
శ్రీశైల దేవస్థానం: పౌర్ణమి సందర్భంగా శ్రీఅమ్మవారికి లక్ష కుంకుమార్చన జరిపారు.
ఈ లక్ష కుంకుమార్చనలో భక్తులు పరోక్షసేవగా పాల్గొనే అవకాశం కూడా కల్పించారు. కాగా ఈ రోజు మొత్తం 22 మంది భక్తులు పరోక్షసేవగా ఈ కుంకుమార్చనను జరిపించుకున్నారు.
ఇందులో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర ప్రాంతాల కు చెందిన భక్తులు ఈ పూజలను నిర్వహించుకున్నారు.
లక్ష కుంకుమార్చనలో ముందుగా పూజా సంకల్పం పఠించారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజను నిర్వహించారు. అనంతరం లక్షకుంకుమార్చన జరిపారు.
కాగా మంగళకరమైన ద్రవ్యాలలో కుంకుమకు ఎంతో ప్రాధాన్యం ఉందని, ఈ కుంకుమ ద్రవ్యముతో అమ్మవారిని అర్చించడం విశేష ఫలదాయకమని పండితులు పేర్కొంటున్నారు.
ఈ లక్షకుంకుమార్చన జరిపించుకోవడం వలన కష్టాలు తొలగిపోతాయని, సర్వశుభాలు కలుగుతాయని, అభీష్టాలు సిద్ధిస్తాయని, సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని, సంసారం వృద్ధిలోకి వస్తుందని, సంతాన సౌఖ్యం కలుగుతుందని, పూర్వజన్మదోషాలు తొలగిపోతాయని నమ్మకం.
కాగా శ్రీశైలక్షేత్రానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు వారి గోత్రనామాలతో ఆయా ఆర్జితసేవలను పరోక్షంగా జరిపించుకునేందుకు వీలుగా దేవస్థానం ఈ ఆర్జిత పరోక్ష సేవను నిర్వహిస్తోంది.
ఈ పరోక్షసేవకు భక్తులు ఆన్లైన్ ద్వారా రూ.1,116/- లను సేవా రుసుముగా చెల్లించాల్సి
ఉంటుంది.
భక్తులు సేవా రుసుమును www.srisailadevasthanam.org లేదా aptemples.ap.gov.in ద్వారా చెల్లింపు చేయవచ్చు.
ఇతర వివరములకు దేవస్థానం సమాచార కేంద్రం ఫోన్ నంబర్లు 83339 01351 / 52 / 53 లను సంప్రదించవచ్చును