
శ్రీశైల దేవస్థానం:మహాకుంభాభిషేక మహోత్సవం శుక్రవారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది.
ఆరు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం లో ఈ నెల 21వ తేదీన మహాకుంభాభిషేకం
జరుగనుంది.
ఈ ఉదయం ఆలయ ప్రాంగణంలో మహాకుంభాభిషేక ప్రారంభ కార్యక్రమాలు
సంప్రదాయబద్దంగా జరిగాయి.
ఈ ప్రారంభ కార్యక్రమానికి శ్రీశైల జగద్గురు పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ చెన్నసిద్ధరామ పండితారాధ్య
శివాచార్య మహాస్వామి విచ్చేశారు.
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, దేవదాయశాఖా మంత్రి కొట్టు
సత్యనారాయణ దంపతులు, స్థానిక శాసన సభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి, ధర్మకర్తల మండలి
అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు
మఠం విరూపాక్షయ్యస్వామి, శ్రీమతి విజయలక్ష్మీ డా. సి. కనకదుర్గ పాల్గొన్నారు.ముందుగా వీరు సంప్రదాయబద్ధంగా పసుపు,కుంకుమలు, ఫలపుష్పాదులతో ఆలయ ప్రదక్షిణ
చేశారు. తరువాత యాగశాల ప్రవేశ కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ మహాకుంభాభిషేక సంకల్పం పఠించారు.
సంకల్పంలో, దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా
సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికి
ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు,
వాహన, ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని
కోరారు.
తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని గణపతిపూజ నిర్వహించారు.
అనంతరం బుత్విగ్వరణం, నిర్వహించారు. మహాకుంభాభిషేకంలో ఆయా కార్యక్రమాలు
నిర్వహించాలని బుత్వికులను ఆహ్వానిస్తూ దీక్షవస్తాలను అందజేసే కార్యక్రమానికి బుత్విగ్వరణం అని
అంటారు
ఆ తరువాత దీక్షాధారణ, పర్యగ్నికరణం,పుణ్యాహవాచనం, పంచగవ్యప్రాశన, మండపారాధనలు,
అఖండదీపస్థాపన కార్యక్రమాలు జరిగాయి.
అదేవిధంగా కార్యక్రమములో భాగంగానే మూలమంత్రజపాలు, పారాయణలు కూడా
జరిగాయి.
ఈ సాయంకాలం మృత్సంగ్రహణము,అంకురార్ప్చణ, _ అగ్నిమథనం, అగ్నిప్రతిష్థాపన,
దేవతాహవరనములు, వేదహవనములు, జలాధివాసము తదితర కార్యక్రమాలు జరిగాయి.
కాగా ప్రధానాలయంలో శివాజీగోపుర పునర్నిర్మాణం, ఆలయప్రాంగణంలోని కొన్ని ఉపాలయాల
పునరుద్ధరణ, పంచమఠాలలోని మూడు మఠాల పునరుద్ధరణ , ఆయా ఉపాలయాలో, మఠాలలో
శివలింగ, నందీశ్వరుల ప్రతిష్ట సందర్భంగా ఈ మహాకుంభాభిషేకం జరుగుతోంది.
ఈ మహిమాన్విత కార్యక్రమములో విధివిధానముగా కలశాలను నెలకొల్పి, ఆయా కలశాలలో దేవతాశక్తిని నిక్షిప్తం చేసి
జప,పారాయణ,ధ్యాన, హోమాదులను జరిపి, ఆ మంత్రపూరిత జలాలతో ఆలయంలోని గర్భాలయ
విమానాలను, గోపురాలను, దేవతామూర్తులను అభిషేకిస్తారు.
ఈ కుంభాభిషేకం చేసినందువల్ల ఆలయ విమాన శిఖరాన్ని దర్శించినంతనే చతుర్విధ
పురుషార్థసిద్ధి, మానసిక ప్రశాంతత, భక్తి అధ్యాత్మిక పరిపుష్టి, ఆయుర్వృద్ధి ,కీర్తి, జయం కలుగుతాయని,
శారీరక, మానసిక వ్యాధులు నశిస్తాయని, సకల ఆపదలు తొలుగుతాయని, అభివృద్ధి చేకూరుతుందని
నమ్మకం.