శ్రీశైల దేవస్థానం:దేవస్థాన కార్యనిర్వహణాధికారిగా నియమితులైన ఎం. శ్రీనివాసరావు గురువారం పరిపాలనా భవనం లో అధికార బాధ్యతలను స్వీకరించారు.బాధ్యతల స్వీకరణకు ముందు ఆలయం లో శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకుని పూజాదికాలను జరిపించుకున్నారు.
అధికార బాధ్యతలు స్వీకరించిన అనంతరం కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు నిర్వహించే అవకాశం రావడం తన పూర్వజన్మసుకృతంగా భావిస్తున్నానన్నారు. శ్రీస్వామిఅమ్మవార్లను సేవించుకునే భాగ్యం కలగడం తన అదృష్టమన్నారు. శ్రీ భ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల కృపతో ఈ అవకాశం లభించిందన్నారు.కార్యనిర్వహణాధికారిగా భక్తులకు సేవచేసే అవకాశం కూడా లభించడం ఎంతో ఆనందాన్నికలిగిస్తుందన్నారు.
ప్రభుత్వం శ్రీశైలక్షేత్రాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేయాలనే కృతనిశ్చయంతో ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారు, గౌరవ ఉపముఖ్యమంత్రివర్యుల పవన్ కల్యాణ్ , దేవదాయశాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మానవ వనరులు అభివృద్ధిశాఖామంత్రి నారా లోకేష్ , స్థానిక పార్లమెంట్ సభ్యులు శ్రీమతి శబరి, స్థానిక శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి శ్రీశైలక్షేత్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉన్నారన్నారు. వారి సూచనలతోనూ , ఉన్నతాధికారులు, దేవస్థాన అర్చకస్వాములు, వేదపండితులు, ఇతర సిబ్బంది సహాయ సహకారాలతో శ్రీశైలక్షేత్రాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు తనవంతుగా కృషి చేస్తానన్నారు. అదేవిధంగా తనకు పూర్తి సహకారాలు అందించి క్షేత్రాభివృద్ధికి పాటుపడాలని సిబ్బందికి సూచించారు.
ముఖ్యంగా భక్తులకు తగిన వసతి, సౌకర్యవంతమైన దర్శనం, అన్నప్రసాద వితరణ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చడం జరుగుతుందన్నారు ఈ ఓ. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. సిబ్బంది అందరు కూడా అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా భక్తులతో మర్యాదగా మెలగాలన్నారు.రాబోయే జనవరి మాసంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలను, ఫిబ్రవరిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలను, మార్చిలో ఉగాది మహోత్సవాలను నిర్వహించాల్సిఉందన్నారు. ఆయా ఉత్సవాల నిర్వహణకు ప్రణాళికబద్దంగా అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయడం జరుగుతుందన్నారు.
కాగా బాధ్యతల స్వీకరణ సందర్భంగా అర్చకస్వాములు, వేదపండితులు కార్యనిర్వహణాధికారి కి ఆశీర్వచనాలను అందించారు. పలువురు అధికారులు, సిబ్బంది శుభాభినందనలు తెలియజేశారు.
*అన్నప్రసాద వితరణ విభాగ పరిశీలన*
దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా ఎం. శ్రీనివాసరావు అధికార బాధ్యతలను స్వీకరించిన
అనంతరం దేవస్థానం అన్నప్రసాద వితరణ విభాగాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. అన్నప్రసాద వితరణ మందిరంలోని భోజనశాలలు, పాకశాల, కూరగాయలు నిల్వచేసే కోల్డ్ స్టోరేజ్ ది, అన్నప్రసాదాల స్టోరు మొదలైనవాటిని పరిశీలించారు.
ఈ సందర్భంగా అన్నప్రసాదాల వితరణలో వండుతున్న రోజువారి వంటవివరాలు మొదలైన వాటిని అడిగితెలుసుకున్నారు. వంటశాలలో ఈ రోజు అన్నప్రసాదవితరణకు వండిన వంటకాలను కూడా పరిశీలించారు.
వంటకాలన్నింటిని రుచికరంగా తయారు చేస్తుండాలని పాకశాలసిబ్బందికి సూచించారు. ఈ విషయమై అధికారులు ఎప్పటికప్పుడు తగు పర్యవేక్షణ చేస్తుండాలన్నారు.
అదేవిధంగా అన్నప్రసాదాలను స్వీకరించేందుకు వచ్చిన భక్తులతో మర్యాదతతో మెలగాలని అన్నప్రసాద వితరణ సిబ్బందిని ఆదేశించారు.
ముఖ్యంగా వంటశాలను, భోజనశాలను , అన్నదాన ప్రాంగణమంతా కూడా ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తుండాలన్నారు.
అనంతరం అధికారులతో మాట్లాడుతూ అన్నప్రసాద వితరణలో రోజువారిగా ఉపయోగించే కూరగాయలన్నీ తాజాగా ఉండాలన్నారు.తరువాత అన్నప్రసాదాలను స్వీకరిస్తున్న పలువురు భక్తులతో ముఖాముఖిగా సంభాషించి అన్నప్రసాదవితరణపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. భక్తులందరు కూడా దేవస్థానం అందజేస్తున్న అన్నప్రసాదాల పట్ల పూర్తి సంతృప్తివ్యక్తం చేశారు.
తరువాత కమాండ్ కంట్రోల్ రూమును పరిశీలించారు. క్షేత్రపరిధిలో వివిధ చోట్ల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల వివరాలను ఇంజనీరింగ్ అధికారులు కార్యనిర్వహణాధికారికి వివరించారు.