్రీమతి జంగం సుజాతమ్మ, జి. నరసింహారెడ్డి, శ్రీమతి ఎం. విజయలక్ష్మీ శ్రీమతి బి. రాజేశ్వరి, శ్రీమతి ఎ. లక్ష్మీసావిత్రమ్మ, మేరాజోత్ హనుమంతునాయక్, ఓ. మధుసూదన్ రెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు, కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కూడా పాల్గొన్నారు.
ప్రధానాలయంలో శివాజీగోపుర పునర్నిర్మాణం, ఆలయప్రాంగణంలోని కొన్ని ఉపాలయాల పునరుద్ధరణ, పంచమఠాలలోని మూడు మఠాల పునరుద్ధరణ , ఆయా ఉపాలయాలో, మఠాలలో శివలింగ, నందీశ్వరుల ప్రతిష్ఠ సందర్భంగా ఈ మహాకుంభాభిషేకం జరిపారు.
ప్రధానాలయంలోని శ్రీస్వామివారి గర్భాలయ విమానం, అమ్మవారి గర్భాలయ విమానం, నాలుగుదిక్కులు గల నాలుగు ప్రధానగోపురాలు, అమ్మవారి ద్వార గోపురం, ఆలయ ప్రాంగణంలోని అన్ని ఉపాలయాలు, పరివారఆలయాలలో ఈ కుంభాభిషేకం జరిపారు.
అదేవిధంగా క్షేత్రంలోని గంగాధరమండపం, ఆరామవీరేశ్వరాలయం, అంకాళమ్మ ఆలయం, నందిగుడి, బయలువీరభద్రస్వామిఆలయం, పాతాళగంగమార్గంలోని ఆంజనేయస్వామి ఆలయం, పాతాళేశ్వర ఆలయం, గంగాసదన్ వద్ద గల గణపతి ఆలయం, హేమారెడ్డి మల్లమ్మ మందిరం , పంచమఠాలలో ఈ మహాకుంభాభిషేకం జరిపారు .
*సాక్షిగణపతి, హాటకేశ్వరం, శిఖరేశ్వరం మొదలైనచోట్ల , ఇష్టకామేశ్వరి ఆలయంలో కూడా ఈ కుంభాభిషేకం జరిగింది.
ఈ రోజు ముందుగా శాంతి హోమం, పౌష్టిక హోమం, మహాపూర్ణాహుతి జరిగాయి.
అనంతరం పునరుద్ధరించిన ఆలయాలలో యంత్ర ప్రతిష్టలు, శివలింగ నందిశ్వరుల ప్రతిష్టలు, శివాజీగోపురంపై సువర్ణ కలశ ప్రతిష్టలు జరిగాయి.
అనంతరం అన్నిచోట్ల కూడా ఏకకాలంలో మహాకుంభాభిషేకం జరిపారు. అవబృధం, జగద్గురువులకు గురువందనం చేసారు. ఈ సందర్భంగా పీఠాధిపతులందరు కూడా తమ అనుగ్రహ భాషణం చేసారు.
ఆలయాలలో జరిగే అత్యద్భుత కార్యక్రమమే మహాకుంభాభిషేకం. ఈ మహిమాన్విత కార్యక్రమం లో విధివిధానముగా కలశాలను నెలకొల్పి, ఆయా కలశాలలో దేవతాశక్తిని నిక్షిప్తం చేసి జప, పారాయణ, ధ్యాన, హోమాదులను జరిపి, ఆ మంత్రపూరిత జలాలతో ఆలయంలోని గర్భాలయ విమానాలను, గోపురాలను, దేవతామూర్తులను అభిషేకించడం ప్రత్యేకం.
కుంభాభిషేకం చేసినందువల్ల ఆలయ విమాన శిఖరాన్ని దర్శించినంతనే చతుర్విధ పురుషార్థసిద్ధి, మానసిక ప్రశాంతత, భక్తి, అధ్యాత్మిక పరిపుష్టి, ఆయుర్వృద్ధి, కీర్తి, జయం కలుగుతాయని, శారీరక, మానసిక వ్యాధులు నశిస్తాయని, సకల ఆపదలు తొలుగుతాయని, అభివృద్ధి చేకూరుతుందని ప్రతీతి.