×

అన్ని ఏర్పాట్లతో మంగళవారం కుంభోత్సవం

అన్ని ఏర్పాట్లతో మంగళవారం కుంభోత్సవం

శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానంలో మంగళవారం కుంభోత్సవం జరుగుతుంది. లోక కల్యాణం కోసం శ్రీ భ్రమరాంబాదేవి వారికి  ప్రతి సంవత్సరం చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళ లేదా శుక్రవారాలలో ( ఏదిముందుగా వస్తే ఆ రోజు)  సాత్త్విక బలిని సమర్పించేందుకు ఈ ఉత్సవం నిర్వహిస్తున్నారు. ఉత్సవంలో గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, అన్నపురాసి మొదలైనవి అమ్మవారికి సాత్త్వికబలిగా సమర్పిస్తారు.

 కుంభోత్సవాన్ని ఉదయం ప్రాత:కాలపూజల అనంతరం శ్రీ అమ్మవారికి ఆలయ అర్చకులు నవావరణ పూజ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర శతనామ కుంకుమ పూజలను. జపపారాయణలను నిర్వహిస్తారు. అచారాన్ని అనుసరించి ఈ పూజలన్ని ఏకాంతంగా చేస్తారు.

తరువాత అమ్మవారి ఆలయం ముందు భాగంలో రజకునిచేత ముగ్గు  వేయించి  శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి తొలి విడత సాత్త్వికబలి సమర్పిస్తారు. ఈ సాత్త్వికబలిలో కొబ్బరికాయలు, నిమ్మకాయలు, గుమ్మడికాయలు సమర్పిస్తారు.

కుంభోత్సవంలో భాగంగానే హరిహరరాయగోపుర ద్వారం వద్ద  మహిషాసురుమర్ధిని అమ్మవారికి (కోటమ్మవారికి) ప్రత్యేకపూజాదికాలను జరిపించి సాత్త్మికబలిగా కొబ్బరికాయలను సమర్పిస్తారు.

తరువాత ఈ ఉత్సవాలలో భాగంగానే సాయంకాలం శ్రీ మల్లికార్జునస్వామివారికి ప్రదోషకాలపూజల అనంతరం అన్నాభిషేకం జరిపిస్తారు. శ్రీ స్వామివారి ఆలయ ద్వారాలు మూసివేస్తారు. స్వామివార్ల పూజల అనంతరం అమ్మవారి ఆలయానికి ఎదురుగా సింహ మండపం వద్ద వండిన అన్నకుంభరాశిగా వేస్తారు.

తరువాత సంప్రదాయాన్ని అనుసరించి స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారకి కుంభహారతిని సమర్పించడంతో ఉత్సవంలోని ప్రధాన ఘట్టం ప్రారంభమవుతుంది. తరువాత రెండో విడత సాత్త్వికబలిని సమర్పించాక భక్తులను దర్శనానికి అనుమతీస్తారు. చివరగా అమ్మవారికి ప్రత్యేక పూజలను చేసి తొమ్మిది రకాల పిండివంటలతో మహానివేదన చేస్తారు.

 ఉత్సవంలో రాత్రి గం. 7.00 ల నుండి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. శ్రీ స్వామివారి ఆలయంలో మాత్రం మధ్యాహ్నం వరకు ఆర్జిత అభిషేకాలు, సర్వదర్శనం కొనసాగుతాయి. ఉత్సవాన్ని పురస్కరించుకుని ఎప్పటి మాదిరిగా  శ్రీస్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవం, ఏకాంత సేవ నిలుపుదల చేస్తారు. అదేవిధంగా అమ్మవారి ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలు కూడా నిలుపుదల చేస్తారు.

print

Post Comment

You May Have Missed