శ్రీశైల దేవస్థానం:లోక కల్యాణంకోసం శ్రీ భ్రమరాంబాదేవి వారికి మంగళవారం సంప్రదాయబద్దంగా
కుంభోత్సవం జరిపించారు.
కుంభోత్సవం జరిపించారు.ప్రతీ సంవత్సరం చైత్ర మాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళ లేదా శుక్రవారాలలో ( ఏ వారం ముందుగా వస్తే ఆ రోజు) అమ్మవారికి సాత్వికబలిని సమర్పించేందుకు ఈ విశేష ఉత్సవం నిర్వహించడం సంప్రదాయం.
ఈ ఉత్సవంలో గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, అన్నరాసి మొదలైనవి అమ్మవారికి సాత్విక బలిగా సమర్పించారు.
ఈ ఉదయం జరిగిన కార్యక్రమాలలో కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకస్వాములు, వేదపండితులు, సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
మొత్తం మీద ఈ ఉత్సవంలో దాదాపు 20వేలకు పైగా గుమ్మడికాయలు, 5వేలకు పైగా కొబ్బరికాయలు, సుమారు లక్షకు పైగా నిమ్మకాయలు మరియు వండిన అన్నం (కుంభం) అమ్మవారికి సాత్త్వికబలిగా సమర్పించారు.
ఈ ఉత్సవంలో అధిక పరిమాణంలో పసుపు, కుంకుమలను అమ్మవారికి సమర్పించారు. ఈ పసుపు,కుంకుమల సమర్పణకే “శాంతి ప్రక్రియ” అని పేరు.
ఇక స్థానిక వ్యాపార సంఘం వారు గుమ్మడికాయలు, కొబ్బరికాయలు, వండిన అన్నం అమ్మవారికి సాత్విక బలిగా సమర్పించారు.
కాగా కుంభోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఉదయం ప్రాత:కాల పూజల అనంతరం శ్రీ అమ్మవారికి ఆలయ అర్చకులు నవావరణపూజ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర కుంకుమ పూజలను, పారాయణలను నిర్వహించారు. ఆచారాన్ని అనుసరించి ఈ పూజలన్నీ అమ్మవారికి ఏకాంతంగా జరిపించారు.
తరువాత అమ్మవారి ఆలయంలో రజకునిచేత ప్రత్యేక ముగ్గు వేయించిన శ్రీ చక్రం వద్ద విశేష పూజలు చేసారు.దీనికే రజక రంగవల్లి అని పేరు.
తరువాత సాత్త్వికబలికి సిద్ధం చేసిన కొబ్బరికాయలు, గుమ్మడికాయలకు పూజాదికాలు జరిపించారు. అనంతరం అమ్మవారికి కొబ్బరికాయలు, గుమ్మడికాయలు సమర్పించారు.
ఈ మొదటి విడత సాత్త్విక బలి సమర్పణకు తరువాత హరిహరరాయగోపుర ద్వారం వద్ద గల మహిషాసురమర్దని అమ్మవారికి (కోటమ్మవారికి) ప్రత్యేక పూజాదికాలను జరిపించి సాత్త్వికబలిగా కొబ్బరికాయలు, గుమ్మడికాయలు సమర్పించారు.
కాగా ఈ ఉత్సవాలలో భాగంగానే సాయంకాలం శ్రీమల్లికార్జునస్వామివారికి ప్రదోషకాల పూజల అనంతరం అన్నాభిషేకం జరిపించారు.
స్వామివార్ల పూజల అనంతరం అమ్మవారి ఆలయానికి ఎదురుగా సింహమండపం వద్ద వండిన అన్నం కుంభరాసిగా వేసారు.
తరువాత సంప్రదాయాన్ని అనుసరించి స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతిని సమర్పించడంతో ఉత్సవంలోని ప్రధాన ఘట్టం ప్రారంభమయింది. తరువాత రెండో విడత సాత్విక బలి సమర్పించారు.
చివరగా అమ్మవారికి ప్రత్యేక పూజలను చేసి పిండి వంటలతో అమ్మవారికి మహానివేదన చేసారు.
కాగా ఈ ఉత్సవంలో భాగంగానే గ్రామ దేవత అంకాళమ్మకు కూడా ఈ ఉదయం ప్రత్యేక పూజలను నిర్వహించారు.
